నదిలో మునిగి రష్యాలో భారతీయ విద్యార్థుల మృతి.. మృత దేహాలు వెలికితీత | Bodies Of Four Students Who Drowned In A Russia Being Flown To India | Sakshi
Sakshi News home page

రష్యా నది నుంచి భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత

Published Sat, Jun 8 2024 5:39 PM | Last Updated on Sat, Jun 8 2024 6:15 PM

Bodies Of Four Students Who Drowned In A Russia Being Flown To India

మాస్కో: రష్యాలో విషాదం చోటు చేసుకుంది.వోల్ఖోవ్‌ నది ఒడ్డుకు వాకింగ్‌కు వెళ్లి గల్లంతైన నలుగురు భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. మృతదేహాలను ముంబైకి తరలించి,తర్వాత మహరాష్ట్ర జల్‌గావ్‌ జిల్లాలోని విద్యార్ధుల స్వస్థలాలకు తరలించనున్నారు.

నదిలో గల్లంతైన విద్యార్ధులలో ఐదవ విద్యార్ధిని నిషా భూపేష్ సోనావానే రక్షించామని, అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

వాకింగ్‌కు వెళ్తుండగా ప్రమాదం..
మరణించిన భారతీయ వైద్య విద్యార్ధులు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సమీపంలోని యారోస్లావ్‌ ది వైస్‌ నోవ్‌గొరోడ్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన వారు. వోల్ఖోవ్ నది పక్కగా వాకింగ్‌కు వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.  

భారతీయ విద్యార్ధులకు హెచ్చరికలు
ఈ దుర్ఘటన తర్వాత రష్యాలోని భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్ధులకు హెచ్చరికలు జారీ చేసింది. రష్యాలోని భారతీయులు నదీ ప్రవాహక ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది.

వరుస దుర్ఘటనలు
రష్యాలో భారతీయ విద్యార్థులు మునిగిపోయే దురదృష్టకర సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇటువంటి సంఘటనలలో ఇప్పటివరకు నలుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

విద్యార్ధుల్లారా.. తస్మాత్‌ జాగ్రత్త
2023లో ఇద్దరు భారతీయ విద్యార్థులు, 2022లో ఆరుగురు రష్యాలోని నదుల్లో మునిగి చనిపోయారని పేర్కొంది. కాబట్టి రష్యాలోని భారతీయ విద్యార్థులు బీచ్‌లు, నదులు, సరస్సులు, చెరువులు, నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని రాయబార కార్యాలయం కోరుతోంది. విద్యార్థులు ఈ విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు, భద్రతా చర్యలను తీసుకోవాలని రాయబార అధికారులు సూచించారు.

తల్లిదండ్రులకు వీడియో కాల్‌.. అంతలోనే 
కాగా,ఐదుగురు వైద్య విద్యార్ధులు హర్షల్‌ అనంత్‌రావ్, జీషన్‌ పింజారీ, జియా పింజారీ, మాలిక్‌ మహమ్మద్‌ యాకూబ్‌,నిషా భూపేష్ సోనావానేలు వోల్ఖోవ్ నది ఒడ్డుకి వాకింగ్‌కు వెళ్లారు. జీషన్‌ అతని కుటుంబసభ్యులకు వీడియో కాల్‌ చేశారు. అయితే ఆ సమయంలో జీషన్‌ తల్లిదండ్రులు నది నీటిలో నుంచి బయటకు రావాలని కోరుతుండగా.. బలమైన అలల తాకిడికి విద్యార్ధులు నదిలో మునిగారని జీషన్‌ కుటుంబసభ్యులు తెలిపారు.  

 మహరాష్ట్ర జల్‌గావ్‌ జిల్లా వాసులు
గల్లంతైన నలుగురు విద్యార్థులను జియా పింజారీ, జిషాన్ పింజారీ అన్నా చెల్లెళ్లు, మహ్మద్ యాకూబ్ మాలిక్, హర్షల్ దేశాలీగా గుర్తించారు. నలుగురు విద్యార్థులు మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాకు చెందినవారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement