హాస్టళ్లలో మెరుగైన వసతులు - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో మెరుగైన వసతులు

Published Wed, Jun 19 2024 11:14 PM | Last Updated on Wed, Jun 19 2024 11:14 PM

హాస్ట

కాకినాడ సిటీ: జిల్లాలో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, వసతి గృహాల్లో భోజనం, అల్పాహారం మెనూ, స్టడీ అవర్స్‌ నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ నివాస్‌ జిల్లా సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించిన సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో సుమారు 33 ఎస్సీ, 41 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగుల బాధ్యత పూర్తిగా సంబంధింత వసతి గృహాలు అధికారులదేనని అన్నారు. తాను రెండేళ్ల పాటు వసతి గృహాంలో ఉండి చదువుకున్నానని, సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. 2024–25 విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు ప్రణాళిక ప్రకారం పని చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహం గదుల్లో విద్యుత్‌, ట్యూబ్‌లైట్లు, మరుగుదొడ్లలో పరిశుభ్రత, బాత్రూం డోర్లు, సక్రమమైన నీటి సరఫరా, తాగునీరు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రత్యేకంగా బాలికల వసతి గృహాల్లోకి అపరిచిత వ్యక్తులు లోపలికి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా పిల్లలు బయటికి రాకుండా చూడాలన్నారు. స్టడీ అవర్స్‌ సక్రమంగా నిర్వహించాలన్నారు. పదోతరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వసతి గృహాల్లో అమలు చేస్తున్న భోజనం, అల్పాహారం మెనూకి సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్థానిక పీహెచ్‌సీ వైద్య అధికారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అధికారుల్లో ఉన్న నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి, మంచి దృక్పథంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ జేడీ డీవీ రమణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం.లల్లి, జిల్లా సంక్షేమ వసతి గృహాల సమన్వయ అధికారి జి.వెంకటరావు, ఎస్సీ, బీసీ అసిస్టెంట్‌ సంక్షేమ అధికారులు, వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు.

అధికారులకు కలెక్టర్‌ నివాస్‌ సూచన

No comments yet. Be the first to comment!
Add a comment
హాస్టళ్లలో మెరుగైన వసతులు
1/1

హాస్టళ్లలో మెరుగైన వసతులు

Advertisement
 
Advertisement
 
Advertisement