వ్యాక్సిన్‌ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం | Sudha Murty Rajya Sabha speech calls for affordable cervical cancer vaccination | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం

Published Sat, Jul 6 2024 4:23 AM | Last Updated on Sat, Jul 6 2024 4:23 AM

Sudha Murty Rajya Sabha speech calls for affordable cervical cancer vaccination

చైతన్యం

రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌  సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో  ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ మరణాల గురించి మాట్లాడారు.   దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్‌ ఇవ్వాల్సిన  ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే.  సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన  సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.

కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్‌గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్‌ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.

ఏమిటీ సర్వైకల్‌ క్యాన్సర్‌?  
మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్‌. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్‌)కూ మధ్యన సన్నటి  దారిలా ఉండే సర్విక్స్‌ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్‌ను ‘సర్వైకల్‌ క్యాన్సర్‌’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌) అని అంటారు.  

నిజానికి మిగతా క్యాన్సర్‌లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. 

కానీ ఈ క్యాన్సర్‌ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్‌ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్‌ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.

ప్రధాన రకాలు... 
సర్వైకల్‌ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే  ‘స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్‌ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. 

రిస్క్‌ ఫాక్టర్లు...
హెచ్‌పీవీ వైరస్‌ సోకడం అనేది సర్వైకల్‌ క్యాన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్‌ ఫ్యాక్టర్‌. చాలామందిలో ఈ హెచ్‌పీవీ వైరస్‌ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.

చికిత్స ప్రక్రియలు... 
ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ  మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. 

సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు.  సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్‌ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు.
 

హెచ్‌పీవీతో సమర్థమైన నివారణ
మామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్‌’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్‌ క్యాన్సర్‌ను తెచ్చిపెట్టే హెచ్‌పీవీ వైరస్‌ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్‌లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్‌పీవీ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

 అదే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్‌ను తయారుచేసి, సర్వైకల్‌ క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్‌ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. 

కారణాలు
సర్విక్స్‌ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్‌ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) ప్రధానం. ఈ వైరస్‌ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్‌ పార్ట్‌నర్స్‌ తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ.

నివారణ... 
సర్వైకల్‌ క్యాన్సర్‌ నిర్ధారణలో పాప్‌స్మియర్‌ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం  ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్‌ క్యాన్సర్‌ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్‌ దశ’ దీనికి ఉంది  

డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్‌ కన్సల్టెంట్‌  గైనకాలజిస్ట్‌ – రిస్క్‌ ఆబ్‌స్టెట్రీషియన్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌

మహిళల్లో వచ్చే సర్వైకల్‌ క్యాన్సర్‌ కు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్‌కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్‌ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్‌ టైమ్‌లో దేశం మొత్తానికి వ్యాక్సిన్‌ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద  మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. 
–  సుధామూర్తి  రాజ్యసభ సభ్యురాలు,  సమాజ సేవిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement