ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాల ఆటకట్టు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాల ఆటకట్టు

Published Tue, Apr 16 2024 6:50 AM | Last Updated on Tue, Apr 16 2024 6:50 AM

స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు,సెల్‌ఫోన్లు - Sakshi

గచ్చిబౌలి: సైబరాబాద్‌ పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. సోమవారం ఒకే సారి ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు 15 మందిని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మొహంతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సైబరాబాద్‌ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శంషాబాద్‌, మాదాపూర్‌, బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులతో పాటు మియాపూర్‌, బాచుపల్లి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, దుండిగల్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కూకట్‌పల్లికి చెందిన పొందూరి సురేష్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లపై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా సురేష్‌తో పాటు వికారాబాద్‌కు చెందిన ఫంటర్‌ మోత్కుపల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్‌ చేశారు. రామంజనేయులు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రధాన నిర్వాహకుడు రామంజనేయులు 350 మంది పంటర్ల ద్వారా రూ.4.5 కోట్లు బెట్టింగ్‌లు స్వీకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.30,07,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకుల్లో రూ.49,92,539 సీజ్‌ చేశారు. నాలుగు స్మార్ట్‌ ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

మల్లంపేటలో..

దుండిగల్‌ పీఎస్‌ పరిధిలోని మల్లంపేట్‌లో

లచ్చుపతుల చిన్న బాబు, చెన్నంశెట్టి కరిముల్లా షేకదారి, పనమటి వెంకటేష్‌, దొండ రమేష్‌ అనే వ్యక్తులు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శంషాబాద్‌ పోలీసులు దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1,19 లక్షలు సీజ్‌ చేసి, రూ.2,400 నగదు స్వాధీనం చేసుకున్నారు.

గోకుల్‌ప్లాట్స్‌లో..

గోకుల్‌ప్లాట్స్‌లోని ఎస్‌ఆర్‌ఎస్‌ డైమండ్‌ అపార్ట్‌మెంట్స్‌లో దాడులు నిర్వహించిన మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు కుందూరు వీర శంకర చారి, భూమిరెడ్డి రాంప్రసాద్‌ రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్లు పబ్బతి మురళి, ఉపాసి వంశీకృష్ణలను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిర్వాహకులు బెంగళూర్‌కు చెందిన రాజేష్‌ రెడ్డి, గచ్చిబౌలికి చెందిన సురేష్‌ రెడ్డి , అనంతపూర్‌కు చెందిన నాగార్జున రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన సిద్ధిఖీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.87 వేల నగదు స్వాధీనం చేసుకుని, నాలుగు బ్యాంకుల్లో రూ.1.44 కోట్లు సీజ్‌ చేశారు. 29 కీ ప్యాడ్‌ మోబైల్స్‌, 7 స్మార్ట్‌ ఫోన్లు, బెంజ్‌కారు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

జీడిమెట్ల పరిధిలో..

జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఎస్‌ఓటీ బాలానగర్‌ పోలీసులు గుంటూరుకు చెందిన ఎర్రమంచు అజయ్‌, వైజాగ్‌కు చెందిన మహేష్‌ కుమార్‌లను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.73 వేల నగదు, యూపీఐ ద్వార సేకరించిన రూ.21 వేలు సీజ్‌ చేశారు. రెండు స్మార్ట్‌ ఫోన్లు, కీ ప్యాడ్‌ మొబైల్‌స్వాధీనం చేసుకున్నారు.

బాచుపల్లి పీఎస్‌ పరిధిలో..

బాచుపల్లి పీఎస్‌ పరిధిలో బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు మొర్తాల శ్రీకాంత్‌ రెడ్డి, అలీ లోకేష్‌(, జి.వెంకన్న సునీల్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేసి నాలుగు బ్యాంకుల్లో రూ.13.30 లక్షల నగదు సీజ్‌ చేశారు. ఆరు స్మార్ట్‌ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 16 మొబైల్‌ కీ ప్యాడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నితేష్‌, బుడ్డా రెడ్డి అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 9490617444 నెంబర్‌కు సమాచారం అందించాలని సీపీ సూచించారు.

సైబరాబాద్‌ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో దాడులు

రూ.33.30 లక్షల నగదు స్వాధీనం

57 బ్యాంకుల్లో రూ.2.07 కోట్లు సీజ్‌

15 మంది అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement