తీరిన కోరిక: పాకిస్తాన్‌ వెళ్లాలి మా ఇల్లు చూడాలి | 90 years old woman crosses Wagah border to visit home in Pakistan after 75 years | Sakshi
Sakshi News home page

తీరిన కోరిక: పాకిస్తాన్‌ వెళ్లాలి మా ఇల్లు చూడాలి

Published Tue, Jul 19 2022 12:21 AM | Last Updated on Sat, Jul 23 2022 3:30 PM

90 years old woman crosses Wagah border to visit home in Pakistan after 75 years - Sakshi

15 ఏళ్ల వయసులో దేశ విభజన సమయంలో రావిల్పిండిని వదిలి వచ్చేసింది రీనా వర్మ కుటుంబం.
అప్పటి నుంచి పాకిస్తాన్‌ వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె కోరిక.
ఎన్ని దశాబ్దాలు ప్రయత్నించినా వీసా ఇవ్వలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఆమెకు.
వీసా వచ్చింది. 75 ఏళ్ల తర్వాత వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టింది.
ఆమె ఉద్వేగాలు ఎలా ఉంటాయో. ఎవరికైనా ఇది ఎంత గొప్ప అనుభవమో.

గత సంవత్సరమే హిందీలో ఒక సినిమా వచ్చింది. నీనా గుప్తా లీడ్‌ రోల్‌. సినిమా పేరు ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’. ఇందులో అమృత్‌సర్‌లోని 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు లాహోర్‌లో ఉన్న తన ఇంటిని చూడాలనుకుంటుంది. దేశ విభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోగా నెలల బిడ్డను తీసుకొని సైకిల్‌ తొక్కుకుంటూ లాహోర్‌ విడిచిపెట్టి భారత్‌కు చేరుకుంటుందామె. మళ్లీ పాకిస్తాన్‌ వెళ్లడం కుదరదు. తన ఇంటితో ముడిపడ్డ జ్ఞాపకాలను తలచుకోని రోజు ఉండదు.

పోయే ముందు ఆ ఇంటిని చూసి పోవాలని ఆమె కోరిక. కాని ప్రయాణం చేసే శక్తి ఉండదు. ఆమె బాధను మనవడు అర్థం చేసుకుంటాడు. ఆమె పాకిస్తాన్‌ వెళ్లకపోతే ఏమి ఆమె ఉన్న ఇంటినే ఇక్కడకు తెస్తాను అని పాకిస్తాన్‌ వెళ్లి ఆ ఇంటికి చక్రాలు కట్టి (బిల్డింగ్‌ మూవర్స్‌ సహాయంతో) తెచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇది కొంచెం కష్టసాధ్యమైనా సినిమాలో ఎమోషన్‌ పండింది.

అయితే రీనా వర్మ విషయంలో ఇంత ప్రయాస లేదు. అదృష్టవశాత్తు ఆమెకు పాకిస్తాన్‌ హైకమిషన్‌ వీసా ఇచ్చింది. కాకపోతే 1965 నుంచి ట్రై చేస్తుంటే 2022కు. మొన్న శనివారం (జూలై 16) వాఘా సరిహద్దు దాటి ఆమె పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ను వదిలాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటిని చూసుకోవడానికి అక్కడకు వెళ్లింది రీనా వర్మ.

రావల్పిండిలో బాల్యం
పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పుట్టి పెరిగింది. అక్కడి ‘ప్రేమ్‌నివాస్‌’ అనే ఏరియాలో ఆమె బాల్యం గడిచింది. ‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవాడు. నాకు నలుగురు తోబుట్టువులు. నేను అక్కడి మోడర్న్‌ స్కూల్‌లో చదువుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లోనే చాలా ప్రోగ్రెసివ్‌.

ఆడపిల్లలను చదివించాలనుకున్నాడు. మా పెద్దక్క 1930లలోనే కాలేజీలో చదివింది. రావల్పిండి శివార్లలో  మూరీ అనే హిల్‌ స్టేషన్‌ ఉంది. కొన్నాళ్లు అక్కడ మా నాన్న పని చేశాడు. అక్కడంతా బ్రిటిష్‌ వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లతో మేము కలిసి మెలిసి ఉన్నాం’ అని చెప్పింది రీనా వర్మ. ఆమె అసలు పేరు రీనా చిబ్బర్‌. పెళ్లయ్యాక రీనా వర్మ అయ్యింది.

దేశ విభజన
1932లో పుట్టిన రీనా వర్మకు దేశ విభజన నాటికి 15 ఏళ్లు. ‘దేశ విభజన వరకూ మాకు మత కలహాలు అంటే తెలియదు. మా ఇంటికి ముస్లింలు, శిక్కులు వచ్చి పోతుండేవారు. అందరూ స్నేహంగా ఉండేవాళ్లు. కాని దేశ విభజన సమయానికి అల్లర్లు పెరిగిపోయాయి. మా అమ్మ అసలు దేశం విడిపోతుందంటే నమ్మలేదు. కాని మేము ఢిల్లీ వచ్చేశాం’ అంది రీనా వర్మ. ‘ఢిల్లీ వచ్చాక ఆమె తొలి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనడం నాకొక గొప్ప అనుభూతి. అప్పుడు నెహ్రూగారిని చూశాను.

మళ్లీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన రిపబ్లిక్‌ డేలో లతా మంగేష్కర్‌ ‘ఏ మేరే వతన్‌ కే లోగో’ పాడుతున్నప్పుడు నేను నెహ్రూ గారి వెనుకనే కూచుని ఉన్నాను. ఆయన కన్నీరు కార్చడం నేను చూశాను’ అంటుంది రీనా. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు వచ్చి కావేరీ ఎంపోరియమ్‌లో పని చేయడం మొదలెట్టింది. భర్త హెచ్‌.ఏ.ఎల్‌ (హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌)లో చేసేవాడు. కాని ఎక్కడ ఉన్నా ఆమెకు ఒక్కసారి తిరిగి రావల్పిండి చూసి రావాలనే కోరిక వేధించేది.

1965 నుంచి ప్రయత్నిస్తే...
1965లో పాకిస్తాన్‌ వీసా కోసం ప్రయత్నిస్తే రాలేదు. కాని మధ్యలో క్రికెట్‌ మేచ్‌ల కోసం వీసాలు ఇస్తున్నారంటే 1990లో లాహోర్‌కు వెళ్లింది కాని రావల్పిండికి వెళ్లలేకపోయింది. 2021లో ఆమె తన ఫేస్‌బుక్‌లో రావల్పిండి గురించి రాస్తే పాకిస్తాన్‌కు చెందిన సజ్జద్‌ హైదర్‌ అనే వ్యక్తి రావల్పిండిలోని ఆమె ఇంటి ఫొటో తీసి పంపాడు. అది చూసినప్పటి నుంచి ఆమెకు ఇంకా ఆ ఇల్లు చూడాలనే కోరిక పుట్టింది.

మళ్లీ వీసా కోసం అప్లై చేస్తే రాలేదు. ఇంకోసారి వీసాకు అప్లై చేసి ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీకి ట్యాగ్‌ చేయడంతో 90 ఏళ్ల రీనా వర్మ కోరికను మన్నించాల్సిందిగా ఆమె ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్‌ హై కమిషన్‌ ఆమెకు వెంటనే మూడు నెలల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు గుండా ఆమె రోడ్డు మార్గంలో పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది.

మాలాంటి వాళ్ల కోసం
నిజానికి భారత్, పాకిస్తాన్‌ల మధ్య 60 ఏళ్లు దాటిన వారి కోసం సరిహద్దుల్లో తక్షణ వీసాలు ఇచ్చే ఒప్పందం ఉంది. కాని దానిని పాటించడం లేదు. ‘విడిపోకుండా ఉంటే బాగుండేది. సరే విడిపోయాం. కాని మాలాంటి వాళ్ల కోసం ఇరుదేశాలు వీసాలు ఇస్తే కొన్ని పాత జ్ఞాపకాలను సజీవం చేసుకుంటాం’ అంటుంది రీనా వర్మ. ఈ కథనం అంతా వాఘా దాటిన వెంటనే రాస్తున్నది. ఆమె అక్కడ ఏం చూసిందో ఏం చేసిందో మరో కథనంలో చెప్పుకుందాం. ఒక మంచి తలంపును గట్టిగా తలిస్తే నెరవేరుతుంది అనడానికి రీనా వర్మ ఒక ఉదాహరణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement