బాలీవుడ్‌లో తెలుగువాడి బయోపిక్‌.. ఎవరీ శ్రీకాంత్‌ బొల్లా? | Srikanth Trailer: Interesting Facts About Srikanth Bolla | Sakshi
Sakshi News home page

Srikanth Bolla: ఆంధ్రా అంధుడి జీవితంపై బాలీవుడ్ సినిమా.. ఎవరీ శ్రీకాంత్‌ బొల్లా?

Published Wed, Apr 10 2024 2:05 PM | Last Updated on Wed, Apr 10 2024 3:29 PM

Srikanth Trailer: Interesting Facts About Srikanth Bolla - Sakshi

ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ‘శ్రీకాంత్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్‌ కుమార్‌ రావు హీరోగా నటించగా, జ్యోతిక, శరత్‌ కేల్కర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్‌ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. 

పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్‌..తనకున్న లోపాన్ని దీటుగా ఎదుర్కొన్ని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్‌ బాల్యం సీన్‌తో బాల్యం సీన్‌తో ట్రైలర్‌ ప్రారంభం అయింది. బాల్యంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకున్న లోపాన్ని అదిగమించి పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు? బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ఎలా స్థాపించాడు? తదితర అంశాలలో చాలా ఎమోషనల్‌గా ట్రైలర్‌ సాగింది. శ్రీకాంత్‌ పాత్రలో రాజ్‌ కుమార్‌ రావు ఒదిగిపోయాడు. . టీ సీరిస్‌, ఛాక్‌ అండ్‌ ఛీస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఎవరీ శ్రీకాంత్‌?
శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‍లోని మచిలీపట్నం. 1991లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధుడు. చూపు లేకపోవడంతో చిన్నప్పుడే అతన్ని వదిలించుకోవాలని తల్లిదండ్రలకు కొంతమంది బంధువులు సలహా ఇచ్చారట. కానీ వాళ్లు మాత్రం తమ కొడుకును పట్టుదలతో చదివించారు. తనకున్న లోపాన్ని అనుకూలంగా మార్చుకొని కష్టపడి చదివాడు శ్రీకాంత్‌. 

ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్ధులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో శ్రీకాంత్‌ హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయ్యాడు. ఇంజనీర్‌ కావాలన్నది ఆయన కల. అది జరగాలంటే సైన్స్‌, మ్యాథ్స్‌ చదవాలి.  కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. 

ఈ  విషయంపై కోర్టుకెక్కాడు ఆయన. ఆరు నెలల విచారణ తర్వాత ఆయన సైన్స్‌ సబ్జెక్ట్‌ చదివేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటర్మీడియట్‍లో 98 శాతంతో క్లాస్‍లో టాపర్‌గా ఆయన నిలిచారు. ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా.. అంధుడైన కారణంగా ఆ అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్‌లు వచ్చాయి. మసాచుసెట్స్‌లోని ఎంఐటీని ఆయన ఎంచుకున్నారు.

అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి  శ్రీకాంత్. ఎంఐటీలో మేనేజ్‌మెంట్ సైన్స్‌లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్‌ కూడా వచ్చింది. కానీ తాను మాత్రం ఇండియాలోనే పని చేయాలనుకున్నాడు. 2012లో తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు.  బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ, తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన ‘ 30 ఏళ్లలోపు 30 మంది’  జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది. 2022లో స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఈ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement