ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం - | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం

Published Wed, Feb 7 2024 5:58 AM | Last Updated on Wed, Feb 7 2024 7:54 AM

ప్రమాద స్థలి    - Sakshi

మేడ్చల్‌రూరల్‌: మేడ్చల్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురు లైన్‌లో వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్‌ ఎస్‌ఐ నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురంనకు చెందిన రెడ్డప్ప రెడ్డి (50) ఉద్యోగ నిమిత్తం సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటినుంచి తన ఇన్నోవా కారులో బయలుదేరి బాచుపల్లిలో విధులు ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలోని మేడ్చల్‌ ఎగ్జిట్‌ నెంబర్‌–6 సమీపంలోకి చేరుకున్నాడు.

ఇదే సమయంలో ఎదురు లైన్‌లో వేగంగా వస్తున్న ఎక్స్‌యూవీ కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురులైన్‌లోకి దూసుకోచ్చి రెడ్డప్ప రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న మేడ్చల్‌ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను కార్లలోంచి బయటికి తీశారు.

ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న రెడ్డప్ప రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎక్స్‌యూవీ కారులో ఉన్న జగద్గిరిగుట్టకు చెందిన ముగ్గురిలో బీటెక్‌ విద్యార్థి రెడ్డి గణేశ్‌ (18) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరు విద్యార్థులు మోక్షిత్‌రెడ్డి, మంగలపు గణేశ్‌లు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement