Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ | Sakshi
Sakshi News home page

Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ

Published Sun, Jun 16 2024 5:07 AM

G7 Summit 2024: Italian Premier Meloni describes Putin cease-fire offer

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటనపై మెలోనీ 

బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు.

 ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్‌కు 50 బిలియన్‌ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్‌లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు.

 గాజా స్ట్రిప్‌పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్‌ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్‌ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. 

హమాస్‌ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్‌ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
 
Advertisement