ఆనందయోగం - | Sakshi
Sakshi News home page

ఆనందయోగం

Published Thu, Jun 20 2024 11:12 PM | Last Updated on Thu, Jun 20 2024 11:12 PM

ఆనందయ

మానసిక, శారీరక ఆరోగ్యాన్ని

అందిస్తున్న యోగా

ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆదరణ

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/తాళ్లపూడి/కాకినాడ క్రైం: దేహాన్ని, మనసును ఐక్యం చేసే అద్భుత యోగం యోగా. యోగా అంటే అదేదో మునులు ముక్కు మూసుకుని చేసే తపస్సు కాదు. శరీరాన్ని మెలికలు తిప్పి చేసే అద్భుత విన్యాసం. మనసును, శరీరాన్ని సమన్వయంతో సమస్థితిలో ఉంచే మహత్తర ప్రక్రియ. కులమతాలకు అతీతంగా పూర్వీకులు మనకు ప్రసాదించిన ఆరోగ్య రహస్యం. ప్రపంచానికి భారత దేశం అందించిన మహా మంత్రం ఈ యోగ తంత్రం. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకునే వారే కాదు.. నిత్య జీవన యుద్ధంలో తలమునకలయ్యే వారు సైతం యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుంటే.. ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటున్నారు యోగా గురువులు. నిరంతరం యోగా చేసే వారి జీవిత కాలం అక్షరాలా వందేళ్ల పైనే అని అంటున్నారు. యోగా, ధ్యానం చేస్తున్న 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులు పలువురు నేటికీ ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో యోగా కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు వెలిశాయి. జిల్లావ్యాప్తంగా పలు సంస్థలతో పాటు రాజమహేంద్రవరంలో శ్రీ రామకృష్ణ మఠం, శారదా మఠం, బ్రహ్మకుమారీస్‌ వంటి వాటిలో ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు

● యోగా వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలై, అన్ని రకాల రుగ్మతలూ దూరమవుతాయి. శరీరం తేలికవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. మానసిక ప్రశాంతత కలిగి, భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.

● శరీరంలో కొవ్వు నిల్వలు కరిగి, ఊబకాయం, బరువు తగ్గుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. సైనస్‌, ఎలర్జీ సమస్యలు దూరమవుతాయి. వృద్ధాప్య ఛాయలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు.

● మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటివి నియంత్రణలోకి వస్తాయి.

● యోగాలో భాగంగా వేసే సూర్య నమస్కారాల్లోని వివిధ భంగిమల ద్వారా అత్యంత శక్తిమంతమైన సూర్యరశ్మి శరీరంలోని అన్ని భాగాలకూ ప్రసరిస్తుంది. దీనివలన మెదడు, గుండె, వెన్నెముక, కీళ్లు, ఎముకలు, కండరాలు.. ఇలా శరీరంలోని అన్ని అవయవాలకూ నూతన శక్తి చేకూరుతుంది.

శాసీ్త్రయ నిరూపణ

● లండన్‌ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు యోగ సాధకుల అనుభవం, పలు పరిశోధనల ఆధారంగా యోగా వల్ల మెదడు, శరీరంలో వచ్చే మార్పులపై ఓ స్పష్టతకు వచ్చారు. ఒత్తిడిని సమూలంగా నియంత్రించే ఎటువంటి ప్రతికూల ప్రభావాలూ లేని ఒకే ఒక్క సాధనం యోగా అని శాసీ్త్రయంగా నిర్ధారించారు. ఉదాహరణకు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు శరీరాన్ని అన్ని వైపులకూ వంచుతాం. దీనివలన మెదడులోని ఎమోషనల్‌ బ్రెయిన్‌ అనే భాగంలో భంగిమలకు అనుగుణంగా కృత్రిమ ఒత్తిడి ఏర్పడుతుంది. ఓ భంగిమలో ముందుకు వంగినప్పుడు తలలో రక్త ప్రసరణ జరిగి లాజికల్‌ బ్రెయిన్‌ స్పందిస్తే, మరో భంగిమలో ముందుకు వంగడం వల్ల పారా నాడీ వ్యవస్థలో రిలాక్స్‌ రెస్పాన్స్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియకు కొనసాగింపుగానే పారా సింపాథిటిక్‌ నాడీ వ్యవస్థలో స్విచ్‌లు, జంక్షన్లు ఉంటాయి. వివిధ ఆసనాలు వేసే క్రమంలో మెడ, నడుము, కాళ్లు, చేతులు, భుజం వంచడం ద్వారా ఈ స్విచ్‌లను నియంత్రించి మెదడులో ఒత్తిడి తగ్గుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది.

● బ్రెజిల్‌లోని ఇజ్రాయిలిటా ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వైద్య కేంద్రం పరిశోధకులు యోగా వల్ల మెదడులో కలిగే మార్పులను ‘ఫ్రంటైర్స్‌ ఇన్‌ ఈజింగ్‌ న్యూరో సైన్స్‌’ అనే సంచికలో తాజాగా ప్రచురించారు. యోగా చేసే 45 ఏళ్లు పైబడిన సీ్త్రలలో సెరిబ్రల్‌ కార్టిక్స్‌ పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ సెరిబ్రల్‌ కార్టిక్స్‌ పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్లే మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ యోగా యాంటీ ఏజింగ్‌, రివర్స్‌ ఏజింగ్‌ టెక్నిక్‌గా ఉపయోగపడి, సెరిబ్రల్‌ కార్టిక్స్‌ పరిమాణం పెంచుతుందని పేర్కొంది.

● మానసిక వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, ఫిజియోథెరపిస్టులు, జనరల్‌ ఎండీలు, ఆంకాలజిస్టులు తమ వైద్య సేవల్లో యోగాను అంతర్భాగం చేస్తున్నారు. దీంతో యోగా ఓ థెరపీగా కూడా ఎదిగింది.

● పోస్ట్‌ ట్రామా స్ట్రెస్‌ డిజార్డర్‌లో కూడా యోగానే మందు. అలాగే క్యాన్సర్‌ చికిత్సలో కీమో థెరపీని తట్టుకునేందుకు కూడా యోగా సహాయ పడుతుంది.

● చర్మం, జుట్టు ఆరోగ్యానికి, మలబద్ధకం నివారణకు, ప్రసవం సునాయాసంగా జరగడానికి, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో యోగా, ధ్యానం దివ్యౌషధాలు.

యోగాయే శ్వాసగా..

రాజమహేంద్రవరం నగరానికి చెందిన యోగా గురువు పతంజలి శ్రీనివాస్‌ దేశ విదేశాల్లో పర్యటిస్తూ, యోగా విశిష్టతనూ వివరిస్తూ, నేర్పిస్తున్నారు. రామ్‌దేవ్‌ బాబా శిష్యునిగా యోగ జీవితం ప్రారంభించిన ఆయన ప్రణవ సంకల్ప యోగ సమితి స్థాపించి, పదహారేళ్లుగా 400 ఉచిత యోగా శిబిరాలు నిర్వహించారు. యోగా శిక్షణ ద్వారా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోని ఎంతో మంది ఖైదీల్లో పరివర్తన తీసుకుని వచ్చారు. 15 హత్యలు చేసిన గ్యాంగ్‌స్టర్‌ కూడా ఆయన శిక్షణలో యోగా స్టార్‌గా మారారు. ఐటీడీఏ ఆధ్వర్యాన ఏజెన్సీ ప్రాంతంలోని 103 గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో యోగా శిక్షణ ఇచ్చారు. సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యాన సింగపూర్‌లో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. అంధ, చెవిటి, మూగ విద్యార్థులకు సైతం యోగ విద్యను అందించారు. ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ అనుమతితో ఓఎన్‌జీసీ ఆర్థిక సహకారంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 30 మంది ఖైదీలకు 9 నెలల పాటు యోగా శిక్షణ అందించారు. యోగా అనేది కేవలం ఫ్యాషన్‌ కోసం నేర్చుకునేది కాదని, మహర్షులు అందించిన గొప్ప వరమని పతంజలి శ్రీనివాస్‌ అంటారు. యోగాతో అనేక శారీరక, మానసిక రుగ్మతులను పొగట్టవచ్చని చెబుతారు.

43 ఏళ్లుగా యోగా శిక్షణ

తాళ్లపూడికి చెందిన యోగా గురువు నక్కా వెంకటేశ్వరరావు 43 ఏళ్లుగా అలుపెరగకుండా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. గాయత్రీ యోగా సేవా సమితి స్థాపించి వయస్సుతో నిమిత్తం లేకుండా ఇప్పటి వరకూ 15 వేల మందికి ఉచితంగా యోగా నేర్పించారు. ఉచితంగా జిమ్‌ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యోగా, ఆటలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. ఆయన 1985లో విశాఖపట్నంలో యోగా శిక్షణ పొందారు. పతంజలి యోగాలో కుండలి, ఓంకారం, ప్రాణాయామం, సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ, విలోమ, నాడీ సాధన, కపాలభాతిలో లౌలీ క్రియ, సూర్య నమస్కారాలతో పాటు హలాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం, పశ్చిమోత్తానాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, హంసాసనం, మయూరాసనం, తాడాసనం, వజ్రాసనం, బద్ధపద్మాసనం, వృక్షాసనం, పర్వతాసానం వంటివి వేయడంలో ఈయన దిట్ట. వెంకటేశ్వరరావు 62 ఏళ్ల వయస్సులోను 60కి పైగా ఆసనాలను అలవోకగా వేస్తారు. స్వతహాగా సైకిల్‌ మెకానిక్‌ అయిన ఆయన మొదట్లో ఏమీ చదువులేదు. యోగా నేర్చుకున్నాక క్రమంగా పదో తరగతి తరువాత డిగ్రీ ప్రైవేటుగా చదివారు. పాఠశాల విద్యార్థులకు నిరంతరం ఉచితంగా యోగా నేర్పిస్తారు. యోగాతో పాటు, ధ్యానం, నేత్ర సంచలన, స్థిర సంచలన, హస్త సంచలన వంటివి సాధన చేయిస్తారు. ఈసారి పోటీల్లో 600 మంది విద్యార్థులు పాల్గొనగా 100 మందికి బహుమతులు అందజేస్తున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు.

గిరిజన విద్యార్థులకు యోగా

నేర్పుతున్న పతంజలి శ్రీనివాస్‌

శుక్రవారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2024

ఆధునిక యాంత్రిక జీవనంలో మానవులు ఎన్నో ఆటుపోట్లకు, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ అంతా ఉరుకులు పరుగులే. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైతం కొంత సమయాన్ని కేటాయించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా మానసిక ఆందోళన, చిరాకు, కోపం వంటి వాటికి లోనవుతున్నారు. అవి మనసు పైనే కాకుండా శారీర ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం శూన్యం. ఇది మానసికంగా మరింత కుంగదీస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న వారి అనారోగ్య సమస్యలను పటాపంచలు చేసి, మానసిక ప్రశాంతతను చేకూర్చే దివ్యౌషధం యోగా. అంతర్గత చేతనా శక్తిని మనసుకు, శరీరానికి సంపూర్ణంగా అందించి సక్రమమైన జీవన విధానాన్ని అందించే అద్భుత ప్రక్రియ. రకరకాల మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తే, యోగా మాత్రమే దీర్ఘకాలిక ఊరటనందిస్తోంది. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

యోగా దినోత్సవం వచ్చిందిలా..

సనాతన భారతీయ శాస్త్రాల్లో యోగా ఒకటి.

క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలోనే పతంజలి మహర్షి దీనిని రచించారు. అనేక ప్రక్రియలపై పరిశోధనలు చేసి, స్వానుభవంతో ప్రపంచం ముందుకు తీసుకుని వచ్చారు. 2014 సెప్టెంబరు 27న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రతిపాదించారు. దీనికి అమెరికా, కెనడా, చైనా సహా 193 దేశాలు మద్దతు పలికాయి. దీంతో, ఈ దినోత్సవానికి నిర్ణీత తేదీ చెప్పాలని ఐక్యరాజ్య సమితి మోదీని కోరింది. ఆయన సూచనల మేరకు ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.

చిన్నతనం నుంచే..

తాళ్లపూడికి చెందిన కిలాని వర్షిత తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి రమేష్‌ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే నిత్యం యోగా సాధన చేస్తోంది. గురువు నక్కా వెంకటేశ్వరరావు వద్ద ప్రతి రోజూ ఉదయం యోగా సాధన సాగిస్తోంది. నిరంతర సాధనతో పలు కఠినమైన ఆసనాలను సైతం అలవోకగా వేస్తూ ఔరా అనిపించుకుంటోంది. ప్రాణాయామం, ధ్యానం, ఓంకారం, వజ్రాసనం, పర్వతాసనం, చక్రాసనం, నౌకాసనం, సర్పాసనం వంటివి వేస్తుంది. యోగా ద్వారా జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా ఒత్తిడి లేకుండా చదువుకోగలుగుతున్నానని వర్షిత చెబుతోంది.

నాడు గ్యాంగ్‌ స్టర్‌.. నేడు యోగా స్టార్‌

ఉత్తరాఖండ్‌లోని ఫితోడ్‌గఢ్‌ గ్రామంలో ఉన్నత కుటుంబంలో జన్మించాడు ప్రతాప్‌సింగ్‌. అతడి తండ్రి ఆర్మీ అధికారి. అన్న కూడా ఆర్మీలో చేరి అధికారి స్థాయికి ఎదిగాడు. తాను కూడా ఆర్మీలో చేరాలని ప్రతాప్‌సింగ్‌ చిన్నప్పుడే కల కన్నాడు. కానీ, పోలియో కారణంగా ఆ కల నెరవేరలేదు. దీనికి తోడు సవతి తల్లి సూటిపోటి మాటలు భరించలేక చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడు. ఢిల్లీ చేరుకున్నాడు. ఓ గ్యాంగ్‌స్టర్‌ వద్ద చేరాడు. 15 సంవత్సరాలకే దోపిడీలు, కిడ్నాప్‌లు చేశాడు. ప్రతాప్‌సింగ్‌ గ్యాంగ్‌ ఆగడాల కారణంగా ఢిల్లీ కళ్యాణ్‌పూర్‌లో అడుగు పెట్టాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ఎవరినైనా చంపాలనుకుని సుపారీ తీసుకుంటే వారికి చావు మూడినట్లే. అతి సమీపానికి వెళ్లి, గురి చూసి కాల్చి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తరువాతే ఆ గ్యాంగ్‌ అక్కడి నుంచి వెళ్తుందనే పేరొచ్చింది. పలు హత్య కేసులతో సంబంధం ఉన్న ప్రతాప్‌ సింగ్‌ ఏలూరు జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. యోగా గురువు పతంజలి శ్రీనివాస్‌ ఖైదీల్లో పరివర్తన తీసుకుని రావడానికి 2017లో యోగా నేర్పించారు. తొమ్మిది నెలల కాలంలో సంపూర్ణ శిక్షణలో భాగంగా యోగా, ధ్యానం నేర్చుకున్న ప్రతాప్‌సింగ్‌ పరివర్తన చెందాడు. చెడు మార్గాన్ని వీడి.. యోగా గురువుగా మారాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆనందయోగం
1/1

ఆనందయోగం

Advertisement
 
Advertisement
 
Advertisement