మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే.. | If The Countrys Culture Is To Stand There Must Be Arts | Sakshi
Sakshi News home page

మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..

Published Mon, Aug 28 2023 6:09 AM | Last Updated on Mon, Aug 28 2023 7:40 AM

If The Countrys Culture Is To Stand There Must Be Arts - Sakshi

ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’  నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు.

శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్‌/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్‌/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు.

ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది.

దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా...  కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన.

భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. 

(చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement