సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె | Pakistan General Elections 2024: Pak Army Shaping The Political Landscape | Sakshi
Sakshi News home page

సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె

Published Sat, Feb 3 2024 5:00 AM | Last Updated on Sat, Feb 3 2024 11:15 AM

Pakistan General Elections 2024: Pak Army Shaping The Political Landscape - Sakshi

అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్‌ షరీఫ్‌ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్‌ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్‌ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్‌ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్‌ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు.

శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్‌ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్‌ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది...

ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్‌ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది.

ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు.

నవాజ్‌ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్‌ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది.

నవాజ్‌ షరీఫ్‌
పాక్‌ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్‌ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్‌ అపార్ట్‌మెంట్స్‌ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్‌ పారిపోయారు.

అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్‌ సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్‌ (ఎన్‌) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్‌ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌
అనితరసాధ్యమైన క్రికెట్‌ నైపుణ్యంతో పాక్‌ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్‌ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్‌ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్‌ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్‌ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్‌ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది.

నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్‌ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్‌ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్‌ పత్రాలపై ఇమ్రాన్‌ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు.

బిలావల్‌ భుట్టో
35 ఏళ్ల బిలావల్‌ భుట్టో జర్దారీ పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్మన్‌. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో, పాక్‌ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్‌ షరీఫ్‌ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో
స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్‌ అవ్వొచ్చంటున్నారు.

పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు.

సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement