army vehicles attacked: దాడి వెనుక పాక్, చైనా | army vehicles attacked: Army Truck Attacked By Terrorists In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

దాడి వెనుక పాక్, చైనా

Published Sat, Dec 23 2023 5:15 AM | Last Updated on Sat, Dec 23 2023 8:23 AM

army vehicles attacked: Army Truck Attacked By Terrorists In Jammu Kashmir - Sakshi

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనాలపై దాడి వెనుక పాక్, చైనాల హస్తముందని రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారీగా మోహరించిన ఆర్మీని మరోవైపు తరలించేలా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే ఆ రెండు దేశాలు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నాయి.

కశ్మీర్‌ లోయలో ముఖ్యంగా పాక్‌ సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ లక్ష్యంగా ఇటీవల పెరిగిన ఉగ్ర దాడుల ఘటనలకు చైనా, పాకిస్తాన్‌ల ఉమ్మడి వ్యూహమే కారణమని చెబుతున్నాయి. ఆర్మీపై దాడుల ద్వారా భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్‌ ఇప్పటికే పూంఛ్‌ అటవీ ప్రాంతాల్లోకి 25 నుంచి 30 మంది వరకు ఉగ్రవాదులను దొంగచాటుగా పంపించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

కశ్మీర్‌ వైపు దృష్టి మళ్లించేందుకే..
గల్వాన్‌ సంక్షోభం అనంతరం భారత్‌ లద్దాఖ్‌కు భారీగా సైన్యాన్ని తరలించడం చైనాకు రుచించడం లేదు. అందుకే తిరిగి కశ్మీర్‌ వైపు భారత్‌ దృష్టిని మళ్లించేందుకే, పాక్‌తో కుమ్మక్కయి పశ్చిమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రాజేసేందుకు పూనుకుంది. భారత్‌ 2020లో ప్రత్యేక శిక్షణ పొందిన రాష్ట్రీయ రైఫిల్స్‌ బలగాలను పూంఛ్‌ నుంచి లద్దాఖ్‌కు భారత్‌ తరలించింది.

ఈ చర్యతో ఎంతో కీలకమైన లద్దాఖ్‌ ప్రాంతంలో చైనాపై భారత్‌దే పైచేయి అయ్యింది. అయితే, అదే సమయంలో పూంఛ్‌లో ఉగ్రవాదులను నిలువరించే వనరులు తక్కువపడ్డాయి. ఈ విషయం గ్రహించిన చైనా పూంఛ్‌లో పాక్‌కు దన్నుగా నిలుస్తూ ఉగ్ర చర్యలకు ఊతమివ్వసాగిందని రక్షణ రంగ నిపుణుడు కల్నల్‌ మనోజ్‌ కుమార్‌ చెప్పారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో కడుపుమంట
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దుపై చైనా, పాకిస్తాన్‌లు అసంతృప్తితో రగిలిపోతు న్నాయి. అందుకే, కశ్మీర్‌లో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీల్లో అశాంతిని ప్రేరేపించేందుకు కాచుక్కూర్చు న్నాయని రిటైర్డు కల్నల్‌ అజయ్‌ కొథియాల్‌ చెప్పారు. తాజాగా, సుప్రీంకోర్టు కూడా రద్దు సరైందేనని తీర్పు ఇవ్వడం ఆ రెండు దేశాలకు పుండుమీద కారం చల్లినట్లయిందన్నారు.

ఇకపై జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు అవి ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలున్నాయన్నారు.
అమెరికా తయారీ రైఫిళ్లు: గురువారం నాటి దాడికి తమదే బాధ్యతంటూ పాక్‌ కేంద్రంగా పనిచేసే లష్కరేతోయిబా అనుబంధ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ (పీఏఎఫ్‌ఎఫ్‌) ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. దాడికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. వారి చేతుల్లో అమెరికా తయారీ అత్యాధునిక ఎం4 కార్బైన్‌ అసాల్ట్‌ రైఫిళ్లు కూడా కనిపిస్తున్నాయి. గతంలోనూ ఉగ్రవాదులు వీటిని వాడిన దాఖలాలున్నాయి.

హెలికాప్టర్లు.. స్నైపర్‌ డాగ్స్‌
పూంచ్‌ జిల్లాలో అయిదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరుల కోసం గాలింపు ముమ్మరమైంది. గురువారం మధ్యాహ్నం సురాన్‌కోట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధేరా కి గలి– బఫ్లియాజ్‌ మార్గంలో ఉన్న ధట్యార్‌ మోర్హ్‌ సమీపంలోని మలుపులో ఎత్తైన కొండపై ఉగ్రవాదులు పొంచి ఉన్నారు. బలగాలతో వెళ్తున్న రెండు వాహనాల వేగం బ్లైండ్‌ కర్వ్‌లో నెమ్మదించగానే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు నేలకొరగ్గా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతరం ముష్కరులు ఇద్దరు జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేయడంతోపాటు వారి వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు ముష్కరులు పాల్గొని ఉంటారని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)అధికారులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన ఉగ్రవాదుల కోసం అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టేందుకు స్నైపర్‌ జాగిలాలను రంగంలోకి దించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసిన బలగాలు శుక్రవారం ఉదయం నుంచి అణువణువూ శోధిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement