Cid Key Decision In The Margadarsi Chitfunds Scam Case, Know Details - Sakshi
Sakshi News home page

Margadarsi Chitfunds Scam Case: ఛీటింగ్‌ ‘మార్గం' మూత!

Published Sat, Jul 29 2023 4:38 AM | Last Updated on Sat, Jul 29 2023 8:47 AM

CIDs key decision in the Margadarshi Chitfunds case - Sakshi

అతిపెద్ద కార్పొరేట్‌ మోసంమార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ మోసానికి పాల్పడిందని సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ పేర్కొన్నారు. మార్కెట్‌లో పేరుందని చెప్పుకున్నప్పటికీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్‌ కుంభకోణంలో ఎన్‌రాన్‌ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్‌ కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడు­లపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గ­దర్శి చిట్‌ఫండ్స్‌కు ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్‌ ప్రైజస్‌లో ఉన్న వాటాలను అటాచ్‌ చేయాలని నిర్ణయించింది.

రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మరో­వైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన ఏడు కేసుల్లో రెండింటిలో సీఐడీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. సీఐడీ ఐజీ సీహెచ్‌.శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ మీడియాతో మాట్లా­డారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పేరిట రామోజీ­రావు, శైలజా కిరణ్‌ అతిపెద్ద కార్పొరేట్‌ మోసా­నికి పాల్పడ్డారని చెప్పారు. నిబంధన ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..

మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి పెట్టిన పెట్టుబడులను సీఐడీ అటాచ్‌ చేస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వివిధ మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను అటాచ్‌ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీని అనుమతినిస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

 తాజాగా ఉషాకిరణ్‌ మీడియా లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలను అటాచ్‌ చేసేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పేరిట ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్‌ ప్రైజెస్‌లో 44.55 శాతం వాటా అటాచ్‌ కానుంది.

ఆ సంస్థల్లో ప్రధాన వాటాలను సీఐడీ అటాచ్‌ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని అటాచ్‌ చేయనుంది.

రెండు కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు
చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లు (ఫోర్‌మెన్‌)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్‌ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

ఏడు కేసుల్లో రెండింటిలో చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. మిగిలిన కేసుల్లో కూడా త్వరలోనే చార్జ్‌షీట్లు దాఖలు చేయడంతోపాటు చట్టపరంగా తదుపరి చర్యలు చేపడతామని సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలిపారు. సీఐడీ విచారణకు గైర్హాజరై రామోజీరావు, శైలజా కిరణ్‌ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఈ అంశంతోపాటు చార్జ్‌షీట్‌ దాఖలు తరువాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్‌ రిజిస్ట్రార్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని ఇతరులే పిటిషన్లు దాఖలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు అమిత్‌ బర్దర్‌ తెలిపారు.

తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు వెల్లడించినట్లు చెప్పారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు.

మూతపడ్డ ‘మార్గదర్శి’ వెబ్‌సైట్‌
ఆర్థిక అక్రమాలకు పాల్పడి పీకల్లోతు కూరుకుపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తాజాగా తమ వెబ్‌సైట్‌ను మూసివేసింది. ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థల్లో వాటాల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించినట్లు సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దన్‌ వెల్లడించిన కాసేపటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ వెబ్‌సైట్‌ను మూసివేయడం గమనార్హం.

మార్గదర్శి డాట్‌కామ్‌ పేరుతో నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌ శుక్రవారం సాయంత్రం నుంచి ఓపెన్‌ కావడం లేదు. వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేయగా ‘నిర్వహణ పరమైన అంశాలతో వెబ్‌సైట్‌ అందుబాటులో లేదు. త్వరలోనే పునరుద్ధరిస్తాం’ అనే సందేశం కనిపిస్తోంది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన అధికారిక సమాచారం అంతా అందులోనే ఉంటుంది. హఠాత్తుగా వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల వివరాలను గోప్యంగా ఉంచేందుకే వెబ్‌సైట్‌ను మూసివేసినట్లు భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement