నేలపట్టు! ‘మామయ్యా.. ఒక్క విషయం'.. 'Nelapattu' Sunday Special And Long Story Written By Eeta Kota Subbarao | Sakshi
Sakshi News home page

నేలపట్టు! ‘మామయ్యా.. ఒక్క విషయం'..

Published Sun, Jun 2 2024 10:28 AM | Last Updated on Sun, Jun 2 2024 10:28 AM

'Nelapattu' Sunday Special And Long Story Written By Eeta Kota Subbarao

జీవితం జీవించటానికి కాదు. జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం. ఉదయ సంధ్య వేళ. చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ.  ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో డోలలూగుతున్న భావన. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం. ఎప్పుడో వెళ్లిపోయిన యవ్వనం తిరిగి వచ్చినంత ఉత్సాహంగా ఉంది. సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు. అది అలవాటు. దినచర్యలో మొదటి ప్రస్థానం.

తెల్లటి ఖద్దరు జుబ్బా, ఎగ కట్టిన పంచెతో తదేకంగా నడుస్తున్నాడు. అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు. ఆ పక్క చెరువులో కడప చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు. వీనులవిందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతమంతా. చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది. రోజూ టిఫిన్‌ తెచ్చి ఫామ్‌హౌస్‌లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడం కొద్దిగా గాబరా పడ్డాడు. పడమర పొలం వెళ్లటం మానుకొని ఎదురు నడిచాడు.

‘టిఫిన్‌ తెచ్చి టేబుల్‌ మీద పెట్టాను అయ్యా.. మధ్యాహ్నం అన్నం వండాలా?’  కొత్తగా అడగటంతో అర్థం కాలేదు. అదే ప్రశ్నించాడు చంద్రశేఖరం.
      ‘ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నీవేమీ వండొద్దు, మేం చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా’ వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం.
      ‘ఏమిటి విషయం ఈరోజు?’ చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే ‘అయ్యా పక్షుల కొరకు చెరువు గట్టు మీద మన ఊరోళ్ళు పొంగళ్ళు పెట్టేది ఈ రోజే కదయ్యా’ మాణిక్యం జవాబుతో గుర్తుకు వచ్చిన వాడిలా ‘అవును కదూ సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పూట ఇక్కడే గడిపేస్తానులే. రాత్రికి వచ్చి, మామూలుగానే చపాతీ చేసి వెళ్ళు.. సరేనా’ అంటూనే ఇక నీవెళ్ళచ్చు అని తల ఆడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు.

‘నాన్న నువ్వు ఎప్పటికీ ఊర్లో వాళ్ళు పంపిన అన్నం తినవద్దు. ఇంట్లోనే చేయించుకో. పొలం వెళితే వారితో కలసి అన్నం తినొద్దు’ కూతురు రోహిణి మాటలు గుర్తుకు వచ్చాయి. 
      కళ్ళలో సన్నటి నీటి చెమ్మ. రోహిణిని చూసి ఐదేళ్లయ్యింది. ఫోన్‌లోనే కులాసాలు, కబుర్లు. ఆడబిడ్డ మేలు.. ప్రతివారం ‘ఏం నాన్నా..’ అని నోటినిండా అరగంట మాట్లాడుతుంది. ప్రశాంతు, సుమన్‌లు అయితే పలకరింపు క్కూడా అందడం లేదు. పిల్లలు సరే, కట్టుకొని, నాలుగు పదుల కాలం కాపురం చేసిన తాళికి ఏమైంది.. ఎక్కడ నుంచి వచ్చాము, ఏ మట్టి తల్లి బిడ్డలం అనేది మర్చిపోతే ఎలా? మూలాలు దాచేసే జీవితాలా? జన్మనిచ్చిన పల్లెను, జీవితాన్ని పంచిన నేల పరిమళాలు తుడిచేస్తే పోయేవేనా?

‘పల్లె నచ్చక, పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు, వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకుని తిరుగుతుంటే కంటికి రెప్పలా మనమేగా కాసుక్కూర్చోవాలి’ అనేది శకుంతల.
      నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని, పునాదుల్ని గుర్తు చేసుకోను ఇష్టంలేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతూ ఉంది శ్రీమతి చంద్రశేఖరం.
      ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మధ్య బతికేవాడు. కుటుంబాన్ని.. వారి బాగోగులను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో, సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు. తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్‌ ఏఎస్పీ చంద్రశేఖరం.

నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు, అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం. నాగరికులు అనేదానికి వీల్లేదు. పల్లెలకు పట్నాలకు దూరంగా ఉంది. నాగరికత నీడ పడని ఊరు. ఆ చిన్న పల్లెటూరే నేలపట్టు. యాబై గడప దాటని కుగ్రామం. దొరవారి సత్రం వెళ్లే తారు రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి. అక్కడ అందరి జీవనం ఒక్కటే. నీళ్ల కాలంలో పులికాట్‌ సరస్సులో చేపల వేట. మిగిలిన రోజుల్లో చెరువు, దొరువుల్లో వేట. ఇదే వారి జీవనాధారం.

నేలపట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివినవారే అంతా. అదీ సుదూరం నడిచి వెళ్లి. ఆ ఊర్లో తొలి డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి చంద్రశేఖరం. దాని వెనుక సుబ్బయ్య, పిచ్చమ్మ పట్టుదల బోలెడంత.
      వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరం. చదివించాలనే మూర్ఖత్వం వారిది. మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బిరుదు. ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య – పిచ్చమ్మ దంపతులది.
      నేలపట్టులో అది ఎనిమిదో వింత. శిక్షణ పూర్తిచేసుకుని ఇందుకూరుపేట పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టరుగా చార్జి తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం. ఒక్క క్షణం ఆ పల్లె గడప, పోలీసు జీపు దుమ్ముకు, ఖాకీ బట్టల వాసనకు సన్నగా వణికింది. నేలతల్లికి ముద్దు పెట్టుకొని నడిచి వస్తున్న ఎస్‌ఐని చూసి ‘పోలీసు కాదురా మన చంద్రుడే!’ అని సన్నటి చిరు జల్లుల సందడిలో పల్లె అంతా సరదాల చిత్తడి అయింది.

‘మా చంద్రుడు బీఏ అంట’ నేలపట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునే వారు. వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి. బీఏ కాదు పీజీ చేశాడని, నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చందురూడే కాల చక్రభ్రమణంలో ఎస్సై మాత్రమే కాదు సీఐ, డి.ఎస్‌.పి, ఏఎస్పీ కూడా అయినాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్‌కు చివరి రెండేళ్లు నెల్లూరు వచ్చారు.

రాష్ట్రస్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికి అందరూ తెలుసుకున్నారు. నేలతల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలెట్టిన నేలపట్టు చంద్రుడు ఊరిని మరవలేదు. వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదు ఏళ్ళలో పూర్తి చేయగలిగాడు. సొంత ఊరు నుండి నాయుడుపేట, దొరవారి సత్రానికి తారు రోడ్లు మొదలు పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య సబ్‌సెంటర్, పక్కా ఇళ్లు.. అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయడమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్య పరచడం తన విధులలో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం. నాటు పడవలు, వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబోకు భూములను గ్రామçస్థులకు కేటాయించేలా కృషిచేసి డి ఫారములు అందేలా చేశాడు. ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెల వెలుగయ్యాడు.

మూడు పదుల ఏళ్ల కృషి – ఆ నేల వైభవం ఆ ప్రాంతాలలో ప్రవచనంలా మారుమోగుతుంది. దానికి అనేకానేక కారణాలు. అభివృద్ధి మాత్రమే కాదు, ప్రతి ఇంట చదువుకున్న వారే. గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే, పోలీసు, బడి పంతుళ్లు, ఇంజినీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది. 
      నేలపట్టు.. ఆకాశమంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జల తివాచీగా పరచినట్టు ఉంటుంది. చెట్లకి ప్రాణమిచ్చే మట్టి, మట్టిని మెత్తగా మలచిన చెట్లు. చెట్లుకీ మట్టికీ ఉనికినిచ్చిన పులికాట్‌ సరస్సు. చెట్టు, మట్టి, సముద్రం, పులికాట్‌లకు స్థానమిచ్చినదే నేలపట్టు. ఒకప్పుడు మురుగు కూపం – నేడు ఆదర్శగ్రామం. తైల సంస్కారమెరగని పల్లెసీమ – నేడు ఉత్తమ పల్లె. పోరంబోకు పొలాలు పంట పొలాలు అయ్యాయి.

చెరువు ఆయకట్టు కింద రెండు కార్లు జీలకర్ర మసూర్లకు వేదికైంది. ఆ డివిజనులోనే అభివృద్ధికి దర్వాజా అయింది. ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది. ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది. దానితో పాటు ఎర్ర చెరువు.. నేలపట్టుకు కలసొచ్చిన మరో ఆయువుపట్టు అయింది. అదే వలస పక్షులు. చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు వీటికి ఆసరా.

ఈశాధాన్యుల హిమాలయ యాత్రలా, కాశీతీర్థ ప్రయాణంలో వలసపక్షులు చేరుతుంటాయి. విశ్వసుందరి పోటీలకు పయనమైన సోయగాల్లా, విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారుల్లా, పులికాట్‌ సరస్సు ఒడ్డున వాలుతాయి ఈ తారా పక్షులు. ప్రేమయాత్రో, ఆత్మీయ సంగమ ప్రయాణమో, తను పుట్టిన మట్టిని ముద్దాడుతుంటాయి ఈ ఫెలికాన్లు. సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు, దండయాత్రకు తరలివచ్చిన సముద్ర సైన్యంలా, పెలికాన్లు, ఫ్లెమింగోలు, నారాయణ పక్షి, నీటి కాకి, పాలపిట్ట, కళ్లకంకణాయి, ఎర్రకాళ్ల కొంగ, నీటి కొంగ, చెకుముకి పిట్ట, ఇక్కడ ఆవాసాలతో బృందావనంలా మలచుకుంటాయి ఈ నేలపట్టుని. ఒకనాడు అలెగ్జాండరు జయించాడు జంబూ ద్వీపాన్ని, ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేలపాదాల్ని.

      వేల పక్షులు ఆరు నెలలు పాటు ప్రేమమయ భక్తి భావనలే. రాధా మాధవ ప్రణయ వేద వేదనా స్వనాలే. కొత్త సృష్టి రచనా రీతికి అనుక్రమణికలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది. 
      సృష్టియాగం మదనభంగిమ అందుకేనేమో పరువపు ఘుమఘుమలు – రేగడి నేలల్లో రెట్టల పరిమళం.రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి. చెరువు, పొలాల గట్లలో నిండిన చెట్లు పక్షుల ఎరువుతో కలసి పదిరెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు. నేలపట్టు మహిళలు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే. గుళ్లు, గోపురాలు, దేవుళ్లు, దేవతలకు కాదు, చెరువుకు కడప చెట్లకు మొక్కులు తీర్చుకుంటారు. దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు. పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. అదే తిరణాల. అందుకే సవినయ సాదర స్వాగతం పలుకుతూ, నేలపట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతుండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండుగ. ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు, ఈ పొంగళ్లు, ఉత్సవాలకు హాజరవటం ఈ నేలపట్టు పుణ్యస్థలిగా మారుతుంది.

వేడుకల్లో పాల్గొనడమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం. అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి, ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు, కర్తవ్యాలను అందరూ ఒక్కమాటగా పంచుకుంటుంటారు. అవన్నీ అమలు జరగాల్సిందే. ఈ పాతికేళ్లుగా అదే కట్టుబాటు, ప్రతిఒక్కరిలో అదే కసి, అందుకే నేలపట్టుకు గుర్తింపు, గౌరవం. దీనికి కర్త, కర్మ, క్రియ ఒక్కరే.. చంద్రశేఖరం.

ప్రతికదలికలోనూ ఓ రాజసం. ఎక్కడివో, ఏ ప్రాంతానివో, మరే దేశానివో సరిగ్గా ఈ సీజనులో వస్తాయి. ఐదారు నెలలు కాపురం చేస్తాయి. సంతతి వృద్ధి చేసుకొని వెళతాయి. మంచుకాలంలో ఉండలేవు. మంచు తగలక ముందే వెళ్లిపోతాయి. పెలికాన్‌ లు.. వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాలు చిరునవ్వుల సందడి చేస్తున్నాయి. దరహాసాల నాట్యమాడుతున్నాయి. ఈ నేల మీద ఎంత ప్రేమ..నమ్మకం..! ఠంచనుగా ప్రతి ఏడాది వేల కి.మీ. దాటుకొని సముద్రాలు దాటుకొని ఈ నేలతల్లి ఒడిలో సేద తీరుతాయి. ఎక్కడిదో ఈ విశ్వాసం.. ఏమిటో.. ఈ నేలతో ఆత్మీయ అనురాగ సంగమం! ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది! చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది. ఇక్కడ పునాదులతోనే గదా ఎదిగింది. ఈ నేలతల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు. నేలపట్టు పొడ ఎందుకు పడటం లేదు.

      పదవీ విరమణ జరిగి, ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకొన్న ఆశల సౌధం బీటలు వారినంత వ్యథ..
‘డాడీ.. మీరెన్నయినా చెప్పండి చెన్నై, లేదా హైద్రాబాదులలో సెటిల్‌ అవ్వండి. మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పడటం లేదు’ పెద్ద కొడుకు ప్రశాంత్‌. 
      ‘సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ. అంతా ట్రాష్, మేమేమో ముగ్గురం మూడు దేశాల్లో  స్థిరపడ్డాం. మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి’ చిన్న కొడుకు సుమంత్‌. 
      ‘అక్కడ పొలాలు, ఇళ్లు మీ పేరుతో ఊరి అభివృద్ధికి కేటాయించండి డాడీ. అంతేకానీ మీరిద్దరూ ఆ పల్లెలో ఉంటే మేమెలా ఇక్కడ స్థిరంగా ఉండగలం! మమ్మల్ని అర్థం చేసుకో డాడీ..’ తన ఆలోచనలను పుణికి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి.

‘మామయ్యా.. ఒక్క విషయం. ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దామని, ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దామని, డిగ్రీ పాసైనా అక్కడే ఉండి చదువుకుంటాను డిగ్రీలో కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదరుతుందా? అంతే మామయ్యా. ఊరి నుండి ఎదిగారు. ఎంతో చేశారు మీ వంతు.. ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం గదా మామయ్యా’ అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం.

      చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది. నిజమే .. గౌరవంగా తప్పుకోవాలి. శాశ్వతంగా తప్పుకోవాలి. 
ఎక్కడ నుండి.. ఊరునుండే తప్పుకోవాలి! ఎలా తప్పుకోవాలి.. ఊరు ఖాళీ చేసికాదు.. ‘బొందిలో జీవం వెళ్లిన తర్వాతనే’ అప్పటికే ఓ నిశ్చయ నిర్ణయానికి చేరువయ్యాడు.
      ‘పిల్లలు లేకుండా, మనవళ్లు, మనవరాళ్లను చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని చూడకుండా, ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేనుండలేను. మీరు కావాలంటే వెళ్లండి’ జీవిత భాగస్వామి శకుంతల తెగేసి చెప్పింది. పదవీ విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు ఇదే యుద్ధం.

ఇదే చర్చ, ఇవే సమస్యలు. శకుంతల వైభోగం.. చంద్రశేఖరం ఆశయం పోటీ పడ్డాయి. కదులుతున్న కాలమే మన గురువు.. ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపొమ్మని చెప్పదనే చంద్రశేఖరం విశ్వాసం. లగేజీ వాహనం పల్లెకు చేరుకుంది. వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేలపట్టుకు చేరి అప్పడే ఏడేళ్లు దాటింది. చందురూడూ ఒక్కడే. తారలేదని గుండెలు బోరుమన్నా, ఇప్పడు అంతా సర్దుకుపోయారు. చందురూడే.. నేలపట్టుకు వెలుగయ్యాడు. చెరువు ఒడ్డున పక్షులకోసం పొంగళ్లు పెడుతున్న గ్రామ మహిళలు, పిల్లలు, గ్రామానికి చేరుకొన్న కొత్త సందడి చప్పుళ్లతో చంద్రశేఖరం హృదయం కోటి వెలుగులతో కాంతిపుంజం అయింది.

అయినా ఒక్కడే.. ఆ భావన లేదు. ఊరంతా తనది. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి. అతని గురి లక్ష్యం వైపు ఉండాలి. శ్రద్ధ.. చేసే పనిపై ఉండాలి! 
 
ఫోన్‌ లో పలకరింపులు, కుశలాలు సాగుతూ, సాగుతూ పలచబడ్డాయి. అప్పుడప్పుడు చేసే రోహిణి కూడా పిల్లల వ్యాపకాలు, చదువు సంధ్యల ఒత్తిడి వలనేమో ఫోన్‌ లో కూడా పలకరించి చాలా కాలమయింది. పిల్లలు, కోడళ్ళు, కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారు యంత్రాలైపోయారు. కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధాలు అన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకరజ్యోతిగా నిలిచాడు. పిల్లా జెల్లా ఆ ఊరే కాదు, పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటూ లేదు. కాని కాలం కదా! అయినా ఇప్పటికీ లోటు లేదు.

ప్రతి ఒక్కరూ.. నమస్కారం బాబయ్యా.. పెద్దయ్యా దండాలు.. గుడ్‌మార్నింగ్‌ తాతయ్యా.. పెదనాన్నా ఊరెళుతున్నాం శెలవులకు వస్తాం! నాకు తాశిల్దారుగా ప్రమోషన్‌ వచ్చింది. వీసా కన్‌ ఫర్మ్‌ అయ్యింది తాతయ్యా!

ఆ ఊరి వాళ్ళకే కాదు, పక్క ఊరి వాళ్ళకూ ఆదర్శనీయుడే! ఎందుకంటే నేలపట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతమయ్యాయి. అందుకే అందరకీ పూజ్యనీయుడు! ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు, వలస పక్షులు రావటం ఆగలేదు. నాలుగైదు నెలలు కాపురం చేయటమూ ఆగలేదు. ఆ ఊర్లో ఏం జరిగినా.. ఎవరు వెళ్ళినా, వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే. చివరకు పక్షులు కూడా ఆ ఊరిలో బాగమే. పక్షులు తిరిగి వెళుతూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళుతుంటాయి. ఆ ఊరి ప్రజలూ అంతే. ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే. దండాలు పెట్టి వెళ్ళాల్సిందే. ఆ ఊరుకి ఏర్పడిన సంస్కారం అది. అదే ఆ ఊరి సంప్రదాయంగా మారిపోయింది.
      కాని ఒక్కటే లోటు. అవన్నీ కూడా గ్రామం నడిబొట్టున నిర్మించిన చంద్రశేఖరం విగ్రహానికి.  ఎందుకంటే కాలం గొప్పది కదా! – ఈత కోట సుబ్బారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement