మార్కెట్‌కు మళ్లీ నష్టాలు | Sensex tumbles over 500 points on weak global trends, foreign fund outflows | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు మళ్లీ నష్టాలు

Published Fri, Mar 3 2023 12:47 AM | Last Updated on Fri, Mar 3 2023 12:47 AM

Sensex tumbles over 500 points on weak global trends, foreign fund outflows - Sakshi

ముంబై: స్టాక్‌ సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్‌ 502 పాయింట్లు పతనమై 58,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్లు క్షీణించి 17,322 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, రియల్టీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల్లో కదలాడాయి. సెన్సెక్స్‌ 545 పాయింట్లు నష్టపోయి 59,411 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు క్షీణించి 17,306 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,771 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,129 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.60 స్థాయి వద్ద స్థిరపడింది. అధిక ద్రవ్యోల్బణం మరికొంత కాలం కొనసాగొచ్చనే ఆందోళనల మధ్య వడ్డీరేట్లు మరింత పెరుగుతాయనే భయాలతో ప్రపంచ  మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
 
‘‘అమెరికాలో ద్రవ్యోల్బణం కొనసాగొచ్చని ఇటీవల విడుదలైన ఆ దేశపు స్థూల ఆర్థిక డేటా సూచించడంతో పదేళ్ల బాండ్లపై రాబడి నాలుగుశాతం మించి నమోదైంది. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్‌ వంటి వర్థమాన దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఎఫ్‌ఐఐలు వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్లలో నికర విక్రయదారులుగా నిలిచారు. లార్జ్‌ క్యాప్‌ షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

అదానీ షేర్లలో రెండోరోజూ ర్యాలీ  
అదానీ గ్రూప్‌ తన లిస్టెడ్‌ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించి రూ.15,446 కోట్లు సమకూర్చుకోవడంతో ఈ గ్రూప్‌ షేర్లలో రెండోరోజూ ర్యాలీ కొనసాగింది. మరోవైపు హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్‌డీటీవీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్లు ఐదు శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ పోర్ట్స్‌ 3.5%, అదానీ ఎంటర్‌ప్రెజెస్‌ 3%, ఏసీసీ సిమెంట్స్‌ ఒకటిన్నర శాతం పెరిగాయి. గత రెండురోజుల్లో రూ.70,302 కోట్ల సంపద సృష్టి జరిడంతో గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement