చిట్టిచేతుల మీదుగా గట్టి పుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

చిట్టిచేతుల మీదుగా గట్టి పుస్తకాలు

Published Mon, Apr 15 2024 6:50 AM | Last Updated on Mon, Apr 15 2024 6:50 AM

- - Sakshi

లక్డీకాపూల్‌: చిన్న వయసులోనే ఇద్దరు యువ రచయిత్రులు రాసిన పుస్తకాలు అమోఘంగా ఉన్నాయని సైయెంట్‌ చైర్మన్‌, పద్మశ్రీ బీవీకే మోహన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని హోటల్‌ రాడిసన్‌ బ్లూలో రూపాలి కిరణ్‌ యదుగిరి రచించిన ‘అతిథి దేవోభవ’, దీప్షిక యదుగిరి రచించిన ‘యంగ్‌ బ్లడ్‌ ఎథీనా’ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుచిర్‌ ఇండియా గ్రూపు వ్యవస్థాపకులు లయన్‌ డాక్టర్‌ వై. కిరణ్‌ కుమార్తెలు రూపాలి, దీప్షిక చిన్న వయసులోనే తమ సాహితీ అభిలాషను నెరవేర్చుకోవడం అభినందనీయన్నారు. ఒక సాధారణ మనిషి సంపూర్ణ మానవుడిగా మారాలంటే అందుకు సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంతోమంది కవులు, రచయితలు, గ్రంథకర్తలు మనకు అందించిన అద్భుతమైన సంపద పుస్తకాలేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రచయిత్రి ఒకరైన రూపాలి కిరణ్‌ యదుగిరి మాట్లాడుతూ, ఆతిథ్య పరిశ్రమపై తాను రాసిన శ్రీఅతిథి దేవో భవ్ఙ పుస్తకంపై అందరూ తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. తన సోదరి దీప్షిక యాదగిరిని ఆమె పరిచయం చేశారు. ఒక మనిషి వ్యక్తిగత ఎదుగుదలకు, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడే పుస్తకం ఆమె రాసిన ‘యంగ్‌ బ్లడ్‌ ఎథీనా’ అన్నారు. కార్యక్రమంలో సుచిరిండియా చైర్మన్‌ వై. కిరణ్‌, ఐపీఎస్‌ అధికారి సుధీర్‌, మాజీ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

చిక్కడపల్లి: రాజ్యాంగాన్ని కాపాడుకోవడమంటే అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించడమేనని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం గాంధీనగర్‌ డివిజన్‌ అరుంధతినగర్‌ బస్తీ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో బస్తీలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర సూచించిన సూత్రాలకు పాలకులు తూట్లు పొడిచారన్నారు. దేశ సంపద కేవలం 162 మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని, సామాజికన్యాయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలయ్యాయన్నారు.కార్యక్రమంలో టీజేఎస్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు ఎం.నరసయ్య, ఐఏఎస్‌ పోటీపరీక్షల నిపుణులు బాలలత, పునిరెడ్డి, జైపాల్‌రెడ్డి, బస్తీ నేతలు ఉమేష్‌, పరశురామ్‌ పాల్గొన్నారు.

‘కాంగ్రెస్‌ పాలనలో మాదిగలకు తీరని అన్యాయం’

మన్సూరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం మాదిగలను మోసం చేస్తుందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఎల్‌బీనగర్‌లో జరిగిన అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు, మాలలకు సమన్యాయం చేసిందని, జనరల్‌ స్థానమైన మల్కాజిగిరిని తనకు కేటాయించగా లక్షకు పైగా మెజార్టీతో గెలుపొంది. కేంద్రమంత్రి పదనిని నిర్వహించానని గుర్తుచేశారు. సమర్థత కల్గిన మాదిగ నాయకులపై ప్రస్తుత రాష్ట్ర నాయకత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. నడమంత్రపుసిరితో రాష్ట్ర నేతలు కుట్రలు చేస్తున్నారని, వరంగల్‌ పార్లమెంట్‌ టికెట్‌ను కడియం కావ్యకు ఏ ప్రాతిపదికన కేటాయించారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కడియం శ్రీహరి ఎస్సీనా, బీసీనా తెలియాల్సి ఉందని, కడియం కావ్య మైనార్టీ వ్యక్తిని పెళ్లిచేసుకుందని, వరంగల్‌ టిక్కెట్‌ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచించాలని కోరారు. వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేసిందని, తెలంగాణ ఏర్పడ్డాక వర్గీకరణపై దృష్టి సారించాలని అప్పటి యుపీఏ ప్రభుత్వం ఆలోచన చేసిందని తెలిపారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రధాని మోదీ వర్గీకరణపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జోగు రాములు, చామకూర రాజు, కేవిగౌడ్‌, ఆడాల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement