బ్రహ్మజ్ఞానం అంటే... Brahmagyannam Inspirational And Devotional Story As Written By Yamijala Jagadish | Sakshi
Sakshi News home page

బ్రహ్మజ్ఞానం అంటే...

Published Tue, Jun 11 2024 10:12 AM | Last Updated on Tue, Jun 11 2024 10:19 AM

Brahmagyannam Inspirational And Devotional Story As Written By Yamijala Jagadish

ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు బ్రహ్మజ్ఞానం తెలియాలని ఆశపడ్డారు. వారిద్దరినీ ఓ మంచి గురువు వద్దకు పంపారు. ఇద్దరూ గురుకులవాసం పూర్తి చేసుకుని ఇంటికొచ్చారు. తండ్రి తన పెద్దకొడుకుని చూసి ‘బ్రహ్మజ్ఞానం గురించి ఏం నేర్చుకున్నావు’ అని అడిగాడు. వెంటనే ఆ కొడుకు వివిధ అంశాల గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. వేదాల నుంచీ, శాస్త్రాల నుంచీ ఉదాహరణలు చెబుతున్నాడు. అతడి మాటలకు అడ్డు తగులుతూ ‘సరే ఆపు’ అని తండ్రి అన్నాడు.

ఈసారి బ్రహ్మజ్ఞానం గురించి నువ్వేం నేర్చుకున్నావని చిన్న కొడుకుని అడిగాడు తండ్రి. అతను నోరెత్తలేదు. తల వంచుకుని నిల్చున్నాడు. తండ్రి అతని వంక చూశాడు. నీ వాలకం చూస్తుంటే నీకే బ్రహ్మజ్ఞానం గురించి అంతో ఇంతో తెలిసినట్లుందన్నాడు. ‘బ్రహ్మం గురించి పూర్తిగా తమకు తెలుసని పలువురు అనుకుంటూ ఉంటారు. అది ఎలాంటిదంటే బ్రహ్మాండమైన చక్కెర కొండ నుంచి ఒక్క రవ్వ చక్కెరను తీసుకుని పోతున్న చీమ మరోసారి వచ్చినప్పుడు ఈ మొత్తం కొండను తీసుకుపోతానని చెప్పడం లాంటి’దని రామకృష్ణపరమహంస చెప్పారు.

బ్రహ్మం అనేది మన ఆలోచనలకు, మాటలకు అతీతమైనది. గొప్ప గొప్ప మహాత్ములను కూడా ఈ విషయంలో పెద్ద చీమలని చెప్పవచ్చు. వారందరూ ఓ ఏడెనిమిది చక్కెర రవ్వలను తీసుకుపోయి ఉంటారు. అంతే. బ్రహ్మం అనే మహాసముద్ర తీరాన నిల్చుని కాళ్ళు తడుపుకోవడం లాంటిదే వారు బ్రహ్మజ్ఞానం తమకు తెలుసునని చెప్పడం. నిజానికి వారందులో మునగలేదు. మునిగి ఉంటే వారు తిరిగివచ్చి ఉండరు.

‘అనగనగా ఓ ఉప్పు బొమ్మ ఉండేది. సముద్రం లోతెంత అని తెలుసుకోవడంకోసం అందులోకి దూకాలన్నది దాని ఆశ. అలాంటి ఆశ పుట్టినప్పుడు అది ఉత్తినే ఉండగలదా! సరే, సముద్రం లోతెంత చూసేద్దామని నిర్ణయించుకుంది. వెంటనే అది సముద్రంలో దూకేసింది. కొంచెం దూరం వెళ్ళిందో లేదో... అంతే సంగతులు. ఉప్పుబొమ్మ సముద్రంలో దూకితే ఏమవుతుంది... కొంచెం కొంచెంగా కరగనారంభించింది. కాస్సేపటికే బొమ్మ మొత్తం కరిగిపోయింది.

అది ఇంకేం కనిపెట్టగలదు సముద్రం లోతుని! అలాగే బ్రహ్మజ్ఞానం తనకొచ్చేసింది అనుకున్న మనిషి మౌనంగా ఉంటాడు. అది వచ్చేంతవరకూ మట్లాడుతూనే ఉంటాడు. తేనె తాగడం కోసం ఓ భ్రమరం తోటలోకి వెళ్ళింది. అది పువ్వు మీద వాలే వరకే ఝుమ్మని శబ్దం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పువ్వు మీద వాలిందో ఆ క్షణంలోనే అది మౌనమైపోతుంది. అలాటిదే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడ’మని పరమహంస అంటారు. – యామిజాల జగదీశ్‌

ఇవి చదవండి: June11: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement