నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు  | Nani: I wish Japan becomes a massive success | Sakshi
Sakshi News home page

నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు

Published Sat, Nov 4 2023 2:40 AM | Last Updated on Sat, Nov 4 2023 2:40 AM

Nani: I wish Japan becomes a massive success - Sakshi

‘‘ఈగ’ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత నేను ఎప్పుడు చెన్నై వెళ్లినా.. నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు. అలాగే కార్తీని చూస్తే చాలామంది తెలుగు ప్రేక్షకులు తెలుగబ్బాయిలా ఉన్నాడంటారు. నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు కార్తీని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడు హిట్స్‌ సాధించి ఇప్పుడు ‘జపాన్‌’తో ముందుకొస్తున్నాడు కార్తీ.

దీపావళికి వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో నాని అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ‘జపాన్‌’. రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ – ‘‘జపాన్‌’ లాంటి చిత్రం తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులభం కాదు.

కానీ, ఈ మూవీ ట్రైలర్‌ చూశాక టీమ్‌ ఎనర్జీ, నమ్మకం నాకు కనిపించింది. అనూ ఇమ్మాన్యుయేల్‌ నా ‘మజ్ను’ సినిమాతో పరిచయమైంది. ‘జపాన్‌’ ట్రైలర్‌ చూసినప్పుడు చాలా మంచి సినిమాలో భాగస్వామ్యం అయినట్లు అనిపించింది. ప్రభుగారు మంచి సినిమాలు నిర్మిస్తుంటారు. లెక్కలు చూసుకుని పని చేసే నిర్మాత కాదు.. ఫ్యాషన్‌తో,ప్రాణం పట్టి పనిచేసే నిర్మాతలాగా అనిపిస్తారు.

ఇలాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్‌ రాజు మురుగన్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘జపాన్‌’ నా మనసుకు బాగా దగ్గరైంది’’ అన్నారు కార్తీ.  ‘‘జపాన్‌’ అంతా రాజు మురుగన్‌ శైలిలో ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అన్నపూర్ణ స్టూడియోస్‌ భాగస్వామ్యంలో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని ఎస్‌ఆర్‌ ప్రభు అన్నారు.

రాజు మురుగన్‌ మాట్లాడుతూ– ‘‘కళకు భాషతో సంబంధం లేదు. తెలుగు ప్రేక్షకులు సినిమాని పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటారు. భారతీయ సినిమాకి ఐకానిక్‌గా గుర్తింపు పోందింది టాలీవుడ్‌’’ అన్నారు.  ఈ వేడుకలో నిర్మాత సుప్రియ, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటులు సునీల్, రాకేందు మౌళి, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement