బ్రిటన్‌ ఒపీనియన్‌ పోల్స్‌.. ప్రధాని రిషి సునాక్ ఓటమి? | Opinion Polls Predict Electoral Extinction for UK PM Rishi Sunak's Party | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ ఒపీనియన్‌ పోల్స్‌.. ప్రధాని రిషి సునాక్ ఓటమి?

Published Sun, Jun 16 2024 7:16 AM

Opinion Polls Predict Electoral Extinction for UK PM Rishi Sunak's Party

బ్రిటన్‌లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్‌ పోల్స్‌లో ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఘోరంగా ఓడిపోతారని మరో సర్వే అంచనా వేసింది. జూలై 4న జరగనున్న ఈ ఎన్నికల్లో  ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని  ఇప్పటివరకూ మూడు సర్వేలు వెల్లడించాయి.

తాజా సర్వేలో కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్ల మేరకు తగ్గి 21 శాతానికి చేరుకుంది. జూన్ 12- జూన్ 14 మధ్య  ఈ సర్వేను మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత ‘సండే టెలిగ్రాఫ్’ కోసం  నిర్వహించింది. కొంతమేరకు ఎన్నికల ప్రచారం ముగిసిన తరుణంలో ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు రెండూ తమ మ్యానిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి.

కాగా మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్  అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్‌కిన్స్ తెలిపారు. ఈ సర్వేలో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇది 200 సంవత్సరాల బ్రిటన్‌ ఎన్నికల చరిత్రలో అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది.

బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వేలో ప్రధాని సునాక్  తన సీటును సైతం కాపాడుకోలేరని పేర్కొన్నారు. బెస్ట్ ఫర్ బ్రిటన్ 15,029 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. దీని ఆధారంగా రూపొందించిన నివేదికలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ ఈసారి 468 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement