జల్దీ జర్నీ! సాఫీగా రైలు ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

జల్దీ జర్నీ! సాఫీగా రైలు ప్రయాణం

Published Sat, Apr 13 2024 7:40 AM | Last Updated on Sat, Apr 13 2024 9:47 AM

- - Sakshi

లాలాగూడ– సీతాఫల్‌మండి మధ్య కొత్తగా కార్డ్‌లైన్‌

దూరప్రాంతాల రైళ్లకు తగ్గనున్న ప్రయాణ సమయం

కాజీపేట్‌, నిజామాబాద్‌ మీదుగా కాచిగూడకు

నిర్మాణ పనులు చేపట్టిన దక్షిణమధ్య రైల్వే

సాక్షి, హైదరాబాద్: కాజీపేట్‌ నుంచి కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు కాజీపేట్‌ నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌలాలీ బైపాస్‌ వరకు కేవలం 85 నిమిషాల్లో చేరుకుంటాయి. కానీ.. అక్కడి నుంచి మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాచిగూడకు చేరుకొనేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. అంటే.. కాచిగూడ నుంచి మౌలాలీ వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. కానీ.. అక్కడి నుంచి మల్కాజిగిరి మీదుగా కాచిగూడకు వెళ్లేందుకే ఎక్కువ సమయం పడుతోంది.

దీంతో నగరానికి చేరుకున్నప్పటికీ ప్రయాణికులు కనీసం 50 నిమిషాలు అదనంగా ప్రయాణం చేయాల్సివస్తోంది. రైళ్ల రాకపోకల్లో ఈ జాప్యాన్ని నివారించేందుకు లాలాగూడ నుంచి సీతాఫల్‌మండి వరకు 4 కిలోమీటర్ల కార్డ్‌లైన్‌ నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే పనులు ప్రారంభించింది. ఈ కార్డ్‌లైన్‌ వల్ల మౌలాలీ నుంచి కాచిగూడకు చేరుకొనే సమయం గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. ప్రస్తుతం కాజీపేట నుంచి వచ్చే రైళ్లు మల్కాజిగిరి నుంచి సీతాఫల్‌మండి మీదుగా కాకుండా లాలాగూడ స్టేషన్‌ నుంచి ఎడమ వైపునకు మళ్లి నేరుగా సీతాఫల్‌మండి మీదుగా కాచిగూ డకు చేరుకుంటాయి. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

ఆర్‌యూబీ బ్లాక్‌...
కార్డ్‌లైన్‌ నిర్మాణ పనుల కోసం ప్రస్తుతం ఆలుగడ్డ బావి వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించారు. రైల్‌నిలయం నుంచి తార్నాక వైపు వెళ్లే మార్గంలో ఆలుగడ్డబావి వద్ద ఉన్న ఆర్‌యూబీని బ్లాక్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఆర్‌యూబీపైన కార్డ్‌లైన్‌ పనులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సకాలంలో పనులను పూర్తి చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న మూడు నెలల కాలంలో లాలాగూడ–సీతాఫల్‌మండి కార్డ్‌లైన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇది పూర్తయితే కాజీపేట్‌, నిజామాబాద్‌ వైపు నుంచి కాచిగూడ మీదుగా వెళ్లే రైళ్లకు ఎంతో ఊరట లభించనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను కూడా కాచిగూడకు మళ్లించే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. కొత్త కార్డ్‌లైన్‌ వల్ల ప్రయాణ సమయం 30 నిమిషాలకు తగ్గనున్నట్లు చెప్పారు.

ప్రయాణికులకు ఎంతో ఊరట..
మల్కాజిగిరి నుంచి సీతాఫల్‌మండి వరకు చేపట్టిన డబ్లింగ్‌ పనుల్లో భాగంగానే లాలాగూడ– సీతాఫల్‌మండి మధ్య కార్డ్‌లైన్‌ నిర్మాణం జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. ఇటీవలే మౌలాలీ బైపాస్‌–సనత్‌ నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య 29 కిలోమీటర్ల డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయి. ఆ రూట్‌లో ఎంఎంటీఎస్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్డ్‌లైన్‌ కూడా పూర్తయితే దూర ప్రాంతాల రైళ్లకు ఎంతో ప్రయోజనం. సికింద్రాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
– ఫణి, రైల్వేఫోరం సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement