కపిలుడికి.. హనుమంతుడి అనుగ్రహం! As Written By Sankhyayana To Kapila Hanuman's Grace Devotional Story | Sakshi
Sakshi News home page

కపిలుడికి.. హనుమంతుడి అనుగ్రహం!

Published Sun, Jun 23 2024 2:06 AM | Last Updated on Sun, Jun 23 2024 2:06 AM

As Written By Sankhyayana To Kapila Hanuman's Grace Devotional Story

గంగాతీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కపిలుడు సదాచార సంపన్నుడు. దైవచింతనాపరుడు. హనుమంతుడికి పరమభక్తుడు. అయితే, అతడు నిరుపేద. భార్యా పుత్రులను పోషించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతుండేవాడు. 

రోజూ ఉదయమే గంగానదిలో స్నానం చేసి, నది ఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే, సాయంత్రానికి ఏ కూరగాయలో, ఆకుకూరలో కొనుక్కుని ఇంటికి వెళ్లేవాడు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది.

ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్లి స్నానం చేసి, జపానికి కూర్చున్నాడు. తదేకదీక్షలో జపంలో నిమగ్నుడై, కాలాన్ని మరచిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణకుండలాలతో, చతుర్భుజాకారుడై, గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు తదితర వానరయోధులందరూ ఉన్నారు.

కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేకజలం నుంచి వాలసాగరం అనే నది పుట్టింది. కపిలుడు ఆ నదికి పూజించి, హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి, హనుమంతుడిని స్తోత్రపాఠాలతో ప్రార్థించాడు. కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు. ‘వరం కోరుకో’ అన్నాడు హనుమంతుడు. భక్తిపారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు. హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికే చీకటిపడటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు. 

ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కపిలుడిని చూసి అతడి భార్య ‘అయ్యో! కనీసం ఆకుకూరైనా తేకపోయారు. ఈ పూట పిల్లలకు ఏం వండిపెట్టగలను. కూడు గుడ్డకు కటకటలాడుతున్నా, మీ జపతపాలు మీవే కదా!’ అని రుసరుసలాడుతూ పిల్లలకు మంచినీళ్లు తాగించి పడుకోపెట్టింది.

మర్నాడు తెల్లవారింది. కపిలుడు యథాప్రకారం గంగాతీరానికి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు. అతడి భార్య సణుగుడు ప్రారంభించింది. ‘ఎంత చెప్పినా వినరు కదా! మీ జపతపాల గోల మీదేగాని, కుటుంబం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండితిప్పల గురించి ఏమైనా ఆలోచించారా?’ అంది.

‘ఊరుకో! అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం. అన్నట్లు చెప్పడం మరచాను. నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నాడో స్వామి! హనుమతో పాటు జాంబవతాది వానర వీరులందరూ కనిపించారు. నా జన్మ ధన్యమైంది. ఇంక నాకేం కావాలి’ అన్నాడు కపిలుడు.

‘ఔను! హనుమంతుడూ గొప్పవాడే, మీరూ ధన్యులే! మీ కుటుంబానికి మాత్రం దారిద్య్రం తప్పదు’ కినుకగా అంది కపిలుడి భార్య. ఆమె ఇంకా తన సణుగుడు కొనసాగిస్తుంటే వినలేక కపిలుడు ఇల్లు వదిలి, గంగాతీరం వైపు బయలుదేరాడు.
కుటుంబ పరిస్థితిపై కపిలుడికీ బాధగానే ఉంది. అయినా హనుమంతుడి మీదనే భారం వేసి, గంగలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానానికి కూర్చున్నాడు.

అతడు తదేక ధ్యానంలో ఉండగా, హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.
‘కపిలా! నువ్వు నా భక్తుడవు. నీకు, నీ కుటుంబానికి క్షేమసౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటి పెరట్లోని రేగుచెట్టు కింద ధనరాశుల బిందె పాతరవేసి ఉంది. దానిని తవ్వితీసి, నీ కుటుంబమంతా ఆనందంగా జీవించండి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి, జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు.

‘ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకే భక్తుని మీద దయ ఉంటే, ఈ రాతినేలను తవ్వి, ధనపు బిందెను తీసి ఇవ్వవచ్చు కదా! శ్రీరాముడు వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనే మోసుకువచ్చాడని మీరు పురాణం చెబుతుంటారు. ఈమాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లోని రాతినేలను మీరు తవ్వగలరా? నేను తవ్వగలనా?’ అంది నిష్ఠూరంగా.

కపిలుడికి భార్య మాటలు బాధ కలిగించాయి. ‘పరమ కరుణామూర్తి అయిన భగవంతుడు వరమిచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వితీసే భారం కూడా పాపం ఆయనదేనా? ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను. నా బాధ నేనే అనుభవిస్తాను’ అనుకున్నాడు. హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోయాడు.

మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్రలేవగానే, ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది. ఇల్లంతా బంగారుకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తను నిద్రలేపింది. హనుమంతుడి దయాభిక్షకు వివశుడైన కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయసాగాడు. ఇన్నాళ్లూ హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. ఆనాటి నుంచి కపిలుడితో పాటు అతడి భార్య కూడా హనుమంతుడిని అర్చించడం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకుని, మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు. – సాంఖ్యాయన

ఇవి చదవండి: Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement