ఐపీఎస్‌ నవీన్‌కుమార్‌ కొడుకుపై కేసు  Police Case Registered Against IPS B Naveen Kumar Son in Alleged Land Grab | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ నవీన్‌కుమార్‌ కొడుకుపై కేసు 

Published Sat, Jan 13 2024 3:36 AM | Last Updated on Sat, Jan 13 2024 3:36 AM

Police Case Registered Against IPS B Naveen Kumar Son in Alleged Land Grab - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: మాజీ ఐఏఎస్‌ అధికారి భన్వర్‌లాల్‌ ఇంటిని కబ్జా చేయడానికి ఐపీఎస్‌ అధికారి నవీన్‌కుమార్‌ నకిలీ పత్రాలతో ప్రయతి్నంచిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్‌కుమార్‌ భట్‌ కుమారుడు సాహిత్‌పై కూడా జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు శుక్రవారం సాహిత్‌కు నోటీసులు జారీ చేశారు.

మరోపక్క భన్వర్‌లాల్‌ భార్య మణిలాల్‌ ఫిర్యాదుతో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో నమోదైన కేసు విచాణకు నవీన్‌కుమార్‌ శుక్రవారం గైర్హాజరయ్యారు. దీంతో ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. భన్వర్‌లాల్‌కు జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో సొంత ఇల్లు ఉంది. ఆయన పదవీ విరమణ చేయకముందే ఇంటిని నవీన్‌కుమార్‌ సోదరుడు సాంబశివరావు అద్దెకు తీసుకున్నారు. 2019లో భన్వర్‌లాల్‌ పదవీ విరమణ చేయడంతో తమ ఇల్లు ఖాళీ చేసి అప్పగించాల్సిందిగా సాంబశివరావును కోరగా, ఆయన స్పందించలేదు.

ఆ ఇంట్లో ఐపీఎస్‌ అధికారి నవీన్‌కుమార్‌ కూడా ఎలాంటి రెంటల్‌ అగ్రిమెంట్‌ లేకుండా ఉన్నారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరితో పాటు సాంశివరావు భార్య రూపా డింపుల్‌ నకిలీ పత్రాలు సృష్టించి, భన్వర్‌లాల్‌తో పాటు ఆయన భార్య మణిలాల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటిని కబ్జా చేయాలని చూశారు. మణిలాల్‌ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్‌ 17న సీసీఎస్‌ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. గత నెల 22న సాంబశివరావు దంపతులను అరెస్టు చేశారు. నవీన్‌కుమార్‌కు గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవీన్‌కుమార్‌ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు.  

బౌన్సర్లతో బెదిరింపు.. 
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.72లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న తమ ఇంట్లోకి వెళ్లేందుకు భన్వర్‌లాల్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన భార్య మణిలాల్‌ గురువారం సాయంత్రం అక్కడకు వెళ్లి కొన్ని మరమ్మతులు చేయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ ఇంటి వద్ద ఉన్న సాహిత్‌ ఇద్దరు బౌన్సర్లతో కలసి బీభత్సం సృష్టించారు. మణిలాల్‌ ఉండగానే ఇంటి లోపలి నుంచి గడియ పెట్టడంతో పాటు అతి సమీపం నుంచి బెదిరిస్తూ మాట్లాడారు. చాలాసేపు నిర్బంధించినంత పని చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన ఆమె జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సాహిత్‌ భట్‌ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement