ఇంకానా బాల కార్మిక వ్యవస్థ? | World Day Against Child Labour Bandaru Dattatreya Trigger Questionnaire | Sakshi
Sakshi News home page

ఇంకానా బాల కార్మిక వ్యవస్థ?

Published Sat, Jun 11 2022 10:29 AM | Last Updated on Sat, Jun 11 2022 11:44 AM

World Day Against Child Labour Bandaru Dattatreya Trigger Questionnaire - Sakshi

బాలలు భగవంతుడి స్వరూపాలంటారు. ఏ దేశానికైనా మూల స్తంభాలూ, భవిష్యత్తూ వాళ్లే. అమ్మ ఒడిలో, నాన్న లాలనలో, స్వేచ్ఛగా ప్రేమాభిమానాల మధ్య ఎదగడం బాలల హక్కు కావాలి. అమాయ కత్వంతో తొణికిసలాడే ఆ పసి మనసుల గురించి పట్టించుకోక పోవడం, అనాదరించడం సాంఘిక దురాచారమే అవుతుంది. ఈ 21వ శతాబ్దంలోనూ బాల కార్మిక వ్యవస్థ అతిపెద్ద ప్రపంచ సమస్యల్లో ఒకటి కావడం దురదృష్టకరం. 

ప్రపంచవ్యాప్తంగా కూడా బాలకార్మిక వ్యవస్థ కొన సాగేందుకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. పేదరికం, నిరక్ష రాస్యత, పెద్ద పెద్ద కుటుంబాలు, బాలలకు సులువుగా ఉపాధి దొరికే అవకాశం లేకపోవడం, ఉన్న చట్టాల అమల్లో నిర్లక్ష్యంతో పాటు అనేక ఇతర అంశాలు కూడా చేరడం వల్ల ఈ సాంఘిక ఆర్థిక, రాజకీయాలు కలిసి ఈ దురాగతం ఇంకా కొనసాగేలా చేస్తున్నాయి. అయితే బాల కార్మిక వ్యవస్థను ఒక ఆర్థిక సమస్యగా పరిగణిస్తే మాత్రం ఏ దేశమూ దీన్ని పరిష్కరింప జాలదు. సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. రాజకీయం గానూ కొంత సున్నితంగా వ్యవహరించాలి. 

గత ఎనిమిదేళ్లలో బాల కార్మిక వ్యవస్థను నియంత్రిం చడంలో దేశం చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమైంది. నేను కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)గా వ్యవహరిస్తున్న సమయంలో అమల్లోకి వచ్చిన ‘ద చైల్డ్‌ లేబర్‌ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ 2016’ పాత్ర కూడా ఇందులో ఉండటం ముదావహం. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఏ రకంగానూ పనిలో పెట్టుకోకూడదని ఈ చట్టం చెబుతుంది. అలాగే 14–18 మధ్య వయస్కులను ప్రమాదకరమైన వృత్తుల్లో నియమించ రాదు. అయితే కుటుంబ సభ్యుల లేదా కుటుంబ వ్యాపారంలో బాలలు సాయం అందించేందుకు ఈ చట్టం అవకాశం కల్పి స్తోంది. అలాగని ప్రమాదకరమైన వృత్తులో పని చేసే అవకాశం లేదు. 

మా అమ్మ ఈశ్వరమ్మ ఉల్లిపాయలు అమ్మేది. స్కూల్‌ అయిపోయిన తరువాత నేనూ దుకాణంలో అమ్మకు సాయపడే వాడిని. అయితే 2016 నాటి చట్టం కంటే ముందు ఇలా చేయడం శిక్షార్హమైన నేరం. నా చిన్నతనపు కథనం ఎందుకు ప్రస్తావిస్తున్నానని అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రమాద కరం కాని చాలా వాణిజ్య కార్యకలాపాల్లో ఇప్పటికీ తల్లిదండ్రు లకు పిల్లల సాయం అవసరమవుతూంటుంది. అటువంటి సందర్భాల్లో పిల్లలు వారికి సాయపడటంలో తప్పులేదు. ఇంకో విషయం: మా అమ్మ ఎప్పుడూ స్కూల్‌ ఎగ్గొట్టి తనకు సాయపడాలని కోరలేదు. ఆ విషయం నేనెప్పుడూ గుర్తుంచు కుంటాను. కష్టాలెన్ని ఉన్నా నాకు మంచి విద్యను అందించా లన్న ఆమె దృఢ నిర్ణయానికి నమస్సులు అర్పిస్తాను. 

బాలాకార్మికులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేంద్రీ కృతమై ఉన్న నేపథ్యంలో వారందరిలోనూ వీలైనంత తొందరగా చైతన్యం కల్పించాల్సిన అవసరముంది. నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు కింద ఇప్పటివరకూ దాదాపు 14 లక్షల మంది బాలకార్మికులకు విముక్తి లభించింది. అంతేకాకుండా ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా వారికి బ్రిడ్జ్‌ కోర్సులు అందించి సాధారణ పాఠశాలల్లో విద్యనభ్యసించే అవకాశం కల్పించారు. వృత్తి నైపుణ్యాలు అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య సేవలు, ఉపకార వేతనం కూడా అందించారు. బాలకార్మిక వ్యవస్థ నుంచి బయటపడ్డ వారు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు వీలుగా సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2021 మార్చి 31 నాటికి దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,225 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 

తల్లిదండ్రుల వృత్తుల్లో బాలలు కార్మికులుగా చేరడం మనం చాలాకాలంగా చూస్తున్నాం. ఇటుక బట్టీలు, గార్మెంట్స్, వ్యవసాయం, టపాసుల తయారీల్లో బాలకార్మికుల భాగ స్వామ్యం ఉంది. ధాబాలు, చిన్న చిన్న హోటళ్లు, టీస్టాల్స్, తివాచీ, చేతిగాజుల పరిశ్రమల్లో పిల్లలు రకరకాల పనులు చేస్తున్నారు. ఇలా అసంఘటిత రంగాల్లో బాలకార్మికులు పనిచేసే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ పాఠశాలలకు పంపకుండా పనిలో పెట్టుకుంటున్న కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది మరింత సమర్థంగా, వేగంగా జరగాలి.

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ను సక్రమంగా అమలు చేయడం కూడా బాలకార్మిక వ్యవస్థ పీడ వదిలించుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్‌ సమన్వయంతో ఐదు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయస్కులు విద్యా వ్యవస్థలో భాగమయ్యేలా చూడాలి. అలాగే ‘పెన్సిల్‌’ (ప్లాట్‌ఫార్మ్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఫర్‌ నో చైల్డ్‌ లేబర్‌)పై సమర్థమైన నిఘా ఉంచాలి. కుటుంబాల వృత్తుల్లో పాల్గొన్న వారిని కూడా బాలకార్మికులుగా గుర్తించడం ద్వారా ప్రస్తుత పరిస్థితి మార్చలేము. అందుకే భిన్నమైన ఆలోచనతో ఈ చిక్కుముడిని విప్పాల్సి ఉంటుంది. పైగా ఈ పని కేవలం ప్రభుత్వానిది మాత్రమే అనుకుంటే తప్పు. ఎన్జీవోలు, స్వచ్ఛంద కార్యకర్తలు, సీనియర్‌ సిటిజెన్లు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. 

2022 సంవత్సరపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాలను ‘సార్వత్రిక సామాజిక పరిరక్షణ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన’ అన్న అంశం ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తూండటం ఎంతైనా సంతోషకరం. బాల కార్మికుల్లేని ప్రపంచం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటన్న సంగతి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను తుదముట్టించాలన్న లక్ష్యం ప్రపంచం ముందున్న విషయం తెలిసిందే. ఈ దిశగా భారత్‌ గత ఎనిమిదేళ్లల్లో ఎంతో ప్రగతి సాధించింది. కోవిడ్‌–19 కారణంగా ఇబ్బందులు ఎదురైనా బాలకార్మిక వ్యవస్థ మళ్లీ వేళ్లూనుకోకుండా దృఢ సంకల్పం, నిశ్చయంతో పని చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసికట్టుగా కృషి చేస్తే దేశం త్వరలోనే బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందగలదు!


- బండారు దత్తాత్రేయ, హరియాణా రాష్ట్ర గవర్నర్‌
(జూన్‌ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement