ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Published Wed, Jan 3 2024 4:34 AM | Last Updated on Wed, Jan 3 2024 9:23 AM

- - Sakshi

త్రిపురారం: మండలంలోని బాబుసాయిపేటలో వివాహిత హత్య కేసులో ఆమె ప్రియుడే నిందితుడని పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం కారణంగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం త్రిపురారం పోలీస్‌ స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాబుసాయిపేట గ్రామానికి చెందిన కొండమీది సైదులు కుమార్తె స్వాతికి ఏడేళ్ల క్రితం నిడమనూరు మండలంలోని ఇండ్లకోటయ్యగూడేనికి చెందిన ఉదయగిరి నారాయణతో వివాహం జరిగింది. స్వాతికి ఇండ్లకోటయ్యగూడేనికి చెందిన దోరెపల్లి శ్రీరాములుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం స్వాతి భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో స్వాతి బాబుసాయిపేటలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంది.

శ్రీరాములు స్వాతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ తరచూ బాబుసాయిపేటకు వచ్చి వెళ్తుండేవాడు. అయితే స్వాతికి తెలియకుండా శ్రీరాములు గత సంవత్సరం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటికీ శ్రీరాములు తరచూ స్వాతితో ఫోన్‌లో మాట్లాడుతుండగా శ్రీరాములు భార్యకు అనుమానం వచ్చి అతడిని నిలదీసింది. తాను స్వాతికి డబ్బులు ఇవ్వాలని అందుకే తరచూ ఆమె ఫోన్‌ చేస్తుందని శ్రీరాములు తన భార్యకు చెప్పాడు. ఇదే విషయమై శ్రీరాములు అత్తమామలకు అనుమానం కలిగి గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలకు తెలిస్తే తనకు భార్య, కుమారుడు దూరమవుతారని, అదేవిధంగా స్వాతి కూడా తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండడంతో ఎలాగైనా ఆమెను అంతమొందిచాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం శ్రీరాములు డిసెంబర్‌ 28వ తేదీ రాత్రి స్వాతికి ఫోన్‌ చేసి తన పల్సర్‌ బైక్‌పై బాబుసాయిపేటకు వచ్చాడు.

అప్పటికే మేకల కొట్టంలో నిద్రిస్తున్న స్వాతితో మాట్లాడుతూ ఆమెను చంపాలని అనుకోగా ఏదో అలజడి రావడంతో స్వాతి తల్లిదండ్రులు ఎవరూ అని అడగడంతో స్వాతి తన భర్తే వచ్చాడని తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాత శ్రీరాములు స్వాతిని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి వెనుక నుంచి ఆమె గొంతును కుడి మోచేతితో గట్టిగా అదిమిపట్టి ఎడమ చేతితో ముక్క మూసి ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె మృతిచెందింది. అనంతరం స్వాతి మృతదేహాన్ని మేకల కొట్టంలోకి తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా యథావిధిగా మంచంలో పడుకోబెట్టి ఆమె సెల్‌ఫోన్‌ తీసుకొని దుగ్గెపల్లి శివారులోని తన మామ సైదులు ఉంటున్న నంద్యాల సతీష్‌ తోట వద్దకు వెళ్లి అక్కడే ఉన్నాడు. డిసెంబర్‌ 29న త్రిపురారం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.

విచారణలో భాగంగా మంగళవారం పోలీసులు శ్రీరాములు వద్దకు వెళ్లి ప్రశ్నించగా అతడు నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన హాలియా సీఐ గాంధీనాయక్‌, త్రిపురారం ఎస్‌ఐ వీరశేఖర్‌, ఏఎస్‌ఐ రామయ్య, స్టేషన్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

వివాహేతర సంబంధాలతోనే..
ఎక్కువగా వివాహితల హత్యల వెనుక వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా ఉంటున్నాయని, వివాహేతర సంబంధాలతో కుటుంబాలను రోడ్డుపాలు చేసుకోవద్దని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి సూచించారు. మహిళలకు ఎలాంటి ఆపద ఉన్నా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement