నిలిచిన గ్రానైట్‌ పలకల తొలగింపు - | Sakshi
Sakshi News home page

నిలిచిన గ్రానైట్‌ పలకల తొలగింపు

Published Wed, Jun 19 2024 11:20 PM | Last Updated on Wed, Jun 19 2024 11:20 PM

నిలిచ

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తూర్పు రాజగోపురానికి ఎదురుగా గల ఘాట్‌రోడ్‌ వద్ద మెట్లకు వేసిన గ్రానైట్‌ పలకలను తొలగించే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ గ్రానైట్‌ పలకలు విరాళంగా అందచేసిన దాత మాజీ మంత్రి సిద్దా రాఘవరావు బంధువులు వీటి తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ గ్రానైట్‌ పలకలు ఎండకు బాగా వేడెక్కిపోవడంతో ఈ మెట్ల మీద నడిచే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వీటిని తొలగించే పని చేపట్టారు. అయితే ఈ విషయం తెలిసిన దాత దేవస్థానానికి విచ్చేసి ఈ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ముందుగా విషయం చెబితే ఈ గ్రానైట్‌ పలకలను తొలగించకుండా ప్రత్యామ్నాయం ఆలోచించేవారమని చెప్పినట్టు సమాచారం.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

రత్నగిరి సత్యదేవుని ఆలయానికి బుధవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వారం రోజులుగా సూర్యభగవానుడి ప్రతాపంతో భక్తులు అల్లాడిపోయారు. అయితే బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండడంతో భక్తులు కొంత ఊరట చెందారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధికి తరలివచ్చారు. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది.

నేడు స్వామి,అమ్మవార్ల నిజరూప దర్శనం

గురువారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు నిజరూపదర్శనం ఇవ్వనున్నారు. ప్రతీ రోజు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు గురువారం కేవలం పుష్పాలంకరణలో శిలారూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిలిచిన గ్రానైట్‌ పలకల తొలగింపు
1/1

నిలిచిన గ్రానైట్‌ పలకల తొలగింపు

Advertisement
 
Advertisement
 
Advertisement