నీళ్లు+రసాయనాలు= కల్లు | Palm Wine Preparation With Raw Materials Police Arrested Four People At Warangal | Sakshi
Sakshi News home page

నీళ్లు+రసాయనాలు= కల్లు

Published Fri, Oct 15 2021 3:10 AM | Last Updated on Fri, Oct 15 2021 4:08 AM

Palm Wine Preparation With Raw Materials Police Arrested Four People At Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: అచ్చం కల్లు మాదిరిగానే తెల్లటి నురుగు పొంగుతున్నట్టుగా కనిపించి నాలుకకు రుచించే ‘కృత్రిమ కల్లు’ బాగోతాన్ని వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. గతంలో అల్ఫోజోలం, క్లోరల్‌ హైడ్రేట్, యూరియా వంటి రసాయనాలను కొంతమేర కల్లులో కలిపి విక్రయించిన నేరగాళ్లు.. ఇప్పుడు అసలు ఆ కాస్త కల్లు లేకుండానే నీళ్లలో రసాయనాలు, పేస్టు కలిపి తయారుచేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ తరహా కేసు ఇదే మొదటిదని పోలీసులు చెబుతున్నారు.

దసరా వేళ ఈ ముఠా అఘాయిత్యాలు వెలుగులోకి రావడంతో కల్లు ప్రియులు జంకుతున్నారు. వరంగల్‌లోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీపురం కల్లు కాంపౌండ్‌పై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. 300 లీటర్ల కృత్రిమ కల్లుతోపాటు ముడి పదార్థాలు అమ్మోనియా, సచారిన్‌ పౌడర్, సోప్‌ బెర్రీ, గోబైండా పేస్ట్, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఏడాది నుంచి గుట్టుగా..  
నిజామాబాద్, కామారెడ్డిలలో కల్లు కాం పౌండ్‌ నిర్వహించిన నరేందర్‌ గౌడ్‌ ఎక్సైజ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. కరోనా దెబ్బకు వ్యాపారం సజావుగా సాగకపోవడంతో వరంగల్‌లోని రంగశాయిపేటలో గావిచర్ల క్రాస్‌రోడ్డు వద్ద ఉంటున్న బంధువు పరకాల నవీన్‌ కుమార్‌ వద్దకు వచ్చాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కృత్రిమ కల్లు తయారీ విషయాన్ని అతడితో చెప్పా డు. దేశాయిపేటకు చెందిన సారంగపాణికి చెందిన లక్ష్మీపురంలో కాంపౌండ్‌ను అద్దెకు తీసుకున్నాడు.

దేశాయిపేటకు చెందిన గోడిశాల ఉగేందర్, జూలూరి రాజుల సహకారం తో రోజుకు 100–150 లీటర్ల వరకు కృత్రిమ కల్లు తయారుచేశాడు. ఇలా ఏడాది నుంచి నగరంలోని కాశీబుగ్గకు చెందిన రామకృష్ణ, ఎల్‌బీనగర్‌కు చెందిన సాంబ య్య, గుట్టకు చెందిన కలమ్మ, లక్ష్మీపురంకు చెందిన రవి, వరంగల్‌ అండర్‌ బ్రిడ్జిలోని సత్యం దుకాణాలకు లీటర్‌ కల్లును రూ.30 చొప్పున విక్రయించాడు. రోజుకు రూ.3 వేల నుంచి 4 వేల వరకు గడించాడు.

కాం పాండ్‌ యజమాని సారంగపాణికి ఇదంతా తెలిసినా మిన్నకుండిపోవడంతోపాటు వారి కి సహకరించారన్న ఉద్దేశంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్‌ శ్రీనివాస్, ఆర్‌.సంతోష్‌ నేతృత్వం లోని బృందం కాంపాండ్‌పై దాడిచేసి నలుగురిని అరెస్టు చేయగా, సారంగపాణి పారి పోయాడు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు.  

ఈ కల్లు డేంజర్‌ 
ఈ కృత్రిమ కల్లు తయారీలో వాడే రసాయన మిశ్రమాలు ప్రాణాంతకం. అమ్మోనియా వల్ల మత్తు, సచారిన్‌ పౌడర్‌తో తీపి, సోప్‌బెర్రీతో కాస్త తెల్లటి నురుగ, గోబైండా పేస్ట్‌తో పులుపు రుచి వస్తుంది. దీన్ని తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కాళ్లు, చేతులు లాగడం, మతిస్థిమితం కోల్పోవడం జరుగుతాయి. ఒకసారి ఈ కల్లు రుచిచూస్తే మళ్లీ తాగాలనేంతగా అలవాటుపడతారు. ఇది ఆరోగ్యంపై దుష్ఫ్రభావాన్ని చూపుతుంది. బాధితులు త్వరగా చికిత్స పొందితే మంచిది. 
– డాక్టర్‌ జి.చంద్రశేఖర్, ఫిజీషియన్‌. ఎంజీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement