గ్రేటర్‌లో డబుల్‌ కరెంట్‌ వాడకం.. మున్ముందు మరింత పెరిగే అవకాశం | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో డబుల్‌ కరెంట్‌ వాడకం.. మున్ముందు మరింత పెరిగే అవకాశం

Published Fri, Apr 12 2024 9:10 AM | Last Updated on Fri, Apr 12 2024 9:10 AM

- - Sakshi

నోముల శ్రీశైలం

ఏసీలో కూర్చొంటే ఎవరికై నా వణుకు పుట్టాలి కానీ.. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం చూస్తే విద్యుత్‌ ఇంజినీర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. కొత్త విద్యుత్‌ కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతుండటంతో విద్యుత్‌ వినియోగం కూడా అదే స్థాయిలో రికార్డు అవుతోంది. ఫిబ్రవరిలో సగటు విద్యుత్‌ వినియోగం 55 ఎంయూలు(మిలియన్‌ యూనిట్లు) ఉండగా, మార్చి నాటికి 75 ఎంయూలు దాటింది. ఏప్రిల్‌లో 82 నుంచి 84 ఎంయూలు నమోదవుతున్నాయి. మే నాటికి 90 ఎంయూలకు చేరే అవకాశం ఉంది. ఒత్తిడిని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ.. మెజార్టీ సెక్షన్ల పరిధిలో ఇప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.

గరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్‌ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. రోజు రోజుకూ పుట్టుకొస్తున్న కొత్త కనెక్షన్లకు తోడు విద్యుత్‌ గృహోపకరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కన్పించిన ఏసీలు, గీజర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు.. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్‌ చేసి ఉంచుతున్నారు. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఫలితంగా గ్రేటర్‌ జిల్లాల్లో విద్యుత్‌ డిమాండ్‌ పీక్‌ స్థాయికి చేరుకుంది.

తలసరిలోనూ టాప్‌

● 2006లో 24.12 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా..1,538 మెగావాట్ల డిమాండ్‌ నమోదయ్యేది. ఇక 2014 నాటికి వీటి సంఖ్య 38 లక్షలకు చేరుకుంది. విద్యుత్‌ డిమాండ్‌ కూడా అదే స్థాయిలో 2200 మెగావాట్లకు చేరింది.

● 2019 నాటికి 50 లక్షలకు చేరగా, డిమాండ్‌ 3250 మెగావాట్లకు చేరింది. తాజాగా 3819 మెగావాట్లకు చేరుకోవడం గమనార్హం. 2021లో 53,95,903 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 61 లక్షలు దాటింది. ఏటా పెరుగుతున్న కనెక్షన్లతో పాటు డిమాండ్‌ కూడా భారీగా నమోదవుతోంది.

● పారిశ్రామిక వినియోగంతో పోలిస్తే గృహ వినియోగమే రెట్టింపైంది. అంతేకాదు 2014లో వేసవి పీక్‌ డిమాండ్‌ 2261 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 3819 మెగా వాట్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు.. సగటు కరెంట్‌ వినియోగంలోనూ భారీ తేడాలు నమోదవుతుండటం గమనార్హం. 2014లో తలసరి విద్యుత్‌ వినియోగం 1356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2261 యూనిట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement