చదువుతోనే బడుగులకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే బడుగులకు గుర్తింపు

Published Mon, Apr 15 2024 6:50 AM | Last Updated on Mon, Apr 15 2024 6:50 AM

మహనీయుల జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతున్న ఎంపీ ఆర్‌.కృష్ణయ్య  - Sakshi

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

మలక్‌పేట: బడుగు, బలహీన వర్గాలకు చదువుతోనే గుర్తింపు వస్తుందని, బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆకాంక్షించారు. మహనీయుల ఆశయాల సాధనకు యువత ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ సోషలిస్ట్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూరెళ్ల మహేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం మూసారంబాగ్‌లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే, సావిత్రి బాయిపూలే, డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ విద్యార్థులు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌, గ్రేటర్‌ ఇన్‌చార్జి ప్రవీణ్‌, నాయకులు యశ్వంత్‌, శ్రీకాంత్‌, మహేశ్‌, చంద్రకళ, సత్యనారాయణ, మమత, సరిత, లావణ్య, మానస తదితరులు పాల్గొన్నారు.

వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

బంజారాహిల్స్‌: వ్యాపారవేత్త వేణుమాధవ్‌ చెన్నుపాటి కిడ్నాప్‌ కేసు దర్యాప్తును జూబ్లీహిల్స్‌ పోలీసులు ముమ్మరం చేశారు. క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో షేర్లు, యాజమాన్య మార్పడి కోసమే కిడ్నాప్‌ జరిగిందన్న విషయం విదితమే. 2018 నవంబర్‌లో వేణుమాధవ్‌ను కిడ్నాప్‌ చేసి, సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించిన అప్పటి అధికారులు బెదిరింపులకు గురిచేసి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుసహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ఓ మీడియా సంస్థలో పనిచేసిన కృష్ణారావు, వ్యాపారవేత్తలు చంద్రశేఖర్‌ వేగే, నవీన్‌ ఎర్నేని, రాజశేఖర్‌ తలశిల, సూరెడ్డి గోపాలకృష్ణ, రవికుమార్‌ మండలపు, బాలాజీ ఉన్నారు. అయితే పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని మైత్రీ మూవీస్‌ పేరుతో సినీనిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వేణుమాధవ్‌కు, చంద్రశేఖర్‌ వేగేకు మధ్య గతంలో ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2018, 2021లో జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్లో వేణుమాధవ్‌ మీద రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. గతంలో చంద్రశేఖర్‌ వేగే మీద సైబరాబాద్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించడం, దాన్ని అడ్వయిజరీ బోర్డు తిరస్కరించడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య జరిగిన లావాదేవీలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. కాగా, 2018 నాటి వ్యవహారంలో తాజాగా దర్యాప్తు జరుగుతుండటంతో పోలీసువర్గాలు, జూబ్లీహిల్స్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తల్లో ఆందోళన ప్రారంభమైందని సమాచారం. కిడ్నాప్‌ కేసులో కీలక ఆధారాల సేకరణపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం

– జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

సాక్షి,సిటీబ్యూరో: అగ్నిప్రమాదాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నివారణకు ముందు జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. అగ్నిమాపక శాఖ నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలు, గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గోదాములు, షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల సముదాయాలు, పాఠశాలలు తదితర భవనాలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు పాటించాలన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, సహాయ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి.శ్రీనివాస్‌, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడు

– కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

సాక్షి, సిటీబ్యూరో: నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేడ్కర్‌ నిరంతరం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆ మహానీయుడు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పి.కదిరవన్‌, డీఆర్‌ఓ వెంకటాచారి, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

ఆధారాలను సేకరిస్తున్న ప్రత్యేక బృందాలు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ స్మృతి వనం వద్ద ఆదివారం సందర్శకుల సందడి కన్పించింది. సాధారణ జనం అంబేడ్కర్‌ విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. సెల్ఫీలు, ఫోటోలు దిగారు. కాగా అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటైన ఈ స్మృతివనంలో అధికారికంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. విగ్రహానికి కనీసం ఓ పూలదండ కూడా వేయలేదని పలువురు అంబేడ్కర్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. – సాక్షి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌
1/3

అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌

2/3

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement