Tollywood Drugs Case: Details Of Telugu Film Stars Drugs Scandals In History, Details Inside - Sakshi
Sakshi News home page

సినిమా రంగంలోనే డ్రగ్స్‌ ఎందుకు?

Published Thu, Jun 15 2023 2:42 PM | Last Updated on Thu, Jun 15 2023 3:40 PM

Tollywood Film Stars Drugs Case What Happened Scandal - Sakshi

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి వచ్చింది. తాజాగా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తెలుగు చిత్రసీమను కుదిపేస్తుంది. ఇప్పటికే అతని కాల్‌ లిస్ట్‌లో ఇద్దరు స్టార్‌ హీరోయిన్‌లతో పాటు నలుగురు మహిళా నటులు ఉన్నారని సమాచారం. ఈ లింక్‌ వెనుక ప్రముఖ డైరెక్టర్‌ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలుగు పరిశ్రమలో డ్రగ్స్‌ మాఫియా కొత్త కాదు. 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్‌ను డ్రగ్స్‌తో షేక్‌ చేసిన అలెక్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. ర‌వితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు.

(ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్‌ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్‌)

నాటి విచారణలో ఏం తేల్చారు

దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆధ్వర్యంలో టాలీవుడ్‌కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్‌ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు.

దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.

(ఇదీ చదవండి: రాయలేని భాషలో బూతులు.. ‘సైతాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే..)

దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో ర‌వితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఈడీ తేల్చేసింది. వారిలో ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కేసును మూసివేసినట్లు అయింది.

ఈడీ ఎంట్రీతో ఆయన బదిలీ

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న సమయంలో ఈడీ రంగంలోకి దిగడం అబ్కారీ శాఖకు సంకటంగా మారింది. ఆ సమయంలో అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. తర్వాత ఆ సిట్‌కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్‌ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆ సమయంలో పలు విమర్శలు వచ్చాయి.

బాలీవుడ్‌లో డ్రగ్స్‌.. అక్కడా ఇదే స్టైల్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ కొడుకు ఆర్యన్‌ కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు అప్పట్లో దుమారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అతనికి క్లీన్‌ చిట్‌ వచ్చింది..అతను నిర్దోషిగా తేల్చి నార్కోటిక్స్‌ డిపార్ట్‌మెంట్ వదిలేసింది. మరి ఆర్యన్‌ నిర్దోషి అయితే 28 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? రెండు సార్లు బెయిల్‌ ఎందుకు తిరస్కరించారు? అసలు ఏ ఆధారాలతో పట్టుకున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటికి సమాధానాలు దొరకలేదు.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అని చెర్రీకి చెప్పా.. అలా చేయొద్దన్నాడు: ఉపాసన)

ఆర్యన్‌ కేసుకు ముందు కూడా బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్‌లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్‌కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో.. సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందర్నీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్ మూలస్తంభాలకూ డ్రగ్స్ లింకులున్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులిస్తారని పెద్దఎత్తున దుమారం రేగింది. కానీ అక్కడా కేసు సైలెంటైపోయింది.

సినిమా రంగంలోనే ఎందుకు?

సినిమా అనేది అనేక రంగుల ప్రపంచం. అక్కడ డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌లలో కొందరు ఈ డ్రగ్స్‌ కల్చర్‌కు అలవాటు పడుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఫిట్ నెస్, సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాడీని మైంటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండటానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు.

ఈ క్రమంలోనే డ్రగ్స్‌కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని... సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి డీలర్స్‌ దింపుతారని తెలుస్తోంది. ఆ మధ్య బాలీవుడ్‌ హీరోయిన్స్ కంగనా రనౌత్ - మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement