Health: సిజేరియన్‌ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా? | Are There Any Risks Of Caesarean Section Dr Bhavan Kasu Suggestions | Sakshi
Sakshi News home page

Health: సిజేరియన్‌ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?

Published Sun, Apr 28 2024 3:07 PM | Last Updated on Sun, Apr 28 2024 3:07 PM

Are There Any Risks Of Caesarean Section Dr Bhavan Kasu Suggestions

నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్‌ టైమ్‌ డెలివరీ  చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్‌ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్‌ను సేఫ్‌గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్‌ టైమ్‌ నార్మల్‌ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్‌కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్‌ క్లియర్‌ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండ

ఏ మెడికల్‌ రీజన్‌ లేకుండా సిజేరియన్‌కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్‌ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్‌ డెలివరీ కష్టమైందని సిజేరియన్‌కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్‌ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్‌తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్‌ అయ్యే ప్రాబ్లమ్‌ లేదా పెల్విక్‌ ఫ్లోర్‌ ప్రాబ్లమ్‌ కాకపోతే  నార్మల్‌ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.

రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్‌ లేదా సిజేరియన్‌) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్‌ నార్మల్‌ డెలివరీ కన్నా సిజేరియన్‌ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్‌ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్‌ అడ్వయిజెస్‌ ఉన్నాయి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్‌ రిస్క్‌ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్‌ టర్మ్‌ / లాంగ్‌ టర్మ్‌ రిస్క్స్‌ ఉంటాయి. వెజైనల్‌ బర్త్‌లో కొంత ఆందోళన, అన్‌ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్‌ రిలీఫ్‌ ఇష్యూస్‌ ఉంటాయి. ఈ రిస్క్‌ని ఆపరేషన్‌తో నివారించినా సిజేరియన్‌తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్‌ రిస్క్‌ ఉంటుంది.

ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్‌ అయిన వాళ్లల్లో  కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్‌ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్‌  కూడా సిజేరియన్‌ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్‌ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్‌ ప్రాబ్లమ్‌ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్‌ఐసీయూ కేర్‌లో అడ్మిట్‌ చేయాల్సి రావచ్చు. సిజేరియన్‌ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్‌ / బ్లాడర్‌ ఇంజ్యూరీ, యురేటర్‌ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.

తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్‌ స్కార్‌కి అతుక్కుని బ్లీడింగ్‌ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్‌ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్‌ ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంటల్‌ డెలివరీ చాన్సెస్‌ ఉండొచ్చు. వెజైనల్‌ టేర్స్‌ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్‌ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్‌ రిస్క్స్‌ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్‌ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్‌ రిలీఫ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్‌ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.
​​​​​​​
— డా. భావన కాసు, ఆబ్‌స్టేట్రీషియన్‌, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement