కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'.. Lord Krishna In Kailasam Funday Inspirational And Devotional Story | Sakshi
Sakshi News home page

కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..

Published Sun, May 12 2024 12:40 PM | Last Updated on Sun, May 12 2024 12:40 PM

Lord Krishna In Kailasam Funday Inspirational And Devotional Story

శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.

శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.

పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.

ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.

పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.

శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.

కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.

కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.

‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.

నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.

కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.

కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.

కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement