ధవళేశ్వరం వద్ద తగ్గిన వరద.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు | Godavari Flow Gradually Decreasing at Dhavaleshwaram Barrage | Sakshi
Sakshi News home page

గోదావరి తగ్గుముఖం.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు

Published Thu, Jul 21 2022 7:57 AM | Last Updated on Thu, Jul 21 2022 8:44 AM

Godavari Flow Gradually Decreasing at Dhavaleshwaram Barrage - Sakshi

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 14,97,070 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 15.1 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. డెల్టాకు 5,400 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 14,91,670 క్యూసెక్కులను బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. 
ఎగువన కాస్త పెరుగుదల 

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎగువన గోదావరిలో వరద ఉధృతి కాస్త పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీలోకి 8,62,610 క్యూసెక్కులు చేరుతోంది. సీతమ్మసాగర్‌లోకి వస్తున్న 12,27,650 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 12,42,264 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 48.4 అడుగులకు చేరుకుంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 13,86,917 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 35.25 మీటర్లకు చేరింది.   వస్తున్న ప్రవాహాన్ని వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తూ.. అధికారులు సమర్థంగా వరదను నియంత్రిస్తున్నారు.

ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement