జాతీయ రహదారి భూ సేకరణ అస్తవ్యస్తం - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారి భూ సేకరణ అస్తవ్యస్తం

Published Fri, Jun 21 2024 1:44 AM | Last Updated on Fri, Jun 21 2024 1:44 AM

జాతీయ రహదారి భూ సేకరణ అస్తవ్యస్తం

అధికారులతో సమావేశంలో నిర్వాసితులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: జాతీయ రహదారి 216హెచ్‌ విస్తరణ, హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని పలువురు నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం వేలేరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో 216హెచ్‌ జాతీయ రహదారి విస్తరణ భూసేకరణపై రెవెన్యూ, కేంద్ర రహదారులు, రవాణా శాఖ అధికారులు గురువారం నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ పెడన–లక్ష్మీపురం రోడ్డును 216హెచ్‌ జాతీయ రహదారిగా మార్చి బందరు పోర్టుకు ప్రధాన రహదారిగా నిర్మించ తలపెట్టిన విషయం విదితమే. ఈ రహదారికి ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని హనుమాన్‌జంక్షన్‌ వద్ద 11 కిలోమీటర్లు మేర బైపాస్‌ రోడ్డు నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సర్వే నిర్వహించి, భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతుల అభ్యంతరాలను స్వీకరించేందుకు వేలేరులో నిర్వహించిన సమావేశానికి గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, కేంద్ర ప్రభుత్వ రహదారులు, రవాణా శాఖ మచిలీపట్నం ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.సాయి శ్రీనివాస్‌, బాపులపాడు తహసీల్దార్‌ అంకం శ్రీనివాస్‌, సర్వే డీఐ నరసింహరావు హాజరయ్యారు.

కనీస సమాచారం లేకుండా..

భూసేకరణ నోటిఫికేషన్‌లో ప్రైవేట్‌ భూములను కూడా ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారని, రైతుల అనుమతి, కనీస సమాచారం లేకుండా వారి భూముల్లో కాంక్రీట్‌ పిల్లర్లు వేశారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం–2013 మేరకు నష్ట పరిహారం అందజేయాలని, వ్యవసాయ బోర్లు, పామాయిల్‌, ఇతర పంట మొక్కలకు కూడా పరిహారం మంజూరు చేయాలని కోరుతూ అధికారులకు వేలేరు నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌లోని తప్పులను సవరిస్తూ మరొక సప్లమెంటరీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం మంజూరు చేస్తామని ఆర్డీవో పద్మావతి చెప్పారు. మాజీ సర్పంచ్‌ వేములపల్లి శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్‌ ఆవిర్నేని భవానీ శంకర్‌, మండల సర్వేయర్‌ ఫణి కుమార్‌, వీఆర్వో రమేష్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement