అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు Houthis Launch Drone To Attack Ships In Red Sea | Sakshi
Sakshi News home page

అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు

Published Fri, Jan 5 2024 11:58 AM | Last Updated on Fri, Jan 5 2024 1:11 PM

Houthis Launch Drone To Attack Ships In Red Sea - Sakshi

న్యూయార్క్: ఎర్ర సముద్రంలో దాడులు నిలిపివేయాలని అమెరికా మిత్రపక్షాలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ హౌతీ ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయకుండా దాడులను మరింత పెంచే దుస్సాహసం చేస్తున్నారు. తాజాగా అమెరికా నావికాదళం, వాణిజ్య నౌకలకు సమీప దూరంలో డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. హౌతీలు సాయుధ మానవ రహిత ఉపరితల నౌక(USV)ను ప్రయోగించారని అమెరికా పేర్కొంది. 

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమైనప్పటి నుంచి మానవరహిత ఉపరితల నౌకను ప్రయోగించడం ఇదే మొదటిసారని అమెరికా నేవీ ఆపరేషన్స్ హెడ్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. యూఎస్‌వీలు హౌతీల సముద్ర యుద్ధాల్లో కీలకమైన భాగమని క్షిపణి నిపుణుడు ఫాబియన్ హింజ్ తెలిపారు. సౌదీ సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన యుద్ధాల్లో వాటిని ఉపయోగించారని చెప్పారు. తరచుగా సూసైడ్ డ్రోన్ పడవలను ఎక్కువగా ఉపయోగింస్తారని వెల్లడించారు. ఇరాన్‌లో తయారైన కంప్యూటరైజ్డ్ గైడెన్స్ సిస్టమ్స్‌లతో అమర్చబడి ఉంటాయని తెలిపారు. 

ఎ‍ర్ర సముద్రంలో హౌతీల దాడుల వెనక ఇరాన్ ఉందని యుఎస్ డిప్యూటీ రాయబారి క్రిస్టోఫర్ లూ అన్నారు. హౌతీలకు బాలిస్టిక్ క్షిపణులతో సహా అధునాతన ఆయుధ సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఇరాన్‌తో అమెరికా ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. 

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ  నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. హౌతీల దాడులు నిలిపివేయకపోతే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా మిత్ర దేశాలు గురువారం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాతే హౌతీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం గమనార్హం.  

ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement