‘పొలిటికల్‌’ ఆతిథ్యం! | - | Sakshi
Sakshi News home page

‘పొలిటికల్‌’ ఆతిథ్యం!

Published Mon, Apr 15 2024 6:50 AM | Last Updated on Mon, Apr 15 2024 7:25 AM

- - Sakshi

అపార్ట్‌మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాలతో భేటీ

కన్వెన్షన్లు, ద్వితీయ శ్రేణి నేతల ఇళ్లు, ఆఫీసుల్లో సిట్టింగ్‌లు

ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పోటాపోటీగా ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా 28 రోజులే మిగిలి ఉంది. ఓటింగ్‌ సమయం దగ్గరపడుతోంది. గ్రేటర్‌ జిల్లాల పరిధిలోని మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒక వైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ..మరో వైపు వీలైనంత త్వరగా ఓటర్లను చేరుకునేందుకు యత్నిస్తున్నారు.

ఉదయం ఇతర పార్టీల కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ, వారికి కండువా కప్పడం, మధ్యాహ్నంబూత్‌, గ్రామ, మండల స్థాయి కమిటీలతో ఆత్మీయ సభలు, సమావేశాలు నిర్వహించి, ఎన్నికల్లో గెలుపు కోసం సమాలోచనలు చేయడం, సాయంత్రం ఏడు తర్వాత ముఖ్య అనుచరుల నివాసాలు, గెస్ట్‌ హౌసులు, ఆఫీసులు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, ఫాం హౌసుల్లో గెట్‌ టు గెదర్‌ పార్టీలు ఏర్పాటు చేయడం నిత్యకృత్యమైంది. కాలనీ, అపార్ట్‌మెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. వివిధ రకాల మాంసాహార వంటకాలతో పాటు ఖరీదైన మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. ఒక వైపు అభ్యర్థి గెలుపునకు ఏ విధంగా కృషి చేయాలనే అంశంపై చర్చిస్తూనే..మరో వైపు ‘సుక్క..ముక్క’తో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ దావత్‌లు షురూ..
ఒకే చోట ఎక్కువ మంది కూడితే ఎన్నికల కమిషన్‌కు అనుమానం వస్తుందని భావించి, పోలింగ్‌ బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గమనార్హం. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా పుట్టిన రోజు వేడుకల బ్యానర్లను, కేకు, పుష్పగుచ్ఛాలను ఆ ప్రదేశంలో రెడీగా ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ప్రచారం కోసం బంధువులు, స్వగ్రామాలకు చెందిన వారిని కూడా నియోజకవర్గానికి రప్పించి, వారితో మంతనాలు జరుపుతున్నారు. స్థానికంగా స్థిరపడిన వారి బంధువుల ఓట్లు తమకే పడేలా ప్లాన్‌ చేస్తున్నారు.

కనీసం ఏ ఒక్క రోజు కూడా పలకరించని నేతలు ఏకంగా ఇంటికి, గెస్ట్‌హౌస్‌కు, హోటల్‌కు, క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని విజయం కోసం పాటు పడాల్సిందిగా వేడుకుంటున్నారు. లీడర్లు కూడా దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ముందు అనేక ప్రతిపాదనలను పెడుతున్నారు. సామాజిక వర్గం, హోదా, సంస్థాగతంగా ప్రజల్లో తనకు ఉన్న పలుకు బడికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థులు కూడా వారి డిమాండ్లకు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి లీడర్లకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. వారు అడిగినంత ఇచ్చి వారిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలిసింది.

మద్యం షాపులతో ఒప్పందం
ఎన్నికల్లో మద్యం పంపిణీని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్‌ గట్టి చర్యలే చేపట్టింది. గెట్‌ టు గెదర్‌ పార్టీలకు నేరుగా మద్యం సరఫరా చేస్తే పోలీసులు పట్టుకునే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఎవరికీ అనుమానం రాకుండా ముందే తమ అనుచరులు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వైన్స్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ప్రత్యేకంగా టోకెన్లును కూడా ముద్రించి ఇస్తున్నారు.

అభ్యర్థి వెంట రోజంతా తిరిగిన ముఖ్య అనుచరులతో పాటు ఇతర నిర్వాహకులకు సాయంత్రం వేళ టోకెన్లు జారీ చేస్తున్నారు. వీరు ఆయా వైన్సుల వద్దకు వెళ్లి..కావాల్సినంత మద్యాన్ని వెంట తీసుకెళ్తున్నారు. ఆత్మీయ సభలు, సమావేశాలకు హాజరయ్యే వారికి కూడా ఇదే విధంగా పంపిణీ చేస్తున్నారు. ఎకై ్సజ్‌శాఖ జిల్లాలోని వైన్స్‌షాపుల్లోని నిల్వలను ఏ రోజుకారోజు లెక్కిస్తున్నప్పటికీ..వీరి లెక్కకు ఏమాత్రం కూడా చిక్కకుండా వ్యవహరిస్తుండటం విశేషం. అంతేకాదు కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్య ంలో ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరయిన సభ్యులను బట్టి బాటిళ్లను, బిర్యానీ పొట్లాలను పంపిణీ చేస్తుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement