Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు Ugadi 2024 Ugadi PachadiRecipe | Sakshi
Sakshi News home page

Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు

Published Sat, Apr 6 2024 3:18 PM | Last Updated on Sat, Apr 6 2024 4:19 PM

Ugadi  2024 Ugadi PachadiRecipe  - Sakshi

త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

1. తీపి
శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది.

ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్‌ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు

.

2. పులుపు
వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి.

3. ఉప్పు
ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి.

4. కారం
కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి.

5. చేదు
చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు.

6. వగరు
వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్‌ బెర్రీలు, గ్రీన్‌ బీన్స్‌ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు.

రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్‌ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్‌ అయ్యేలా చూసుకుంటే చాలు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement