మిమిక్రీ చేసే పక్షులు! All About Bird Mimics and Mimicry wites Janaki Lenin | Sakshi
Sakshi News home page

మిమిక్రీ చేసే పక్షులు!

Published Tue, May 21 2024 5:01 PM | Last Updated on Tue, May 21 2024 5:19 PM

All About Bird Mimics and Mimicry wites  Janaki Lenin

అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము.  ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను  నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి  అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ)  చేయవలసిన అవసరం ఏముంది?

ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు.  ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.

ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక  పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.

కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.

చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు.  ఐన్‌స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. 

అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి  ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. 

ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన  "లైర్ బర్డ్"  చాలా ప్రముఖమైన పక్షి .  యూట్యూబ్లో ఒక వీడియోలో  ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ  విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు.  

ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు,  ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే  ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.

ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.

ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. 

రచయిత - జానకి లెనిన్‌ 
ఫోటో క్రెడిట్: సుభద్రాదేవి

తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters

పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement