చినుకు చింత - | Sakshi
Sakshi News home page

చినుకు చింత

Published Sat, Jun 22 2024 1:40 AM | Last Updated on Sat, Jun 22 2024 1:40 AM

చినుక

శనివారం శ్రీ 22 శ్రీ జూన్‌ శ్రీ 2024

సాక్షి, మహబూబాబాద్‌: వానాకాలం పంట సీజన్‌ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా.. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. తొలకరి జల్లులను నమ్ముకొని వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు ఎండలకు వాడిపోతున్నాయి. ఇక కొత్తగా విత్తనాలు వేసేందుకు భూమిలో పదును లేదు. కాగా దుక్కులు దున్నుకొని వర్షం ఎప్పుడు పడుతుందా.. విత్తనాలు ఎప్పు డు వేద్దామా అని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మొలకెత్తని విత్తనాలు

వానాకాలం సీజన్‌కావడంతో.. వర్షాలు పడుతాయనే ధీమాతో రైతులు వేసిన విత్తనాలు పలుచోట్ల మొలకెత్తలేదు. జిల్లాలో సగటున ఈనెల 3వ తేదీన 23 మిల్లీ మీటర్లు, 6న 8.4మిల్లీ మీటర్లు, 7న 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా జిల్లా సాధారణ వర్షపాతం102 మిల్లీ మీటర్లు ఉండగా 28మిల్లీ మీటర్లు అధికంగా అనగా 130 మిల్లీ మీటర్లు కురిసింది. దీంతో వర్షాకాలం మొదలైందని భావించి ముందు వర్షానికి దుక్కులు దున్నుకొని వెంటనే విత్తనాలు వేశారు. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు 650ఎకరాల్లో మొక్కజొన్న, 55,623 ఎకరాల్లో పత్తి, 2030ఎకరాల్లో పెసర, 340 ఎకరాల్లో కందులు, 185 ఎకరాల్లో పసుపు వేశారు. ఇందులో సగానికి పైగా విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని విత్తనాలు మొలకెత్తగా.. ఎండల తీవ్రతతో మొక్కలు వాడిపోతున్నాయి.

దుక్కులు దున్ని.. దిక్కులు చూస్తూ..

వర్షాకాలం ఎంత త్వరగా విత్తనాలు వేస్తే చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకోసమే జూన్‌ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు. రోహిణి కార్తెలోనే వరి నార్లు పోస్తారు. అయితే ఈ ఏడాదిలో జూన్‌ నెలలో ఇప్పటి వరకు ఎనిమిది రోజులు మాత్రమే వర్షం కురిసింది. అది కూడా అంతటా పడలేదు. దీంతో ఎక్కువ వర్షం కురిసిన ప్రాంతాల్లో ముందుగా దుక్కులు దున్నుకొని పత్తి, మొక్కజొన్న, పెసర, కంది విత్తనాలు, పసుపు వేశారు. ఇలా జిల్లాలో 4,29,790 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 58,828ఎకరాల్లో మాత్రం పంటలు సాగు చేశారు. ఇందులో అధికంగా 55,623ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. తక్కువ వర్షం కురిసిన చోట దుక్కులు దున్నిన తర్వాత కనీస స్థాయిలో కూడా భూమిలో తేమశాతం లేకుండా పోయింది. దీంతో వర్షం వస్తే కానీ విత్తనాలు నాటే పరిస్థితి లేదు. అదేవిధంగా ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో వాటి స్థానంలో మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, రోజు ఆకాశం మేఘావృతం కావడం.. వర్షం వస్తుందని ఆశగా చూడడం, తీరా వాన పడకపోవడంతో రైతుల నిరాశ చెందడం పరిపాటిగా మారింది. అదేవిధంగా వర్షం కురిస్తేనే పంటలు, బతుకులు కావునా.. వర్షాలు పడాలని గంగమ్మ పూజలు, కప్పతల్లి ఆటలు, ఉయ్యాల పాటలతో వరుణ దేవుడిని కోరుతున్నారు.

పంటల సాగు వివరాలు (ఎకరాలు)

న్యూస్‌రీల్‌

దుక్కులు దున్ని వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్న రైతన్నలు

వేసిన గింజలు మొలకెత్తని పరిస్థితి

మళ్లీ వేద్దామంటే పదును లేక పాట్లు

అదును దాటుతుందని

రైతుల ఆందోళన

వర్షం పడితేనే సాగు సాగేది..

ఈ ఫొటోలోని రైతు పేరు పిట్టల వెంకన్న కురవి మండలం బలపాల గ్రామం. మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు మొదలు పెట్టాడు. ఏడు పత్తి విత్తన పాకెట్లు తీసుకొచ్చి చేనులో విత్తాడు. ఎండల తీవ్రతతో పత్తి గింజలు మొలవక తీవ్రంగా నష్టపోయాడు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తిరిగి మరో నాలుగు ప్యాకెట్లను తీసుకొచ్చి విత్తాడు. మొత్తంగా మూడున్నర ఎకరాల్లో ఇప్పటివరకు సుమారు రూ.40 వేలు ఖర్చు చేశాడు.

పంట సాగు అంచనా ప్రస్తుత సాగు

వరి 2,15,278 00

పత్తి 84,070 55,623

మొక్కజొన్న 53,037 650

పెసర 1,722 2030

కందులు 1,236 340

పసుపు 1,870 185

ఇతర పంటలు 72,577 00

మొత్తం 4,29,790 58,828

వర్షాలు లేక పత్తి గింజలు మొలకెత్తలేదు

నేను మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్న. మొదట చిరుజల్లులు పడడంతో ఆశతో పత్తి విత్తన ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టినం. కానీ అనుకున్నట్టు వానలు పడలే.. దీంతో భూమిలో పత్తి గింజలు మొలకలు రాలేదు. దాదాపు విత్తనాల ప్యాకెట్ల ఖర్చు రూ.20 వేలు అయింది. మళ్లీ విత్తన ప్యాకెట్లు తీసుకురావాలంటే అప్పు చేయాలి.

–సామ శ్రీనివాస్‌, అమీనాపురం, కేసముద్రం

No comments yet. Be the first to comment!
Add a comment
చినుకు చింత
1/1

చినుకు చింత

Advertisement
 
Advertisement
 
Advertisement