SVPNPA: ఎవరికి వారే.. మహిళా‘మణులే’! SVPNPA: 32 womens IPS trainees have completed their training | Sakshi
Sakshi News home page

SVPNPA: ఎవరికి వారే.. మహిళా‘మణులే’!

Published Thu, Oct 26 2023 12:23 AM | Last Updated on Thu, Oct 26 2023 12:23 AM

SVPNPA: 32 womens IPS trainees have completed their training - Sakshi

హైదరాబాద్‌ శివార్లలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడెమీలో (ఎస్‌వీపీ ఎన్ పీఏ) శిక్షణ పూర్తి చేసుకున్న 155 మంది ఐపీఎస్‌ ట్రైనీల్లో 32 మంది మహిళలు ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటి ఓవరాల్‌ టాపర్‌గా నిలిచిన అనుష్త కాలీయా శుక్రవారం జరిగే పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు (పీఓపీ) నేతృత్వం వహించనున్నారు. ఇలా ఓ మహిళ ట్రైనీ పీఓపీకి నేతృత్వం వహించడం 75 ఏళ్ళ అకాడెమీ చరిత్రలో ఇది మూడోసారి. ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారులుగా బయటకు రానున్న మహిళామణుల్లో ఉన్న ప్రత్యేకతల గురించి...

గంటకు 16 కిమీ పరిగెత్తే సత్తా సాధించి...
ఢిల్లీకి చెందిన అనుష్త కాలియా ఢిల్లీ యూనివర్శిటీలోని క్లస్టర్‌ ఇన్నోవేషన్  సెంటర్‌ నుంచి డేటా సైన్్సలో బీటెక్‌ పూర్తి చేశారు. అక్కడే బ్లింకిట్‌ అనే స్టార్టప్‌ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలపై ఉన్న ఆసక్తితో ఆరునెలలకే ఈ ఉద్యోగం వదిలారు. కోవిడ్‌ ప్రభావంతో కోచింగ్‌ సెంటర్లకు బదులు ఆన్ లైన్  క్లాసులకు పరిమితం అయ్యారు.

లాక్‌డౌన్  కారణంగా ఇతరుల్ని కలవడం తగ్గిపోవడంతో దాన్ని పాజిటివ్‌గా వాడుకుని చదువుకే పరిమితం అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 143వ ర్యాంకు సాధించారు. స్కూలు, కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్, కరాటే పోటీల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఎన్ పీఏలో అడుగు పెట్టే సమయానికి గంటకు కిలోమీటరు దూరం కూడా పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి శిక్షణ కారణంగా ప్రస్తుతం గంటకు 16 కిమీ పరిగెత్తే సామర్థ్యాన్ని సాధించారు. ఈ బ్యాచ్‌లో ఓవరాల్‌ టాపర్‌గా, ఔట్‌డోర్‌ టాపర్‌గానే కాకుండా పరేడ్‌ కమాండర్‌గా నిలిచే అవకాశంతోపాటు స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ సొంతం చేసుకున్నారు.
   
ప్రజాసేవలో సాంకేతికతని వినియోగించాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నారు.  ఎన్ పీఏ శిక్షణలో ఎన్నో అంశాలు నేర్చుకున్నానని, గ్రేహౌండ్స్‌ ఆ«ధ్వర్యంలో జరిగిన నెల రోజుల జంగిల్‌ ట్రైనింగ్‌ మాత్రం కఠినంగా అనిపించిందని చెప్పారు.

లాయర్‌గానే సఫాయీ
కార్మికుల కోసం...
ముంబైకి చెందిన ఇషా సింగ్‌ తండ్రి యోగేష్‌ ప్రతాప్‌ (వైపీ) సింగ్‌ ఐపీఎస్‌ అధికారి అయినప్పటికీ వీఆర్‌ఎస్‌ తీసుకుని న్యాయవాదిగా మారారు. తల్లి అభాసింగ్‌ సైతం న్యాయవాది. వైపీ సింగ్‌ మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ స్కామ్‌లో బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తున్నారు. 2018లో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్శిటీ నుంచి ఇషా పట్టా పొందారు. 26వ ఏటనే పీపుల్స్‌ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి గొవాండీలో ఉన్న మౌర్య హౌసింగ్‌ సొసైటీలో 2019 డిసెంబర్‌ 3న జరిగి ఉదంతం ఇషా దృష్టికి వచ్చింది. అక్కడ సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు సఫాయీ కార్మికులు చనిపోయారు.

చనిపోయిన వారి భార్యలకు న్యాయం చేయడం కోసం అసిస్టెన్ ్స ఫర్‌ సఫాయీ కరమ్‌చారీ (ఆస్క్‌) స్థాపించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమీకరించి అందించారు. ఇలా మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని 1993 నుంచి మహారాష్ట్ర లో నిబంధనలు ఉన్నా అమలు కాలేదు. దీనిపై ముంబై హైకోర్టులో 2021లో రిట్‌ దాఖలు చేసి వారి తరఫున పోరాడి వారికి పరిహారం ఇప్పించారు. ఈ కేసుపై అప్పటి జడ్జ్‌ ఉజ్వల్‌ భూయాన్  1993 నుంచి ఇలా చనిపోయిన వారి జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి చూపిన మార్గంలో ఐపీఎస్‌ కావాలని భావించిన ఇషా రూ.20 లక్షల ప్యాకేజీతో వచ్చిన ఉద్యోగం వదులుకుని రెండో ప్రయత్నంలో 191వ ర్యాంక్‌ సా«ధించింది.

యూట్యూబ్‌ చూసి యూపీఎస్సీ పరీక్షలు క్రాక్‌ చేసి...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలో ఉన్న మావు పట్టణానికి చెందిన సిమ్రన్  భరద్వాజ్‌ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌గా పని చేస్తుండటంతో సాధారణంగానే యూనీఫామ్‌∙సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. తాను నివసించేది చిన్న పట్టణం కావడంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన కోచింగ్‌ సెంటర్ల వంటి సదుపాయాలు లేవు.

దీనికితోడు 2021 జూన్ లో గ్రాడ్యుయేషన్  పూర్తి కాగానే సివిల్స్‌ పరీక్ష రాయాల్సి ఉంది. కరోనా ప్రభావంతో కోచింగ్‌ సెంటర్లు అన్నీ మూతపడ్డాయి. దీంతో యూట్యూబ్‌ ఛానల్స్‌లో క్లాసులు వింటూ రోజుకు 8 నుంచి 10 గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేర్‌ అయింది. మిగిలిన సమయం కంబైన్ ్డ డిఫెన్ ్స సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్షకు వెచ్చించింది. కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన ఈ రెండు పరీక్షలు 2021 అక్టోబర్‌లో జరిగాయి. మొదటి ప్రయత్నాల్లోనే సీడీఎస్‌లో ఆరో ర్యాంక్, సివిల్స్‌లో 172వ ర్యాంక్‌ సాధించింది. 23 ఏళ్ళ వయస్సులోనే ఐపీఎస్‌కు ఎంపికైంది. ఎలాంటి ఇతర యాక్టివిటీస్‌ లేని కోవిడ్‌ టైమ్‌ తనకు కలిసి వచ్చిందని సిమ్రన్  చెప్తున్నారు.

ఐఏఎస్‌ అనుకున్నా ఐపీఎస్‌గా...
వరంగల్‌కు చెందిన బి. చైతన్య రెడ్డి అక్కడి ఎన్‌ఐటీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. తండ్రి గ్రూప్‌–1 ఆఫీసర్‌గా ఉండటంతో సివిల్‌ సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. సివిల్‌ సర్వెంట్స్‌గా ఉంటేనే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం దక్కుతుందని అని తండ్రి చెప్పిన మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయి. ఇరిగేషన్  శాఖలో ఏఈగా పని చేస్తూనే ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌ వైపు మొగ్గారు. మెయిన్ ్సలో మూడుసార్లు అపజయం ఎదురైనా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళారు. సివిల్స్‌తోపాటు కేంద్ర సాయుధ బలగాల్లో ఎంపికకు సంబంధించిన పరీక్షల్నీ రాశారు. దీంతో ఐఏఎస్‌ నుంచి దృష్టి ఐపీఎస్‌ వైపు మళ్ళింది. 2022 లో 161వ ర్యాంక్‌ సాధించి తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు.

– శ్రీరంగం కామేష్, సాక్షి సిటీబ్యూరో, హైదరాబాద్‌   ;    ఫొటోలు: ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement