ఉప్పందిందా? లేక నిప్పులేని పొగేనా? Sakshi Guest Column On Stock market Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఉప్పందిందా? లేక నిప్పులేని పొగేనా?

Published Mon, Jun 17 2024 12:13 AM | Last Updated on Mon, Jun 17 2024 12:13 AM

ఆరోపణలు చేస్తున్న రాహుల్‌ గాంధీ

కామెంట్‌

జూన్‌ 1న ఎగ్జిట్‌ ఫలితాలు వెల్లడవటానికి ముందు రోజు మే 31న జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందరి రోజు జరిగిన దానికి రెట్టింపు!  ఈ మొత్తం కొనుగోళ్లలో 58 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్లదే. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ మోదీ ఘన విజయం సాధించబోతున్నారని ప్రకటించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ట్రేడింగ్‌ జరగటం యాదృచ్ఛికమైతే కాదు. దీనివల్ల అసలు ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్‌ 4న స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి పోవటం, సాధారణ ఇన్వెస్టర్ల షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం జరిగింది. ఆ రోజు స్టాక్‌ మార్కెట్‌కు వచ్చిన నష్టం అక్షరాలా 30 లక్షల కోట్ల రూపాయలు. అందుకే... ‘ఎగ్జిట్‌పోల్‌ స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ జరిగిందా అన్నది ప్రశ్న.

మే 31–జూన్‌ 4 మధ్య నేషనల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజి (ఎన్‌.ఎస్‌.ఇ)లో ఏదైనా అనుమానాస్పదమైన, ఆందోళన కలిగించే పరిణామం సంభవించిందా? సంభవించింది అని రాహుల్‌ గాంధీ అంటున్నారు. దానిపై దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన అంటున్నది నిజమేనని మనమెలా చెప్పగలం? వాస్తవాలను పరిశీలించడం ద్వారా మాత్రమే. కనుక ఈ విషయమై ‘ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌’ చైర్మన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి వద్ద అందుబాటులో ఉన్న కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను. ఇందుకు చక్రవర్తినే నేను ఎంచుకోవటానికి కారణం రాహుల్‌ అంటున్న దానికి, చక్రవర్తి చెబుతున్నది చాలా దగ్గరి ఏకీభావం కలిగి ఉన్నదని నేను అనుకోవటం. 

మొదటిది– మే 31న ఎన్‌.ఎస్‌.ఇ.లో జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందటి రోజు మొత్తానికంటే రెట్టింపు. పదేళ్ళ కిత్రం 2014 మే నెలలో ఇలాంటిదే నరేంద్ర మోదీ తన తొలి మెజారిటీ సాధించినప్పుడు జరిగినప్పటికీ అలా జరగడం ‘‘చాలా అరుదు’’ అని చక్రవర్తి అంటారు. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పుడు సైతం స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలు ఆ ముందరి రోజు కన్నా రెట్టింపు ఏమీ కాలేదు. 22 శాతం మాత్రమే పెరిగాయి. 

రెండవది– ఎన్‌.ఎస్‌.ఇ. సొంత డేటా చెబుతున్న దానిని బట్టి 31న జరిగిన ‘‘మొత్తం షేర్ల కొనుగోళ్లలో 58 శాతం వాటాను ఫారిన్‌ ఇన్వెస్టర్లే (ఎఫ్‌ఐలు) కలిగి ఉన్నారు’’ అని చక్రవర్తి అంటున్నారు. ‘‘ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారంలో ఆ ముందు వరకు ఎఫ్‌ఐలు అంత భారీ మొత్తంలో షేర్లను కొనటం, కొన్న వాటికి మించి అమ్మటం జరగలేదు’’ అని కూడా ఆయన అన్నారు. 

మరి విదేశీ ఇన్వెస్టర్లను అంత భారీ మొత్తాలలో కొనిపించింది ఏమిటి? భారీగా కొనటం మాత్రమే కాదు, 31న వారు అంతే భారీగా అమ్మకాలు కూడా జరిపారన్న వాస్తవాన్ని చక్రవర్తి విస్మరించారు. బదులుగా ఆయన, ‘‘తర్వాతి రోజు ఏం జరిగిందన్న దానిని బట్టే ఆ ముందు రోజు జరిగిన దానిని వివరించగలం’’ అన్నారు. తర్వాతి రోజు అంటే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బయటికి వచ్చిన రోజు. 

మే 31కి, జూన్‌ 1కి చక్రవర్తి పెట్టిన ఈ లంకె... ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల గురించి విదేశీ ఇన్వెస్టర్లకు ముందే తెలిసైనా ఉండాలి, లేదంటే వారికై వారు సర్వే జరిపించుకొని ఉండాలి అన్నదానిని సూచిస్తోంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు అంత భారీగా షేర్లు కొనటానికి ఈ రెండూ కాకుండా మూడో కారణం ఏదైనా ఉండి ఉంటుందా?

ఉంటుందనైతే చక్రవర్తి అనుకోవటం లేదు. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా ఒకే రీతిన మోదీ అపారమైన విజయం సాధించబోతున్నారని ఫలితాలను వెల్లడించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ట్రేడింగ్‌ అనే అత్యంత అరుదైన పరిణామం జరగటం అన్నది కేవలం యాదృచ్ఛికమైతే కాదు’’ అంటారాయన. కానీ అది యాదృచ్ఛికం ఎందుకు కాకూడదు? ఇందిరా గాంధీ తన మరణం గురించి మాట్లాడిన 24 గంటల తర్వాత ఆమె హత్య జరిగింది. అది యాదృచ్ఛికం మాత్రమే! 

విషయాన్ని ఒకడుగు ముందుకు తీసుకెళదాం. విదేశీ ఇన్వెస్టర్లు మే 31న షేర్లు కొనుగోలు చేశారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ అనంతరం జూన్‌ 3న స్టాక్‌ మార్కెట్‌ రాకెట్‌లా పైకి దూసుకెళ్లింది. కాబట్టి అప్పుడు కనుక వారు ఆ షేర్లను అమ్ముకుని ఉంటే భారీగా లాభాలు వచ్చేవి. అలా చేయటంలోని నియమబద్ధత గురించే ఇప్పుడు చక్రవర్తి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.  

ఇలాంటి ప్రశ్నలకు ఆయనైతే ఎలా సమాధానం ఇస్తారనే విషయంలో సందేహం లేదు. ‘‘సంఘటనల కాలక్రమం, స్టాక్‌ మార్కెట్‌ డేటాలను అనుసరించి... ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి మాత్రమే కాకుండా, స్టాక్‌ మార్కెట్‌లను ఉపయోగించి లాభపడటానికి కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ ఆయుధాలు అయ్యాయని ఎవరైనా తేలిగ్గా చెప్పేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎగ్జిట్‌ పోల్‌ స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ ఇండియాలో జరిగి ఉంటుంది’’ అంటారు చక్రవర్తి. 

మీడియా నిర్వహించినవి కనుక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు లీక్‌ అయే అవకాశం ఉందనే విషయాన్ని పక్కనపెడదాం. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లే తమ సొంతంగా ఎగ్జిట్‌ పోల్స్‌ని జరిపించుకొని ఉండి, ఆ ఫలితాలు కూడా మీడియా నిర్వహించిన ఫలితాల దిశనే సూచిస్తూ ఉండి, వాటి ఆధారంగా వాళ్లు షేర్లు కొని ఉంటే అప్పుడది నియమబద్ధం అవుతుందా? ఒకటే ప్రశ్న ఏమిటంటే... విదేశీ ఇన్వెస్టర్లు అంత ప్రయాసతో ఎగ్జిట్‌ పోల్స్‌ జరిపించుకొని ఉంటారా? నాకైతే సందేహమే. 

సగటు భారతీయ పెట్టుబడిదారుల విషయానికి వద్దాం. మొదట, వారు విన్నది ఇదీ: నరేంద్ర మోదీ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’తో (మే 23న) మాట్లాడుతూ, ‘‘నేను నమ్మకంగా చెప్పగలను, జూన్‌ 4న బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటుంది. స్టాక్‌ మార్కెట్‌ కూడా కొత్త రికార్డులకు చేరుకుంటుంది’’ అన్నారు. అంతకు ముందు హోంమంత్రి ‘ఎన్డీటీవీ’తో (మే 13న) మాట్లాడుతూ, ‘‘జూన్‌ 4 లోపు షేర్లు కొనమని మీకు చెబుతున్నాను. అవి అమాంతం పెరగబోతున్నాయి’’ అన్నారు.  

ఆ సలహాలపై వారు షేర్లు కొని ఉంటే, జూన్‌ 4న ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి పోవటం, వారి షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం చూశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ రోజు స్టాక్‌ మార్కెట్‌కు వచ్చిన నష్టం రూ. 30 లక్షల కోట్లు. 

దాంతో సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే మూడు రోజుల తర్వాత, వారాంతంలో శుక్రవారం 7వ తేదీన స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 4వ తేదీన వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవటం మాత్రమే కాదు, షేర్ల పెరుగుదల ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఇక్కడ ఇన్వెస్టర్లకు వచ్చినదానికంటే పోయినది ఎక్కువ.

దీనర్థం ‘సమస్య’ విదేశీ ఇన్వెస్టర్లలో ఉందని! అది దర్యాప్తు జరిపించవలసినంత సమస్యా? భారతదేశంలోని వ్యక్తులు, సంస్థల తరఫున వారు షేర్లలో పెట్టుబడి పెట్టి ఉంటారని మీకు అనుమానంగా ఉంటే అప్పుడు దర్యాప్తు అవసరం కావచ్చు. మీకలాంటి అనుమానం లేదా? వాళ్లు తమకై తామే ఇన్వెస్ట్‌ చేసి ఉంటారని బహుశా మీకు అనిపిస్తోందా? అప్పుడైతే తదుపరి చర్య అవసరం అవుతుందా?


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement