ప్రతిరోజూ బీరు తాగడం ముప్పే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిరోజూ బీరు తాగడం ముప్పే..

Published Wed, May 24 2023 9:22 AM | Last Updated on Wed, May 24 2023 9:39 AM

- - Sakshi

చెమట ద్వారా ఒంట్లోని నీటి శాతానికి వేసవి సీజన్‌లో తీవ్ర నష్టం కలుగుతుంది. మరోవైపు ఆల్కహాల్‌ వినియోగంతో సంభవించే అధిక మూత్ర విసర్జన ఈ నష్టాన్ని అధికం చేస్తుంది. శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్‌ పరిస్థితి ఏర్పడుతుంది. శరీర పనితీరుకు అవసరమైన సాధారణ ద్రవాల కొరతకు దారితీస్తుంది. దీంతో తీవ్రమైన నాలుక పిడచ కట్టుకుపోయేంత దాహం, పొడి నోరు, తలనొప్పి, మైకం, అలసట, గందరగోళానికి గురికావడం వంటివి ఎదురవుతాయి. ఆల్కహాల్‌ మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది.

అంతేకాక శరీరానికి ద్రవాలను నిలుపుకోవడం కష్టతరం చేస్తుంది. వేసవి వేడిలో ఆల్కహాల్‌ వినియోగించినప్పుడు, త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది, శరీర అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించే స్వాభావిక సామర్థ్యాన్ని ఆల్కహాల్‌ దెబ్బతీస్తుంది, శరీరపు అంతర్గత ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి హీట్‌స్ట్రోక్‌. ఇది మెదడు, గుండె ఇతర అవయవాలకు హాని కలిగిస్తుంది. అధిక శరీర ఉష్ణోగ్రత, వేగవంతమైన హృదయ స్పందన, వికారం, వాంతులు, తలనొప్పి నుంచి మూర్ఛ వరకూ ఇది దారి తీసే ప్రమాదం ఉంది.

మానేయాలి లేదా బాగా తగ్గించాలి..
ఈ నేపథ్యంలో ఆల్కహాల్‌ వేసవి వేడిని కలపడం వల్ల కలిగే ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం. రోజంతా పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం. అధిక వేడి, ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఉండే రోజులలో ఆల్కహాల్‌ను పూర్తిగా ఆపేయడం లేదా బాగా పరిమితం చేయడం మంచిది. బీరుతో పాటు నాన్‌ వెజ్‌ వంటకాలు అధికంగా తీసుకోవడం కూడా ద్రవం అడుగంటడానికి శరీరంలో వేడి విజృంభణకు దారి తీస్తుంది.

ఏటా పెరుగుతున్న బీరు విక్రయాలు...

గత కొన్నేళ్లుగా మార్చి, ఏప్రిల్‌, నెలల్లో బీర్ల విక్రయాలు తారస్థాయికి చేరుకోవడం కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు నుంచి మే మొదటి వారం వరకూ పది రోజుల పాటు వర్షాల కారణంగా వాతావరణం చల్లబడడంతో బీర్ల వినియోగం కూడా ఎప్పటికన్నా బాగా తగ్గిపోయింది. దాంతో ఈ సారి బీర్ల అమ్మకాల్లో తరుగుదల నమోదవుతుందని వైన్‌షాప్‌ యజమానులు భావించారు. 10 రోజులుగా ఒక్కసారిగా పెరిగిన ఎండలు మళ్లీ బీరు విక్రయాలు ఎగబాకాయి. కేవలం 2 వారాల విక్రయాలతోనే గత ఏడాది మే నెల సేల్స్‌ను అందుకోవడం తథ్యమని వ్యాపారులు చెబుతున్నారు.

వేసవి కాలం చల్లని బీరు కిక్‌ని నగరవాసుల్లో పెంచుతోంది. గత కొన్నేళ్లుగా వేసవి సీజన్‌లో అమాంతం నగరంలో పెరిగే బీర్ల విక్రయాలే దీనికి నిదర్శనం. ఆల్కహాల్‌ శాతం తక్కువ, ఆరోగ్యానికి హానికరం కాదు వంటి అపోహలతో అడపాదడపా రుచి చూసేవాళ్లు కూడా వేసవిలో బీర్‌బలులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా యువత బీర్ల వినియోగాన్ని మంచినీళ్ల ప్రాయంగా భావిస్తుండడం కనిపిస్తోంది. బీరు చల్లదనాన్ని ఇవ్వడమనేది అపోహ మాత్రమేనని, బీరు వ్యసనం ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణంలో మద్యపానం శారీరక విపత్తుగా మారుతుందని వైద్యులు అంటున్నారు. వేడి వాతావరణం నేపథ్యంలో ఆల్కహాల్‌ను అత్యధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్కహాల్‌ అబ్యూజ్‌ అండ్‌ ఆల్కహాలిజం నివేదిక చెబుతోంది.

వైద్యులేమంటున్నారు?
5 నుంచి 12 శాతం ఆల్కహాల్‌తో, ఇతర ఆల్కహాలిక్‌ పానీయాల కంటే బీరు తక్కువ హానికరం. కొంత మొత్తంలో ఆల్కహాల్‌ కలిగి ఉందనే నెపంతో అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దాని తీస్తుంది.

ఆల్కహాల్‌లోని కేలరీలు ఆహారాల నుంచి వచ్చే కేలరీల కన్నా భిన్నంగా ఉండి, పొట్ట ఉబ్బడానికి దారితీస్తాయి పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం అన్నింటికంటే ప్రమాదకరం.

అధిక మద్యపానం గుండె కండరాలను దెబ్బతీస్తుంది, స్ట్రోక్‌, అధిక రక్తపోటు, టైప్‌ 2 డయాబెటిస్‌ దడ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న బీరు తాగడం వల్ల హైపర్‌ టెన్షన్‌ కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అధిక మూత్రవిసర్జనకు కారణమై బీరు మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

రెగ్యులర్‌గా బీరు తాగడం వల్ల కొన్ని విటమిన్లు మినరల్స్‌ అవసరాలు శరీరానికి బాగా పెరుగుతాయి. ఈ అవసరాలు నెరవేరనప్పుడు, అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. బీరు తాగడం వల్ల ఒక వ్యక్తి త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది కానీ అది దీర్ఘ కాలం ఉండదు. ఇందులో గాఢ నిద్ర 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇది పగటిపూట మగత, ఏకాగ్రత లోపం, అలసటకు దారితీస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement