తాగు నీటి సరఫరాకు ఆటంకం కల్పిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగు నీటి సరఫరాకు ఆటంకం కల్పిస్తే చర్యలు

Published Sun, Apr 14 2024 8:00 AM | Last Updated on Sun, Apr 14 2024 8:00 AM

- - Sakshi

సమీక్ష సమావేశంలో మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో: తాగునీటి సరఫరాలో ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్‌ హెచ్చరించారు. వేసవిలో తాగునీరు, ట్యాంకర్‌ సరఫరా తదితర అంశాలపై ఖైరతాబాద్‌ లోని ప్రధాన కార్యాలయంలో శనివారం జలమండలి ఎండీ సుదర్శన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్‌ బుకింగ్స్‌, డెలివరీ, లైన్‌మెన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ప్రతి మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, సీజీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్‌ మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లైన్‌మెన్లు ఉద్దేశ పూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. జలమండలి రూపొందించిన నాణ్యత యాప్‌లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలని చెప్పారు. సరఫరా వేళలు, నాణ్యత విషయంలో తేడా వస్తే.. అలాంటి వారిని తొలగించాలని ఆదేశించారు.

20 ఎంఎల్డీల అదనపు జలాలు

నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీరు వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దానకిశోర్‌ వెల్లడించారు. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోతుండటంతో ఎమర్జెన్సీ పంపింగ్‌ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 15 తర్వాత ఏ క్షణమైనా పంపింగ్‌ చేసే అవకాశముందని వివరించారు.

అదనపు మినీ ట్యాంకర్లు

వేసవిలో డిమాండ్‌ ఎదుర్కొనేందుకు అదనంగా 5 కేఎల్‌ సామర్థ్యం కలిగిన వంద ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లు దానకిశోర్‌ తెలిపారు. కాలనీలు, బస్తీలు, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు 2.5 కేఎల్‌ సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను కూడా తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ట్యాంకర్‌ డెలివరీ టైమింగ్స్‌ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దానకిశోర్‌ ఆదేశించారు. ట్యాంకర్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్‌ స్టేషన్స్‌, ఫిల్లింగ్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఈడీ డా. సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌ కుమార్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ పాల్గొనారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement