24గంటలు ప్రజలకు సేవలు - | Sakshi
Sakshi News home page

24గంటలు ప్రజలకు సేవలు

Published Wed, Jun 19 2024 2:00 AM | Last Updated on Wed, Jun 19 2024 2:00 AM

24గంట

ములుగు/ఏటూరునాగారం/గోవిందరావుపేట: 24గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తానని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర అన్నారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయా శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, సీహెచ్‌ మహేందర్‌జీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉంటారని తెలిపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ– ఆఫీస్‌ విధానంపై కిందిస్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దని తెలిపారు. ఈ సమీక్షలో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, విద్యాశాఖ అధికారి పాణిని తదితరులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటన

ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి వరద ముంపు ప్రాంతాన్ని కలెక్టర్‌ దివాకర మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత వర్షాకాలంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వరదల సమయంలో ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. గత వర్షాకాలంలో జంపన్నవాగు పరీవాహక ప్రాంతంలోని కొండాయి గ్రామంలోకి వచ్చిన వరద పరిస్థితులను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.35 లక్షలతో ఐటీడీఏ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో కొండాయి వంతెనపై చేపట్టిన తాత్కాలిక వంతెన నిర్మాణ(ఐరన్‌ రోప్‌వే) పనులను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. అదే విధంగా గోవిందరావుపేట మండల పరిధిలోని ప్రాజెక్ట్‌నగర్‌ వరద ముంపు గ్రామాన్ని సందర్శించారు. వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగు వరద ఉధృతి పెరిగే సమయంలో పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. గతంలో ఇళ్లు ముంపునకు గురైన గ్రామస్తులు తమకు నూతన గృహాలను నిర్మించాలని కలెక్టర్‌ను కోరగా వాటిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ మొదటి సారిగా ప్రాజెక్ట్‌నగర్‌ రావడంతో గ్రామస్తులు కలెక్టర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సృజన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

No comments yet. Be the first to comment!
Add a comment
24గంటలు ప్రజలకు సేవలు
1/1

24గంటలు ప్రజలకు సేవలు

Advertisement
 
Advertisement
 
Advertisement