మరో ‘మహా’ నాటకం! Sakshi Editorial On Nationalist Congress Party | Sakshi
Sakshi News home page

మరో ‘మహా’ నాటకం!

Published Tue, Jul 4 2023 12:20 AM | Last Updated on Tue, Jul 4 2023 12:20 AM

Sakshi Editorial On Nationalist Congress Party

కొన్ని సన్నివేశాలు, సంఘటనలు మునుపెన్నడో చూసినట్టు, చిరపరిచితమైనట్టు అనిపిస్తుంటాయి. మహారాష్ట్రలో ఆదివారం నుంచి జరుగుతున్న పరిణామాలు, జాతీయవాద కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం, అజిత్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ వర్గం మహారాష్ట్ర బీజేపీ సర్కార్‌లో చేరడం చూస్తే... సరిగ్గా ఏడాది క్రితం సంఘటనలే పునరావృతమవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో శివసేనను చీల్చిన ఏక్‌నాథ్‌ శిందే వ్యవహారం గుర్తొస్తుంది. ఇప్పుడు మనుషులు, పార్టీల పేర్లు మారాయి కానీ కథ మాత్రం మళ్ళీ అదే.

అప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్య శివసేన, ఇప్పుడు శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ. అక్కడ శిందే, ఇక్కడ అజిత్‌. కాకపోతే ఈసారి తెలివిగా ‘చీలిక’ అనకుండా, ఎన్సీపీగా తాము ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, మంత్రివర్గంలో చేరుతున్నామంటూ సాంకే తిక చిక్కులు లేకుండా చూసుకుంటున్నారు అజిత్‌. అంతే తేడా. మొత్తానికి గతంలో కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో లాగా మహారాష్ట్రలోనూ ప్రత్యర్థి పార్టీల్ని చీలికలు పేలికలు చేయడంలో బీజేపీ మరోసారి సఫలమైంది. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతా యత్నానికి గట్టి దెబ్బ కొట్టింది.  

శరద్‌ – ఆయన కుమార్తె సుప్రియ ఒకవైపు, అజిత్‌ వర్గం మరోవైపు నిలవడంతో ఎన్సీపీపై పట్టు కోసం పోరు మరిన్ని మలుపులు తీసుకోనుంది. గత 24 ఏళ్ళలో విడతలు విడతలుగా 17 ఏళ్ళు ఎన్సీపీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. మధ్యలో కొన్నేళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఏడాదిగా గద్దెపై లేదు. ఏళ్ళ తరబడి పవార్‌ కుటుంబాన్ని కలిపి ఉంచిన అధికార బంధం బలహీనమైంది. అధికారం రుచి మరిగిన అజిత్‌ దేనికైనా సిద్ధమయ్యారు. అన్న కొడుకులోని అధికార కాంక్షను గుర్తించిన శరద్‌ కొత్త వ్యూహాలతో చెక్‌ పెడుతూ వచ్చారు.

నెల క్రితం కూడా పార్టీ పగ్గాలు వదిలేస్తున్నట్టు ప్రకటించి, తీరా కార్యకర్తల ఆకాంక్ష అంటూ మళ్ళీ మూడు రోజులకే వెనక్కి తగ్గి, కుమార్తెకు పెత్తనం కట్టబెట్టారు. అజిత్‌ను రాష్ట్రానికే పరిమితం చేస్తూ చాణక్య నీతి ప్రదర్శించారు. అజిత్‌కు అది మింగుడు పడలేదు. అదను చూసి, అనుచరులతో కలసి సొంత బాబాయ్‌ని వదిలేసి, కేంద్రంలో మోదీకి జై కొట్టారు.

ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ తమ వైపే ఉన్నారని అజిత్‌ అంటున్నా, అందుకు లిఖితపూర్వక సాక్ష్యమేమీ ఇప్పటికైతే లేదు. ‘మహారాష్ట్ర పురోభివృద్ధి కోసం, మోదీ సారథ్యంలో దేశ పురోగతి కోసం’ ...ఇలా శరద్‌ను వదిలిపెట్టి, పార్టీని చీల్చలేదంటూనే చీల్చిన అజిత్‌ తదితరులు బోలెడు మాటలు చెబుతున్నారు. కానీ, నాలుగేళ్ళలో ముగ్గురు వేర్వేరు సీఎంల హయాంలో మూడోసారి డిప్యూటీ సీఎం అయిన అజిత్‌ ఆకాంక్షలు బహిరంగ రహస్యం.

పైగా, స్వయంగా అనేక భారీ కుంభ కోణాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అజిత్, ఆయన వర్గపు ఎమ్మెల్యేలు బీజేపీలో ఎందుకు చేరారో ఊహించడం కష్టమేమీ కాదు. వారంతా ఇక బీజేపీ వాషింగ్‌ మెషిన్‌తో స్వచ్ఛమైపోయినట్టే!  

రాజకీయ గూగ్లీలతో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించే శరద్‌ ఈసారి తానే క్లీన్‌ బౌల్డయ్యారు. ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు విశ్వాసపాత్రులన్న నమ్మకం నట్టేట ముంచింది. 2019లోనే బీజేపీ వైపు వెళ్ళేందుకు అజిత్‌ విఫలయత్నం చేసినప్పుడే ముకుతాడు వేయాల్సిన శరద్‌ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఏకు మేకైంది. తాజా చీలిక కాని చీలికతో ఎవరిది అసలైన పార్టీ, ఎవరిది ఎన్నికల గుర్తన్నది సైతం వివాదాస్పదమే.

మనుగడ కోసం 83వ ఏట ఈ మరాఠా యోధుడు ప్రజాక్షేత్రంలో మళ్ళీ పోరుకు దిగాలి. పదవుల్లోని ప్రత్యర్థులపై ఇరువర్గాల పోటాపోటీ వేటు పర్వం సాగుతోంది. ఎన్సీపీ వర్కింగ్‌ ఛీఫ్‌ ప్రఫుల్‌ పటేల్‌ను పదవి నుంచి, అజిత్‌ వర్గ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు శరద్‌ ప్రకటించారు. వచ్చే 3 నెలల్లో మహారాష్ట్రలో పెనుమార్పులు తప్పవంటున్నారు. 

ఆ మాటేమో కానీ అజిత్‌ వర్గాన్ని చేర్చుకోవడం వెనుక బీజేపీకి దాని లెక్కలు దానికున్నాయి. గత నెల సుప్రీం కోర్ట్‌ ఇచ్చిన ఆదేశాలతో ఏక్‌నాథ్‌ శిందే సారథ్య శివసేన చీలిక ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోక తప్పకపోవచ్చు. రేపు సాక్షాత్తూ సీఎం శిందే సహా పలువురు చీలిక వర్గపు శివసేన సభ్యులు అనర్హత పాలైనా, కొత్తగా చేరిన అజిత్‌ వర్గంతో మహారాష్ట్రలో బీజేపీ సర్కార్‌ మనుగడకు ఢోకా ఉండదు. కానీ, బహిష్కరణల వేటుతో అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలూ అనర్హత వేటు ఎదుర్కొనే ముప్పు లేకపోలేదు.

పాలకపక్ష స్పీకర్‌ నాన్చకుండా, అంత నిర్ణయం తీసుకుంటారా అన్నది వేరే కథ. వెరసి, సంకీర్ణ రాజకీయాల రచ్చలో పూర్తిగా దెబ్బతిన్నది మహారాష్ట్రలో ప్రజాతీర్పు. అయితే, పార్టీ సంస్థాగత ప్రక్షాళన చేపట్టి, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దిగుతున్న కమలనాథుల గురి మొత్తం రాబోయే ఎన్నికలే. ఠాణేలో శిందే, మరాఠ్వాడాలో అజిత్‌లకు గట్టి పట్టుంది. బీజేపీకి పట్టు లేని ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ నేతలిద్దరూ ‘మిషన్‌ 2024’లో అక్కరకు వస్తారనేది లెక్క. అలాగే, శిందే రెక్కలు కత్తిరించడానికీ పక్కనే అజిత్‌ను కూర్చోబెట్టడం కమలనాథులకి పనికొస్తుంది.  

2019 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసి, తీరా గెలిచాక పక్కకు వెళ్ళి అధికారాన్ని దూరం చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన పైనా, అలాగే కీలకమైన ప్రతిసారీ ఖంగు తినిపించిన శరద్‌పవర్‌ ఎన్సీపీ పైనా బీజేపీ చివరకిలా ప్రతీకారం తీర్చుకుంది. ఎన్నికల కల్లా శిరోమణి అకాలీదళ్‌ లాంటి ఒకప్పటి మిత్ర పక్షాల్ని ఎన్డీఏలోకి తెచ్చుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇది సంతోష సందర్భం.

ఆపసోపాలు పడుతున్న ప్రతిపక్ష ఐక్యతాయత్నానికి మహా కష్టం. ఎన్సీపీలో చీలిక సఫలమైతే బీజేపీకి లాభం. సఫలం కాకున్నా అజిత్‌కే తప్ప, దానికొచ్చిన నష్టమేమీ లేదు. ఇక బిహార్‌లోనూ ఇలాంటి ‘ఆపరేషన్‌’ సిద్ధమవుతోందని వార్త. ఏమైనా, అధికారం కోసం దేనికైనా సిద్ధమై, ప్రజాస్వామ్యాన్ని వట్టి నంబర్ల గేమ్‌గా మార్చేస్తున్న మన పార్టీల, నేతల నిస్సిగ్గు నగ్నత్వానికి ‘మహా’ నాటకం మరో ప్రతీక. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement