యోగాతో సంపూర్ణ ఆరోగ్యం - | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Published Sat, Jun 22 2024 1:10 AM | Last Updated on Sat, Jun 22 2024 1:10 AM

యోగాత

గద్వాల: నిత్యం యోగా సాధనతో మానసిక, శారీరక వికాసం కలుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ సంస్థలు, అధికారులు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన యోగా శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా యోగా శిక్షణ శిబిరంలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలోని పదో పోలీసు బెటాలియన్‌లో పోలీసులు ఘనంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు యోగా శిక్షణ ఇచ్చారు. బీజేపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా యోగాసనాలు వేసి యోగా డేను జరుపుకొన్నారు. స్థానిక వాల్మీకి భవన్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా, ఆయుష్‌ సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ శశికళ ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా శిక్షణ ఇచ్చారు. యోగా శిక్షకులు యోగాపై మెలకువలు వివరించారు. రుగ్మతలను దూరం చేసే ఆసనాలు.. ప్రశాంతతను చేకూర్చే ప్రాణయామం.. మనస్సును నియంత్రించే ధ్యాస.. ధ్యానం సాధనలతో జిల్లా వాసులు ఉషోదయాన సేదతీరారు. శిక్షకులు వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించి ఆరోగ్యానికి అవి ఎలా.. ఉపయోగపడతాయో సవివరంగా తెలియజేశారు. ఔత్సాహికులచే ఆసనాలు వేయించారు. పురుషులతో సమానంగా మహిళలు, విద్యార్థినీలు కూడా శిబిరానికి తరలివచ్చారు. యోగా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు.. ఈ క్రమంలోనే ప్రాథమికంగా యోగా శిక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను వివరించారు. సుమారు రెండు గంటల పాటు యోగా సాధన చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకోవాలని ఔత్సాహికులు కోరారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలని సూచించారు.

యోగా దినచర్యగా ఉండాలి

ఎర్రవల్లిచౌరస్తా: ప్రతి ఒక్కరికి యోగా దినచర్యగా ఉండాలని బీచుపల్లి పదో బాటాలియన్‌ కమాండెంట్‌ సాంబయ్య అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పదో బెటాలియన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కమాండెంట్‌ హాజరై సిబ్బందితో కలిసి యోగా ఆసనాలను వేశారు. అనంతరం మాట్లాడుతూ మానవ జీవితంలో ఆసనం వ్యసనం అయితే జీవితం ఆనందంగా సాగుతుందన్నారు. ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారని అలాంటి యోగాను భారతదేశం ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం గర్వకారణం అన్నారు. యోగా వల్ల మనస్సుకు శాంతి కలగడమే గాక శరీర దృడత్వం పెరుగుతుందన్నారు. అదేవిదంగా మానవునికి చీటికి మాటికి ఆవేశం కలగకుండా ఓర్పును ఇచ్చే గొప్ప విద్య యోగానేనని అన్నారు. కనుక ఖచ్చితంగా సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా యోగాకు ప్రతినిత్యం కొంచెం సమయం కేటాయించి ఆసనాలను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ చౌహాన్‌, ఆర్‌ఐలు రాజారావు, వెంకటేశ్వర్లు, శ్రీదర్‌, గోపాల్‌, ఆర్‌.పి సింగ్‌, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ

యోగా దినోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
1/1

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Advertisement
 
Advertisement
 
Advertisement