ప్రపంచాన్ని నిలదీస్తున్న యువత Students at one hundred and fifty universities in America | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని నిలదీస్తున్న యువత

Published Sat, Jun 8 2024 12:14 AM | Last Updated on Sat, Jun 8 2024 12:15 AM

Students at one hundred and fifty universities in America

అభిప్రాయం

పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ అమెరికాలోని నూటయాభై విశ్వవిద్యాలయలలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు.  ఏప్రిల్‌ 2024లో కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో బోధన–బోధనేతర ఉద్యోగులు కూడా విద్యార్థులతో పాటు భాగస్వాములయ్యారు. 

ఇందులో హార్వర్డ్, బర్రత్‌ హాల్, కొలంబియా, ప్రిన్స్‌టన్, న్యూయార్క్, యేల్‌ వంటి అన్ని అమెరికన్‌ యూనివర్సిటీల విద్యార్థులున్నారు. అయితే నిరసనలో చురుకుగా పాల్గొన్న పదమూడు మంది విద్యార్థులకు హార్వర్డ్‌ యూనివర్సిటీ డిగ్రీలివ్వకుండా ఆపేసింది. ‘గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాంలకు విద్యార్థులందరూ హాజరు కావచ్చు, కానీ, డిగ్రీలు రద్దయిన ఆ పదమూడు మందికి పట్టా ఇవ్వబడదు’– అని యూనివర్సిటీ ప్రకటించింది. నిరసన సెగలకు తట్టుకోలేక, కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌లు వాయిదా వేసుకున్నాయి. కొన్ని మాత్రం నిర్వహించుకున్నాయి. నిర్వహించుకున్న వాటిలో హార్వర్డ్‌ యూనివర్సిటీ కూడా ఒకటి. 

గాజా మీద దాడులు ఆపాల్సిందిగా, పాలస్తీనాను రక్షించాల్సిందిగా ఈ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాం విద్యార్థులు కోరారు. తమ తమ క్లాసురూముల్లో నుండి ఆడిటోరియంలోని వేదిక మీదికి ఒక్కొక్కరుగా వరుస క్రమంలో క్రమశిక్షణతో నడిచి వస్తూ ‘ఫ్రీ గాజా నౌ’ ‘ఫ్రీ పాలస్తీనా నౌ’–గాజాకు స్వేచ్ఛనివ్వండి! పాలస్తీనాకు స్వేచ్ఛనివ్వండి! అని రాసి ఉన్న గుడ్డ, పేపర్‌ బేనర్‌లను ప్రదర్శిస్తూ వేదిక మీదకు నడిచివెళ్లారు. డిగ్రీలు తీసుకున్నారు. డిగ్రీ తీసుకున్న విద్యార్థుల నుండి కొందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా మాట్లాడే వారిని విద్యార్థులే ఎన్నుకుంటారు. ఆ అవకాశం దక్కించుకుంది భారతీయ–అమెరికన్‌ విద్యార్థిని శ్రుతీ కుమార్‌. ఆమె ప్రసంగంలోని సారాంశం ఇలా ఉంది: 

‘‘నేను తీవ్రంగా నిరాశ చెందాను. ఈ కేంపస్‌లో భావ వ్యక్తీకరణను శిక్షించడం జరిగింది. శాసనోల్లంఘన జరిగిందని శిక్షించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ ఎక్కడున్నాయి? పదిహేను వందలమంది విద్యార్థులు మాట్లాడారు. పిటిషన్లు సమర్పించారు. ఐదు వందల మంది అధ్యాపకులు మాట్లాడారు. మా ఆక్రోశం, మా ఆవేదన హార్వర్డ్‌– నీకు వినిపిస్తోందా?

గాజాలో జరుగుతున్న సంఘటనలతో మనం మన సమాజంలో నిలువుగా బలంగా విడిపొయ్యాం! మనకు తెలియని వారిలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? మనకు భేదాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వారి వేదననూ, నొప్పినీ అర్థం చేసుకోలేమా? గాజాలో జరుగుతున్న మారణకాండను మేమెవ్వరం సమర్థించడం లేదు. 

భావ ప్రకటన, సంఘీ భావ ప్రకటన ఈ కేంపస్‌లో శిక్షలకు గురయ్యాయి.  ఈ సెమిస్టర్‌లో ఈసారి నా పదమూడు మంది సహ విద్యార్థులకు డిగ్రీలు అందడం లేదు. వారు మాతో పాటు పట్టభద్రులు కాలేకపోతున్నారు. శాసనోల్లంఘన జరిగిందని– ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మా విద్యార్థి లోకాన్ని ఎంతగానో బాధించింది. ఇంకా చెప్పాలంటే నలుపు, చామనచాయ చర్మం గల నాలాంటి విద్యార్థినీ విద్యార్థులకు ఇక్కడ వ్యక్తిగత భద్రత లేదు. మా పట్ల ఎందుకీ అసహనం? ఎందుకీ అణచివేత? హార్వర్డ్‌! మా మాటలు నీకు వినిపిస్తున్నాయా?’’

అమెరికాలోని నిబ్రాస్కాలో పుట్టి పెరిగిన ఇరవైయేళ్ళ యువతి శ్రుతీ కుమార్, తన పదినిముషాల ప్రసంగంతో ప్రపంచాన్ని కదిలించింది. తన తోటి విద్యార్థులకు పట్టాలు రాకపోవడం పట్ల ఆవేదన తెలియజేస్తూ– గాజాపై జరుగుతున్న దాడుల గూర్చీ, నల్లచర్మం ఆధారంగా సాగుతున్న జాతి వివక్ష గూర్చీ ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటలకు హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఆడిటోరియం బయట ఉన్న వేలమంది, వేదిక మీద ఉన్న అధ్యాపకులతో సహా– అందరికందరూ లేచి నిలబడి కాంపస్‌ దద్దరిల్లిపోయేట్లు చప్పట్లు చరిచారు. 

‘హార్వర్డ్‌ నీకు వినిపిస్తోందా?’ అని గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించినపుడల్లా విద్యార్థులు పెద్దఎత్తున చప్పట్లు చరిచి ఆమెకు తమ సంఘీభావం తెలియజేశారు. అయితే ఆ ఆవేదన, ఆ ఆక్రందన హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ‘ప్రపంచమా! నీకు మా ఆక్రోశం, ఆవేదన వినిపిస్తోందా?– అని యువతరం ప్రశ్నిస్తున్నట్టు ప్రపంచ శ్రోతలకు అనిపించింది.

సంఘసేవ పట్ల ఆసక్తి గల శ్రుతీ కుమార్, డాక్టర్‌ కోర్సును వదులుకుని, వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర, ఆర్థిక శాస్త్రం చదువుకుని పట్టా సాధించారు. తమిళనాడు నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత సంప్రదాయ కుటుంబం వారిది. 

మనదేశంలోనూ విద్యార్థి ఆందోళనలు జరుగుతున్నాయి. వెంటనే కులగణన జరిపించాలనీ, అందరికీ సమానంగా ఉద్యోగాల్లో అవకాశాలుండాలనీ హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన సమ్మె, నిరసనలూ తక్కువవి కావు. ప్రపంచంలో యువతరం ప్రశ్నని బలోపేతం చేస్తూ ఉందన్న దానికి  అన్ని చోట్లా జరుగుతున్న విద్యార్థి నిరసనలను సంకేతాలుగా చూడాలి!!

డా‘‘ దేవరాజు మహారాజు  
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత ‘ మెల్బోర్న్‌ నుంచి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement