3 పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’.. కునోలో చీతా కూనల సందడి | 3 Cubs Born To Namibian Cheetah Jwala At Kuno National Park | Sakshi
Sakshi News home page

3 పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’.. కునోలో చీతా కూనల సందడి

Published Tue, Jan 23 2024 10:33 AM | Last Updated on Tue, Jan 23 2024 11:06 AM

3 Cubs Born To Namibian Cheetah Jwala At Kuno National Park - Sakshi

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా ‘జ్వాల’ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంధ్ర యాదవ్‌  పేర్కొన్నారు.

‘కునోలోకి కూన చీతాలు వచ్చేశాయ్‌..జ్వాల అనే నమీబియా చీతా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆశ అనే చీతా రెండు కూనలకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే ఈ సంఘటన జరిగింది.  దేశంలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసేవారు, జంతు ప్రేమికులకు ఇది గుడ్‌ న్యూస్‌. భారత వన్యప్రాణులు వృద్ది చెందుతున్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. తల్లి వద్ద ఆడుకుంటున్న కూన చీతలకు సంబంధించిన ఓ క్యూట్‌ వీడియోను షేర్‌ చేశారు.

2023 మార్చిలో జ్వాలా చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది.

కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా తీసుకొచ్చిన శౌర్య అనే చీత జనవరి 16న మృతిచెందిన విషయం తెలిసిందే.  ఉదయం 11 గంటలకు శౌర్య అస్వస్థతకు గురవ్వడం గమనించినట్లు  అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కునోలోని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. వెంటనే దానికి వైద్యం అందించగా కుదుటపడిందని చెప్పారు, కానీ కాసేపటికే మళ్లీ బలహీనపడి వైద్యానికి స్పందించలేదని, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 
చదవండి: విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్‌’

ఇక  2022 సెప్టెంబరు 17న  ప్రాజెక్టు చీతా’లో భాగంగా మొదటి బ్యాచ్‌లో ఎనిమిది నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో తన పుట్టినరోజు సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో బ్యాచ్‌లో 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునోకు తీసుకొచ్చారు. అయితే మొత్తం 20 చీతాల్లో 8 చనిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం​ 10 చీతాలు( ఏడు పెద్దవి, మూడు కూనలు) మరణించాయి. ఇదిలా ఉండగా  గత 75 ఏళ్ల తర్వాత చీతాలు తిరిగి భారత్ గడ్డపై అడుగు పెట్టాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement