ఐదు రెట్ల మరణాలు.. ఆందోళన కలిగిస్తున్న తాజా నివేదిక | Climate Crisis Set To Put More Lives At Risk If No Action To Phase Out Fossil Fuels, Know What Experts Says - Sakshi
Sakshi News home page

Reasons For Climate Crisis: ఐదు రెట్ల మరణాలు.. ఆందోళన కలిగిస్తున్న తాజా నివేదిక

Published Wed, Nov 15 2023 8:58 PM | Last Updated on Thu, Nov 16 2023 10:56 AM

Climate crisis set to put more lives at risk if no action to phase out fossil fuels - Sakshi

శిలాజ ఇంధనాల నిర్మూలనకు సాహసోపేతమైన చర్యలు తీసుకోకుంటే వాతావరణ సంక్షోభం మరింత మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని తాజా నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తోంది. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. 

వాతావరణ చర్యను ఆలస్యం చేయడం వల్ల 2050 నాటికి ఉష్ణ సంబంధిత మరణాలు దాదాపు ఐదు రెట్లు పెరుగుతాయని ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ లాన్సెట్‌లో నవంబర్‌ 14న ప్రచురితమైన వార్షిక కౌంట్‌డౌన్‌ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆరోగ్యం శిలాజ ఇంధనాల నిర్మూలనపైనే ఆధారపడి ఉందని పేర్కొంది.

మానవాళికి ముప్పు
ఓ వైపు  మానవాళి ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ, వాతావరణ మార్పులతో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ, కంపెనీలు కానీ మేల్కోవడం లేదని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని, విస్తరణను ప్రోత్సహిస్తూనే ఉన్నాయని నివేదిక రూపకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రైవేట్ కంపెనీలు చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్రణాళికల విస్తరణ, ఫైనాన్సింగ్‌తో శిలాజ ఇంధనంవైపు పయనిస్తూ మానవ మనుగడకు ముప్పు తెస్తున్నాయని లాన్‌సెట్‌ కౌంట్‌డౌన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ప్రధాన రచయిత మరీనా రొమనెల్లో సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థతో పేర్కొన్నారు. 

ఆర్థిక వ్యవస్థకూ నష్టమే
ప్రపంచం శిలాజ ఇంధనాలపై ఆధారపడటం కొనసాగితే , దాని పర్యవసానాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా విపత్తుగా మారవచ్చని రోమనెల్లో నొక్కిచెప్పారు. 1800ల చివరిలో పారిశ్రామిక పూర్వ యుగం నుంచి ఈ గ్రహం ఇప్పటికే దాదాపు 1.2 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. ఇది 2 డిగ్రీలకు చేరుకుందంటే ప్రపంచ దేశాలు 50 శాతం కార్మిక సామర్థ్యాన్ని నష్టపోతాయని, తద్వారా అపారమైన ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని  నివేదిక హెచ్చరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement