SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు | Sakshi
Sakshi News home page

SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు

Published Sun, Jun 16 2024 12:31 AM

SKY IS THE LIMIT: Indian Air Force Academy Passing Out Parade At Dundigal

ఫాదర్స్‌ డే స్పెషల్‌

ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు.

 అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే  తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్‌ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో  శనివారం నిర్వహించిన  పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్‌ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.

నాన్న మాటే ఇంధనం
నా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్‌ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్‌ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. 

తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ 

ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌లో ఎంటెక్‌ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్‌ అసోసియేట్‌గా, స్విమ్మింగ్‌ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా,  సెల్ఫ్‌ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. 

ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్‌ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది.  వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది.  
– శ్రీప్రియ, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌

నాన్నే నాకు స్ఫూర్తి
నా పేరు నందినీ సౌరిత్‌. హర్యానాలోని పల్వల్‌ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్‌ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్‌. మా నాన్న ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్‌ ఫోర్స్‌లో 
చేరాను.

తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్‌ 

 ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్‌సీసీ కేడెట్‌ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు  మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌తో ఎడ్యుకేషన్  బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. 
– నందినీ సౌరిత్, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌

నాన్నే దేశసేవ చేయమన్నారు
మాది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్‌ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఆఫీసర్, అమ్మ అంజేష్‌ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. 

తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్‌లతో మాన్వి 

నా మొదటి ప్రయత్నంలోనే   ఇండియన్  ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికయ్యాను.  మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్‌ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్‌ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్‌ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్‌ బ్రాంచ్‌ ఇచ్చారు. 
– మాన్వి, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement