వానా.. వానా.. వల్లప్పా! | Sakshi
Sakshi News home page

వానా.. వానా.. వల్లప్పా!

Published Sun, Jun 16 2024 7:35 AM

Consequences, Suggestions And Precautions During Rainy Season Sunday Cover Story

వేసవిలోని మండుటెండలు మనుషులను మలమలలాడించిన తర్వాత కురిసే వాన చినుకులు ఇచ్చే ఊరట చెప్పనలవి కాదు. ఈసారి వేసవిలో ఎండలు ఇదివరకు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మండిపడ్డాయి. ఉష్ణోగ్రతలు ఊహాతీతంగా పెరిగినా, మొత్తానికి ఈసారి రుతుపవనాలు సకాలంలోనే మన దేశంలోకి అడుగుపెట్టాయి. గత మే చివరివారంలో అండమాన్‌ను తాకిన రుతుపవనాలు అవరోధాలేవీ లేకుండా సజావుగా తెలుగు రాష్ట్రాల్లోకి చేరుకున్నాయి.

ఈసారి రెండు రోజుల ముందుగానే– జూన్‌ 2 నాటికే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకాయి. జూన్‌ 4 నాటికి తెలంగాణలో ప్రవేశించాయి. భారత్‌ వంటి వ్యవసాయాధారిత దేశాలకు వానల రాకడ ఒక వేడుక. సజావుగా వానలు కురిస్తేనే పంటలు సుభిక్షంగా పండుతాయి. వానాకాలం ప్రకృతిలో జీవం నింపుతుంది. నెర్రెలు వారిన నేలలో పచ్చదనాన్ని నింపుతుంది. జీవరాశి మనుగడకు ఊతమిస్తుంది. ఇప్పటికే వానాకాలం మొదలైన తరుణంలో కొన్ని వానాకాలం ముచ్చట్లు చెప్పుకుందాం.

ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటికీ వానాకాలం ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ కొద్దిరోజులు అటు ఇటుగా జూన్, జూలై నెలల్లో వానాకాలం మొదలవుతుంది. ఇక్కడ వానలు మొదలైన ఆరునెలలకు దక్షిణార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలకు వానాకాలం మొదలవుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఈ దేశాల్లో ఏటా వానాకాలం వస్తుంది. నైరుతి రుతుపవనాల రాకతో మన దేశంలో మాత్రమే కాకుండా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయాన్మార్‌ తదితర దేశాల్లో వర్షాకాలం వస్తుంది.

ఈ దేశాల్లో వర్షాకాలం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగుతుంది. దాదాపు ఇదేకాలంలో రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లోను; పశ్చిమ, ఆగ్నేయ, దక్షిణాఫ్రికా దేశాల్లోను; తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోను వానాకాలం మొదలవుతుంది. మన దేశంలో వానాకాలం సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగుతుంది. అయితే, కొన్నిచోట్ల వానాకాలం ఏప్రిల్‌ నుంచి మొదలై నవంబర్‌ వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది.

గొడుగులకు పని మొదలు..
వానాకాలం వచ్చిందంటే గొడుగులకు పని మొదలవుతుంది. గొడుగులతో పాటు రెయిన్‌ కోట్లు, గమ్‌ బూట్లు వంటివి అవసరమవుతాయి. వానాకాలంలో వానలు కురవడం సహజమే గాని, ఏ రోజు ఎప్పుడు ఏ స్థాయిలో వాన కురుస్తుందో చెప్పలేం. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు గొడుగులను, రెయిన్‌ కోట్లను వెంట తీసుకుపోవడం మంచిది. కార్లలో షికార్లు చేసేవారికి వీటితో పెద్దగా పని ఉండకపోవచ్చు గాని, పాదచారులకు గొడుగులు, ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేవారికి రెయిన్‌కోట్లు వానాకాలంలో కనీస అవసరాలు.

గొడుగులు, రెయిన్‌ కోట్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి. వింత వింత గొడుగులు, రెయిన్‌ కోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న చిన్న చిరుజల్లుల నుంచి గొడుగులు కాపాడగలవు గాని, భారీ వర్షాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం రెయిన్‌ కోట్లు వేసుకోక తప్పదు. ఈసారి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయి కంటే కాసింత ఎక్కువగానే నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనాను ప్రకటించడంతో గొడుగులు, రెయిన్‌కోట్లు వంటి వానాకాలం వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు తమ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా గొడుగులు, రెయిన్‌ కోట్లు తదితర వానాకాలం వస్తువుల మార్కెట్‌ 2022 నాటికి 3.80 బిలియన్‌ డాలర్ల (రూ.31,731 కోట్లు) మేరకు ఉంది. ఈ మార్కెట్‌లో సగటున 5.4 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. ఆ లెక్కన 2032 నాటికి వానాకాలం వస్తువుల మార్కెట్‌ 6.40 బిలియన్‌ డాలర్లకు (రూ.53,442 కోట్లు) చేరుకోగలదని అంతర్జాతీయ మార్కెట్‌ విశ్లేషణ సంస్థ ‘బ్రెయినీ ఇన్‌సైట్స్‌’ అంచనా.

వానలతో లాభాలు..
వానాకాలం తగిన వానలు కురిస్తేనే వ్యవసాయం బాగుంటుంది. పంటల దిగుబడులు బాగుంటాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయంపైనే ఆధారపడి మనుగడ సాగించే రైతులు, వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఉంటుంది. వర్షాలు పుష్కలంగా కురిస్తేనే జలాశయాలు నీటితో నిండుగా ఉంటాయి. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. ప్రజలకు నీటిఎద్దడి బాధ తప్పుతుంది. వానాకాలంలో తగినంత కురిసే వానలు ఆర్థిక రంగానికి ఊతమిస్తాయి.

మన దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపైన, వ్యవసాయాధారిత రంగాలపైన ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలో వ్యవసాయానిది కీలక పాత్ర. భారతీయ స్టేట్‌బ్యాంకు పరిశోధన నివేదిక ప్రకారం మన జీడీపీలో 2018–19 నాటికి 14.2 శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2022–23 నాటికి 18.8 శాతానికి పెరిగింది. ఈసారి వానాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాను ప్రకటించిన నేపథ్యంలో మన జీడీపీలో వ్యవసాయం వాటా మరో 3 శాతం వరకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటలకు, పత్తి వంటి వాణిజ్య పంటలకు పుష్కలమైన వానలే కీలకం. వానాకాలంలో మంచి వానలు కురిస్తే విద్యుత్తు కోతల బెడద కూడా తగ్గుతుంది. మన దేశం ఎక్కువగా జలవిద్యుత్తుపైనే ఆధారపడుతోంది. బొగ్గుతో పనిచేసే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు లేని ప్రాంతాల్లో జలవిద్యుత్తు ద్వారానే విద్యుత్‌ సరఫరా ఉంటోంది. తగిన వానలు కురవని ఏడాదుల్లో ఈ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందులు తప్పవు.

వాతావరణ మార్పులూ, వర్షాలూ..
ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, ముఖ్యంగా భూతాపోన్నతి వర్షాకాలంపై కూడా ప్రభావం చూపుతోంది. దీనివల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవిలో వడగాల్పులు, అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, కరవు కాటకాల వంటివన్నీ వాతావరణంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల మార్పుల ఫలితమేనని ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌’ (ఐపీసీసీ) నిపుణులు చెబుతున్నారు.

వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం ఇప్పటికే మన దేశం అంతటా కనిపిస్తోంది. ఈ ప్రభావం కారణంగానే ఇటీవలి వేసవిలో పలుచోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తడం, పంటనష్టాలు, కరవు కాటకాలు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు వంటి విపత్తులు తరచుగా తలెత్తుతున్నాయి. సకాలంలో తగిన వానలు కురిస్తేనే పలు దేశాల్లోని పరిస్థితులు చక్కబడతాయి.

వాతావరణ పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం, పునర్వినియోగ ఇంధనాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం, అడవుల నరికివేతను అరికట్టడంతో పాటు విరివిగా మొక్కలు నాటడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంది.

వానాకాలం కాలక్షేపాలు..
వాతావరణం పొడిగా ఉన్నప్పుడు బయట తిరిగినంత సులువుగా వాన కురుస్తున్నప్పుడు తిరగలేం. తప్పనిసరి పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే తప్ప వానల్లో ఎవరూ బయటకు రారు. చిరుజల్లులు కురిసేటప్పుడు సరదాగా తడవడానికి కొందరు ఇష్టపడతారు గాని, రోజంతా తెరిపిలేని వాన కురుస్తుంటే మాత్రం ఇల్లు విడిచి బయటకు అడుగుపెట్టడానికి వెనుకాడుతారు.

వాన కురుస్తున్నప్పుడు ఇంటి అరుగు మీద కూర్చుని, వీథిలో ప్రవహించే వాన నీటిలో కాగితపు పడవలను విడిచిపెట్టడం చిన్న పిల్లలకు సరదా కాలక్షేపం.. కొందరు ఉత్సాహవంతులు వానాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెకింగ్, పచ్చని అడవులు, చక్కని సముద్ర తీరాల్లో నేచర్‌ వాకింగ్‌ వంటివి చేస్తుంటారు. ఇంకొందరు వాన కురుస్తున్నప్పుడు నదుల్లో సరదాగా బోటు షికార్లకు వెళుతుంటారు. వాన కురుస్తున్నప్పుడు చెరువులు, కాలువల ఒడ్డున చేరి చేపలను వేటాడటం కొందరికి సరదా.

అందమైన వాన దృశ్యాలను, వానాకాలంలో ఆకాశంలో కనిపించే హరివిల్లు అందాలను కెమెరాలో బంధించడం కొందరికి ఇష్టమైన కాలక్షేపం. వానాకాలంలో జలపాతాలు ఉద్ధృతంగా ఉరకలేస్తుంటాయి. వాన కురిసేటప్పుడు జలపాతాలను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. వాన కురుస్తున్న సమయంలో ఎక్కువ మంది వేడివేడి పకోడీలు, కాల్చిన మొక్కజొన్న కండెలు వంటి చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు. తెరిపి లేని వానలు కురిసేటప్పుడు రోజుల తరబడి కదలకుండా ఇంట్లోనే కూర్చుని గడిపే కంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని, ఇలాంటి సరదా కాలక్షేపాలతో వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.

రెయిన్‌కోట్‌ ఫ్యాషన్లు..
ఆధునిక రెయిన్‌కోట్లు పంతొమ్మిదో శతాబ్దంలో అందుబాటులోకి వచ్చాయి. స్కాటిష్‌ రసాయనిక శాస్త్రవేత్త చాల్స్‌ మాకింటోష్‌ తొలిసారిగా 1824లో పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్‌ రెయిన్‌కోటును రూపొందించాడు. రెండు పొరల వస్త్రాల మధ్య నాఫ్తాతో శుద్ధిచేసిన రబ్బరును కూర్చి తొలి రెయిన్‌కోటును తయారు చేశాడు. తర్వాత నీటిని పీల్చుకోని విధంగా ఉన్నిని రసాయనాలతో శుద్ధిచేసి రూపొందించిన వస్త్రంతో రెయిన్‌కోట్లు తయారు చేయడం 1853 నుంచి మొదలైంది.

ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో సెలోఫెన్, పీవీసీ వంటి ప్లాస్టిక్‌ పదార్థాలతో రెయిన్‌కోట్ల తయారీ ప్రారంభమైంది. వానలో శరీరం తడవకుండా కాపాడటానికే రెయిన్‌కోట్లను రూపొందించినా అనతికాలంలోనే వీటిలోనూ ఫ్యాషన్లు మొదలయ్యాయి. అమెరికా, చైనా తదితర దేశాల్లో రెయిన్‌కోట్లు ఫ్యాషన్‌ మార్కెట్‌లో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం రెయిన్‌కోట్లలో ఫ్యాషన్‌ ధోరణి కొంత తక్కువే! వానలో తల, ఒళ్లు తడవకుండా ఉంటే చాలు అనే ధోరణిలోనే మన ప్రజలు రెయిన్‌కోట్లను కొనుగోలు చేస్తారు.

మన దేశంలో తరచుగా వానలు కురిసేది కూడా మూడు నాలుగు నెలలు మాత్రమే! అందుకే మన ఫ్యాషన్‌ డిజైనర్లు కూడా రెయిన్‌కోట్ల డిజైనింగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫ్యాషన్‌ రెయిన్‌కోట్లు దొరుకుతాయి.

వానాకాలం కష్టాలు..
వానాకాలంలో వీథులన్నీ బురదమయంగా మారుతాయి. రోడ్లు సరిగా లేని చోట్ల గోతుల్లో నీరు నిలిచిపోయి ఉంటుంది. మ్యాన్‌హోల్‌ మూతలు ఊడిపోయి, డ్రైనేజీ నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద నడవడం, వాహనాలు నడపడం కష్టంగా మారుతుంది. మురుగునీటి ప్రవాహాలకు పక్కనే పానీపూరీలు, పకోడీలు, మొక్కజొన్న కండెలు అమ్మే బడ్డీలు ఉంటాయి. పగలు ఈగల బెడద, రాత్రి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రోగాల బెడద పెరుగుతుంది.

వానాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు సర్వసాధారణం. ఇవి కాకుండా ఎక్కువగా కలరా, డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా సహా పలు రకాల వైరల్‌ జ్వరాలు, కళ్ల ఇన్ఫెక్షన్లు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. వానాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.

  • వేడి వేడి చిరుతిళ్ల మీద ఎంత మోజు ఉన్నా, వానాకాలంలో ఆరుబయట తినకపోవడమే మంచిది. రోడ్డు పక్కన మురికినీటి ప్రవాహాలకు దగ్గరగా బళ్లల్లో అమ్మే బజ్జీలు, పకోడీలు, పానీపూరీలు, చాట్‌లు వంటి చిరుతిళ్లు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే!

  • వానాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. చిట్లిన మంచినీటి పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరి, ఇళ్లల్లోని కొళాయిల ద్వారా కలుషితమైన నీరు వస్తుంది. నీటిని వడగట్టి, కాచి చల్లార్చి తాగడం మంచిది. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కాలంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

  • వానాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో దుమ్ము, ధూళి, బూజులు పేరుకోకుండా చూసుకోవాలి. వానజల్లు ఇంట్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు అపరిశుభ్రంగా, తడి తడిగా ఉన్నట్లయితే ఈగలు, దోమలు సహా క్రిమికీటకాల బెడద పెరిగి, ఇంటిల్లిపాది రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వానాకాలాన్ని ఆస్వాదించవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement